Author Interview : రాజకీయాలకు రిపేరింగ్.. ఇది మన అందరి బాధ్యత-author nelanti madhu interview on recent politics ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Author Interview : రాజకీయాలకు రిపేరింగ్.. ఇది మన అందరి బాధ్యత

Author Interview : రాజకీయాలకు రిపేరింగ్.. ఇది మన అందరి బాధ్యత

Anand Sai HT Telugu
Apr 14, 2023 12:04 PM IST

రాజకీయాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయంటున్నారు రచయిత నేలంటి మధు. ఆయన కలం నుంచి 18 పుస్తకాలు వచ్చాయి. రాజకీయ వృత్తి.. నాయకత్వ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే పుస్తకాన్ని రచించారు. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన మెుట్టమెుదటి పుస్తకం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద కెరీర్ రాజకీయం అంటున్న నేలంటి మధుతో ఇంటర్వ్యూ..

రచయిత నేలంటి మధు
రచయిత నేలంటి మధు

ప్రశ్న : ఒక మంచి పుస్తకం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు? మీ పుస్తకంలో జీవితాన్ని మార్చేది ఏమైనా ఉందా? అసలు ఈ బుక్ వల్ల ప్రయోజనం ఏమిటి? ఏ ప్రయోజనం ఆశించి ఈ పుస్తకం రాశారు?

జవాబు : ఈ పుస్తకం ఒక్కరి జీవితాన్నే కాదు వందల, వేల మంది జీవితాలను మారుస్తుంది. పుస్తక సబ్జెక్టే జీవితాలను నడిపించే రాజకీయం.. కాబట్టి రాజకీయ వృత్తి : నాయకత్వ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్న టైటిల్ తో వచ్చిన నా పుస్తకం జీవితాలనే కాదు, సమాజాన్ని కూడా మార్చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశిస్తున్న రాజకీయాన్ని మనకు అనుకూలంగా వాడుకుంటూ అభివృద్ధి సాధించడం ఎలా అనేది రాశాను. వ్యక్తులను, సమాజాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి.. అంటే నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవడం కన్నా మించిన ప్రయోజనం ఏమంటుంది?

ప్రశ్న : పుస్తకానికి రాజకీయ వృత్తి అని టైటిల్ పెట్టారు.. రాజకీయాన్ని వృత్తి అని ఎలా చెప్తారు?

జవాబు : రాజకీయానికి ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. సేవ అని కొందరు, సామాజిక బాధ్యత అని కొందరు, ప్రజా ప్రయోజనం కోసం దీక్షగా కొనసాగించాల్సిన పని అని కొందరు.. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. సందర్భాన్ని బట్టి అవి సరైనవే అనిపిస్తాయి. అయితే, ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా సేవా దృక్పథంతో సామాజిక బాధ్యతగా చేసే పనినే వృత్తి అని అత్యధికులు భావిస్తారు. రాజకీయం కూడా వ్యక్తుల అవసరాలు తీర్చడం ద్వారా సంక్షేమం కల్పిస్తూ వారి సుఖ సంతోషాల కోసం కృషి చేస్తుంది. క్రమబద్ధమైన సామాజిక జీవనాన్ని సుస్థిర పరుస్తూ సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుంది. ఈ విధంగా ప్రజల కోసమే ప్రజా కార్యంగా కొనసాగుతుంది కాబట్టి, రాజకీయాన్ని కూడా వృత్తి (ప్రొఫెషన్)అనవచ్చు.

అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో నిర్వహించే వృత్తికి కొన్ని లక్షణాలు (క్యారెక్టరైస్టిక్స్) ఉండాలని నిర్దేశించారు. అభ్యుదయకరంగా శాఖోప శాఖలుగా విస్తరిస్తూ.. దానిలో పనిచేసే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం, ఆదాయ మార్గాలను సృష్టించడం.. వారి ఉన్నతికి పనిచేయగలిగిన లక్షణాలు దానికి ఉండాలని సూచించారు. అంతే కాదు, అందులో పని చేసే వారికి ప్రత్యేక నైపుణ్యాలు, శిక్షణ అవసరం. ఈ లక్షణాలన్నీ దాదాపు కలిగి ఉన్నందున రాజకీయాన్ని నేను వృత్తిగా ప్రస్తావించాను.

