Formula milk mistakes: పిల్లలకు డబ్బా పాలు పడుతున్నారా? మీకు తెలీకుండా చేసే తప్పులివే
Formula milk mistakes: ఫార్ములా పాల తయారీలో కొన్ని తప్పులు చేయకూడదు. వాటివల్ల పిల్లల ఎదుగుదల మీద ప్రభావం ఉంటుంది. అవేంటో చూడండి.
పిల్లలకు తల్లిపాలు సరిపోకపోకపోయినా, తల్లి పాలు పట్టలేని స్థితిలో ఉన్నా ఫార్ములా పాలు పట్టాల్సి వస్తుంది. అయితే ఈ పాలు తయారు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లల ఆరోగ్యం మీద, ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. అవేంటో చూడండి.
1. ఫార్ములా కొలత:
ఒక చెంచా ఫార్ములా పొడికి ఎన్ని నీళ్లు పోయాలో మీరు కొన్న ఫార్ములా పొడి డబ్బా మీద ఉంటుంది. దాన్ని బట్టి ఆచీతూచీ పాలు తయారు చేయాలి. పొడి కొలతను బట్టి నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువగా పోయడం వల్ల శిశువుకు తక్కువ పోషకాలు అందుతాయి. ఆ ప్రభావం వాళ్ల ఎదుగుదల మీద ఉంటుంది. అలాగే ఎక్కువ పొడి కలిపినా కూడా ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఉండదు. దానివల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.
2. నిల్వ చేయడం:
వీలైనంత వరకు పిల్లలకు పాలు పట్టాలనుకున్నప్పుడు వెంటనే ఫార్ములా పాలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ ముందుగానే పాలు రెడీ చేసుకోవాల్సి వస్తే ఫార్ములా పౌడర్ కలిపేసి వెంటనే ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఎలాంటి మైక్రోబయల్ ఎదుగుదల లేకుండా ఉండటానికి ఇదొక ముందు జాగ్రత్త. లేదంటే పౌడర్ లేబుల్ మీద రిఫ్రిజిరేషన్ గురించి ఏమైనా సూచనలు ప్రత్యేకంగా ఇచ్చారేమో చూసి అవి పాటించండి. అంతేకానీ పాలు కలిపి పావుగంట కూడా అలా ఉంచేయకూడదు.
3. అవి పడేయాల్సిందే..:
కొన్నిసార్లు పిల్లలు మీరు కలిపినన్ని పాలు పూర్తిగా తాగేయరు. అలాగని వాటిని అలాగే ఉంచి మళ్లీ పట్టకూడదు. ఒక్కసారి పిల్లల నోటికి తాకాయి అంటే.. ఫార్ములా పాలను వెంటనే పడేయాలి. మళ్లీ అవసరమైతే కొత్తవి కలుపుకోవడమే.
4. ఎన్ని పాలు కలపాలి:
ఈ సమాచారం అంతా ఫార్ములా పౌడర్ డబ్బా మీద వివరంగా రాసి ఉంటుంది. అది చదవకపోతేనే సమస్యలన్నీ వస్తాయి. అలాగే కొన్నిసార్లు డాక్టర్లు చెప్పినన్ని పాలు కలపాల్సి ఉంటుంది. వాళ్ల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ పాలు అవసరం. దాన్ని బట్టి ఎన్ని పూటలు తాగించాలి, ఎన్ని తాగించాలనే విషయంలో స్పష్టత పాటించండి. అలాగే పాల సీసాలో ముందు పౌడర్ వేసి తర్వాత నీళ్లు పోస్తారు. అది సరికాదు. దానివల్ల పౌడర్ కింది భాగంలో చేరుతుంది. అందుకే ముందుగా నీళ్లు పోసి అందులో ఫార్ములా పొడి కలపాలని గుర్తుంచుకోండి.
5. ఎలాంటి నీళ్లు వాడాలి?
మరిగించి చల్లార్చిన నీల్లు మాత్రమే ఫార్ములా పాల తయారీకి వాడాలి. ముందుగా ఒక పాత్ర శుభ్రం చేసి అందులో నీళ్లు పోసి కనీసం రెండు నిమిషాలు మరగనివ్వాలి. ఈ నీళ్లు స్టెరిలైజ్ చేసిన బాటిల్ లో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడొచ్చు. నీళ్లు వేడి చేసిన వెంటనే ఫార్ములా కలపాల్సి వస్తే.. నీళ్లలో పౌడర్ కలిపి పాలు తయారు చేయండి. తర్వాత పాల డబ్బా మీద చల్లటి నీళ్లు పోస్తే చల్లగా అయిపోతాయి. పాలు పట్టేముందు మీ చేతి మీద కొన్ని చుక్కలు వేసుకుని ఎక్కువ వేడి లేకపోతేనే పాలు పట్టడం మర్చిపోకండి.