పిల్లలకు ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళు. వారి చిన్న బొజ్జలను నింపేందుకు తల్లులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే పిల్లలకు పోషకమైన ఆహారం చాలా అవసరం. లేకపోతే వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టడానికి అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ వాటి ఎంపికలో జాగ్రత్త వహించాలి. లేకపోతే పిల్లలకు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పిల్లలకు ఏ ఆహార పదార్థాలు ఇవ్వకూడదు, ఏ రకమైన ఆహారం సరైనది అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి.
పిల్లలు ఇష్టంగా తింటారనో, త్వరగా అయిపోతుందనో పిల్లల లంచ్ బాక్స్‌లో ఎప్పటికీ ఇన్‌స్టంట్ నూడుల్స్ పెట్టకండి. పిల్లలు నూడుల్స్ అడుగుతారు, కానీ ఉదయం తయారు చేసిన నూడుల్స్ మధ్యాహ్నం టిఫిన్ సమయానికి తినడానికి సరిపోవు. అంతేకాకుండా, నూడుల్స్‌లో అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన పిండి, సంరక్షణకారులు ఉంటాయి. వాటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దానికి బదులుగా, ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని ఇవ్వండి. ఇవి ఆరోగ్యానికి, శరీరానికి మంచిది.
కచోరి, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, పకోడాలు ఇలా అనేక రకాల ఆహార వేయించిన స్నాక్స్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. పెద్దలు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ వాటిని టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తే ఇబ్బందులు తప్పవు. వాటిలో ఎక్కువగా నూనె, కొవ్వు ఉంటుంది. పెరుగుతున్న పిల్లలకు పోషకమైన ఆహారం అవసరం, వేయించిన స్నాక్స్ కాదు. కాబట్టి పిల్లలకు వేయించిన స్నాక్స్ ఇవ్వడం వల్ల వారిలో అనవసరమైన బరువు పెరుగుదలకు మీరు పరోక్ష కారణం అవుతారు. దానికి బదులుగా ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి.
కొన్నిసార్లు ఇంట్లో ముందు రోజు మిగిలిన ఆహారం లేదా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేసి పిల్లల లంచ్ బాక్స్‌లో పెడతారు. అలా పెట్టిన మిగిలిన ఆహారం మధ్యాహ్నం సమయానికి చెడిపోయే అవకాశం ఉంది. దాన్ని పిల్లలు తెలియకుండా తింటే అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల లంచ్ బాక్స్ లో పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
పిల్లల ఆహారం రుచికరంగా ఉండాలి మీ పిల్లలకు తీపి అంటే ఇష్టం. అలాగని మీరు వారికి అధిక చక్కెరతో తయారు చేసిన ఆహారాన్ని ఇవ్వకండి. చాక్లెట్, కుకీస్, క్యాండీ, జెల్లీ వంటి తీపి పదార్థాలను పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టకండి. కొద్దిగానే కదా ఏమీ కాదులే అని మీరు అనుకోవచ్చు. కానీ, అలా రోజూ కొద్ది కొద్దిగా తీసుకుంటే తీపి పదార్థాల వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలలో కృత్రిమ చక్కెర, రంగులు, రుచులు ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచివి కావు. దానికి బదులుగా, తాజా పండ్లు, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఇవ్వండి.
పిల్లలు ఇది వద్దు, అది వద్దు అని అల్లరి చేస్తారు. ఇంట్లో తయారు చేసిన ఆహారం వద్దు అంటారు. చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలనే ఎంచుకుంటారు. కానీ వారి కోరిక ప్రకారం మీరు చిప్స్, బిస్కెట్లు, బేకరీ పదార్థాలను బాక్సుల్లో పెట్టి పంపకూడదు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా ప్రభావం చూపే విష పదార్థాలు. వీటిల్లో అనేక రకాల కృత్రిమ రంగులు, ఆరోగ్యానికి హానికారకమైన పామాయిల్, అధిక చక్కెర, మసాలా దినుసులు, ఉప్పు ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే, ప్యాక్ చేసిన, క్యాన్లలో లభించే జ్యూస్‌లు కూడా ఆరోగ్యానికి మంచివి కావు.