రాజకీయం ప్రస్తుతం చాలామందికి పేరు ప్రఖ్యాతులు సంపాదించే పనిగా ఉపకరిస్తుంది. మరి కొందరికి వృత్తి, ఉపాధి సాధనంగా.. వ్యాపార సరుకుగా.. ఆదాయ మార్గంగా మారింది. ఇవన్నీ వృత్తి లక్షణాలు కాబట్టే రాజకీయాన్ని వృత్తి అని సంబోధించాను. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ సబ్జెక్టు మాదిరిగానే నిత్యం సామాజిక గమనానికి తగినట్టు తాను కూడా రూపు మార్చుకొంటూ ప్రవాహంలా ఉన్నతి వైపు సాగిపోతూ ఉంటున్నది. ఈ క్రమంలో అది ఎవరెవరికి ఎలాంటి మేలు చేస్తుందో బుక్ లో రాశాను.

ఈ పుస్తకం రాజకీయ రంగంలోకి రావాలనుకునే వారికి, రాజకీయ రంగంలో పనిచేస్తున్న వారికి రాజకీయ వృత్తి దశ దిశలను సూచిస్తుంది. పోస్ట్ కోవిడ్ దశ పాలిటిక్స్ ను అర్థం చేయిస్తూ.. రాజకీయ నాయకులను ఒక సరికొత్త దిశ వైపు నడిపిస్తున్నది. అందుకనే ఈ పుస్తకం ప్రస్తుత కాలానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న : రాజకీయ వృత్తిపై బహుశా ఇదే మొదటి పుస్తకం.. ఇన్నేళ్ల రాజకీయ భారతంలో ఎవరూ ఇలాంటి పుస్తకం రాయలేదు. మరి మీకెందుకు రాయాలనిపించింది?

జవాబు : రాజకీయ విధానాలపైన, వ్యక్తులపైనా ఇప్పటివరకు చాలా పుస్తకాలు వచ్చాయి. కానీ రాజకీయరంగం వృత్తిగా ఇప్పుడిప్పుడే ఎమర్జవుతుంది. అందుకే వృత్తి అనే అంశాన్ని కొత్తగా తీసుకున్నాను. దీంతోపాటు ప్రస్తుతం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. కానీ వారికి చాలా భయాలు సందేహాలు ఉన్నాయి. దానికి తోడు యువత ప్రొఫెషనల్ కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే వారి సందేహాలను తొలగించి, రాజకీయం ఒక నోబుల్ ప్రొఫెషన్ అని తెలియజెప్పడానికే ఈ పుస్తకం రాశాను.

ఇది ఒక కీలకమైన, చారిత్రాత్మకమైన సందర్భం. ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రాకపోతే వారికే కాదు సమాజానికి, వ్యవస్థకు చెప్పలేనంత నష్టం జరుగుతుంది.

ప్రశ్న : ప్రస్తుత కాలంలో చాలామంది యువతీయువకులు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉద్యోగం చేయడానికి పోటీ పడుతున్నారు. కానీ, రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయ ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పుస్తకం ఏ విధంగా ఉపయోగపడుతుంది?

జవాబు : ఈ పుస్తకాన్ని వృత్తి అనే కోణంలో డీల్ చేశాం. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాల్లో కీలకమైన రాజకీయం.. మిగిలిన మూడింటిని లీడ్ చేస్తుంది. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ కంటే ఉన్నత స్థాయిలో ఉన్నది. యువత కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ఐఏఎస్, ఐపీఎస్ పొందేందుకు పడే కష్టం కంటే తక్కువ కష్టంతోనే రాజకీయంలో సులభంగా ఉన్నతి పొందవచ్చు. రాజకీయంగా ఉపాధి పొందాలనుకునే యువతకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. కేవలం నాయకత్వపరంగానే కాకుండా ఉద్యోగ, ఉపాధి పొందే మార్గాల గురించి కూడా దీనిలో వివరించాను. రాజకీయ రంగంలోనే కాదు దాని సంబంధిత రంగాల్లోనూ గల నాయకత్వ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కెరీర్ అంశాలను ఈ పుస్తకంలో చర్చించాను. ఈ విషయంలో దీన్ని మించిన పుస్తకం ఇప్పుడైతే లేదు.

ప్రశ్న : ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి ఈ పుస్తకం ద్వారా కలిగే లాభాలు ఏమిటి?

జవాబు : ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారు, నాయకులు మారుతున్న కాలానికి అనుగుణంగా పొలిటికల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ తర్వాత సమాజంలో అవసరాలు మారాయి. సమాజం సాంకేతికరణ చెందింది. ప్రజల జీవన విధానం మారింది. దీనికనుగుణంగా రాజకీయ నాయకులు వారి వ్యవహార శైలిని మార్చుకోవాలి. కొత్త అవసరాలకు తగ్గట్టు తమ కార్యాచరణ ఎలా మార్చుకోవాలనే అంశంపై పుస్తకంలో వివరించాను. కొత్తవారు అయితే రాజకీయాల్లో ఎలా ముందుకు సాగాలనే అంశంపై కూడా చర్చించాను. ఇవన్నీ పొలిటీషియన్స్ ను సరికొత్త గా ముందుకు నడిపిస్తాయి. వారికి ఇదొక పెద్ద మేలే కదా మరి.

ప్రశ్న : మీ దృష్టిలో యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలు? రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగడం వల్ల వ్యవస్థలో జరిగే మార్పులేమిటి?

జవాబు : యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం ప్రధానంగా వారు సామాజిక అంశాలకు దూరంగా ఉండటమే. రాజకీయాలకు, మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది.. వారి జీవితంలో ప్రతి అంశమూ రాజకీయ ప్రభావితమే. ఈ నిజాన్ని వారు గుర్తించకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. రాజకీయం మంచిది కాదు.. రాజకీయ నాయకులందరూ అవినీతిపరులని ఒక చెడు అభిప్రాయంతో యువత జీవిస్తున్నది. కానీ అది తప్పు. నాయకులు, ప్రభుత్వాలు మనకు ఏం చేయట్లేదు అని యువత అనుకుంటున్నది. కానీ మనం కూడా రాజకీయాల్లో భాగస్వాములు అయ్యి మన పాత్రను సక్రమంగా నిర్వర్తించి, మన గొంతుకను వినిపిస్తేనే హక్కులను సాధించుకోగలమని గుర్తించడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషించకపోవడం ఎంతో ప్రమాదం. అది వారి జీవితాన్ని, భవిష్యత్తును అంధకారమయం చేస్తుంది.

ప్రశ్న : మీరు ఈ పుస్తకం ద్వారా ప్రజా రంగంలో, రాజకీయంగా, ప్రభుత్వపరంగా నాయకత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రజలు ఎందుకు విఫలమవుతున్నారు. దీనిపై మీ సూచనలు ఏమిటి?

జవాబు : రాజకీయాలకు దూరంగా మసలుకోవడం వలన దానిపై మనకు ఒక అవగాహన లేకుండా పోతుంది. ఈ అవగాహనా రాహిత్యం కారణంగా ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం లోపిస్తుంది. దీని ద్వారా రాజకీయాల్లోని అవకాశాలు, ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంలో చాలామంది విఫలం అవుతున్నారు. రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం వలనే చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. డబ్బుంటేనో, వారసత్వం ఉంటేనో రాజకీయం చేయగలమనే అపోహలు వస్తాయి. ఇలాంటి భయాలు, అపోహలు, సందేహాలను తొలగించేందుకు పుస్తకంలో పొలిటికల్ కౌన్సిలింగ్ అనే చాప్టర్ రాశాను. ఇది చదివితే యువతకున్న సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా గాని డైరెక్ట్ గా గాని మమ్మల్ని సంప్రదిస్తే క్లియర్ చేస్తాం.

ప్రశ్న : రాజకీయాలకు రిపేరింగ్ అనే కాంట్రవర్షియల్ పదాన్ని ఉపయోగించారు కదా.. దీనిపై రాజకీయ నాయకులకు, ప్రజలకు, ఆశావహులకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి?

జవాబు : రాజకీయం చెడిపోయిందని మనందరం భావిస్తున్నాం. రాజకీయ నాయకులు స్వార్థపరులు అయ్యారని అనుకుంటున్నాం. అలాంటప్పుడు రాజకీయాలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది కదా. ఏదైనా వస్తువు చెడిపోయినప్పుడు బయట పడేస్తాం.. లేకపోతే రిపేర్ చేసుకుంటాం. రాజకీయం కూడా అలాంటిదే. వ్యవస్థను నడిపించే రాజకీయాన్ని వదులుకోలేము. అందుకే, రాజకీయాలను కూడా రిపేరింగ్ చేసుకుని మనకనుకూలంగా మార్చుకోవాలి. దాని గురించిన పూర్తి సమాచారాన్ని ఈ చాప్టర్లో వివరించాను. అయితే, రాజకీయాలకు రిపేరింగ్ అనే పదం కాంట్రవర్షియల్ అని మీరు అనుకోవచ్చు. కానీ, రాజకీయాలను మనకు ఏవిధంగా అనుకూలంగా మార్చుకోవచ్చో ఈ చాప్టర్ లో చర్చించాను. రాజకీయాలకు దూరంగా ఉన్న యువతను, ప్రజలను ఇటువైపు ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఈ చాప్టర్ కి ఆ పేరు పెట్టాను. అప్పుడు వారికి ఒక అవగాహన వస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని చదివితే రాజకీయాలకు రిపేరింగ్ అనేదే సరైన పదమని అంటారు.

ప్రశ్న : ఇలాంటి పుస్తకం రాయడానికి మీరు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఉంటారు కదా.. ఈ అనుభవంతో భవిష్యత్తులో పార్టీలకుగాని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి గాని ఏమైనా సేవలు అందించాలనుకుంటున్నారా?

జవాబు : నాకు ప్రత్యక్షంగా రాజకీయాలతో అనుబంధం ఉంది. జర్నలిజంలో 30 ఏళ్లకు పైగా పని చేశాను. ఈ క్రమంలో నేను సమాజాన్ని, రాజకీయాలను ప్రత్యేక కోణంలో చూశాను. విశ్లేషించాను. అర్థం చేసుకున్నాను. ఆ అవగాహనతో, పరిజ్ఞానంతోనే ఈ పుస్తకం రాశాను. రాజకీయ సేవల కోసం మా దగ్గర ఒక టీం, ఒక సంస్థ ఉంది. ఎవరైనా రాజకీయ సేవలు కావాలంటే మా సంస్థ ద్వారా తప్పకుండా అందిస్తాం. మా టీం సభ్యులంతా దాదాపు నాలుగేళ్లకు పైగా పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాం. అందుకే ఇది ఒక ఆసక్తికరమైన పుస్తకంగా తయారైంది. మా టీం లోని సభ్యులు కూడా సుదీర్ఘకాలం పాటు సామాజికంగా, రాజకీయంగా, జర్నలిజం పరంగా యాక్టివిటీ చేసిన వారే. పార్టీలను, ప్రభుత్వాలను చాలా దగ్గర నుంచి పరిశీలించడం ద్వారా ప్రభుత్వాలకు పార్టీలకు ప్రజలకు ఏం కావాలన్నా దానిపై మా టీముకు పూర్తి అవగాహన ఉంది.

ప్రశ్న : మీరు అందించే సేవల్లో ప్రత్యేకత ఏమిటి?

జవాబు : మాకున్న ఈ పరిజ్ఞానంతో మేము ఎవరికైనా ఎలాంటి రాజకీయ సేవలైనా అందించగలం. కొన్ని సంస్థలు పైపైన టెక్నికల్ గా కొన్ని సర్వీసులు ఇస్తున్నాయి. కానీ ఎమోషనల్ గా, ప్రాక్టికాలిటితో సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు. ఆ పనిని మేము సమర్థవంతంగా చేయగలం. కష్టమైజిడ్ వర్క్ డిజైన్, ప్రొఫెషనల్ గా సర్వీసెస్ అందించడం మా ప్రత్యేకత. నాయకులు, పార్టీలు, ప్రభుత్వానికి ఎవరూ ఇవ్వలేని కొన్ని సేవలను మేము మాత్రమే ఇస్తున్నాము. రాజకీయాలపై మాకున్న లోతైన అవగాహన, పరిజ్ఞానానికి ఈ పుస్తకమే సజీవ సాక్ష్యం.

WhatsApp channel