మహిళలూ! స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఈ 5 పొరపాట్లు మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి!-attention ladies are you making these 5 bathing mistakes theyre bad for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మహిళలూ! స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఈ 5 పొరపాట్లు మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి!

మహిళలూ! స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఈ 5 పొరపాట్లు మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి!

Ramya Sri Marka HT Telugu

మహిళల్లారా.. మీరు స్నానం చేసే విధానం సరైందేనా? తెలియకుండా ఏమైనా పొరపాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. చాలా మంది మహిళలు తరచుగా చేసే కొన్ని చిన్న తప్పులు అందమైన చర్మాన్ని, ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకుని వెంటనే వాటిని మానేయండి.

స్నానం చేస్తున్నప్పుడు చేయకూడాని పొరపాట్లు (Shutterstock)

స్నానం చేయడం మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. ఇది మనల్ని తాజాగా ఉంచడమే కాకుండా, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లకైతే ఇది అందాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల చర్మం, జుట్టు పాడైపోతాయి, అంతేకాదు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. ఈ 5 రకాల అలవాట్లు ఉండే వెంటనే వాటిని మానేయండి.

మహిళలు స్నానం చేసేటప్పుడు చేయకూడాని తప్పులు:

1. ప్రతిరోజూ తలస్నానం చేయడం:

కొంతమంది ఆడవాళ్లు ప్రతిరోజూ తలస్నానం చేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఎక్కువగా షాంపూ వాడటం వల్ల జుట్టులో ఉండే సహజమైన నూనెలు పోతాయి. దీనివల్ల జుట్టు బలహీనంగా, పొడిగా మారుతుంది. అంతేకాదు చాలా షాంపూల్లో ఉండే రసాయనాలు జుట్టు మెరుపును కూడా తగ్గిస్తాయి. కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. అది కూడా సున్నితమైన షాంపూతో చేస్తే మంచిది.

2. మురికి టవల్, బాడీ స్క్రబ్బర్ వాడటం:

బాడీ స్క్రబ్బర్, టవల్‌ను ఎక్కువ కాలం వాడటం కూడా మీ చర్మానికి, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రెండు లేదా మూడు వారాలకు మించి దీన్ని వాడకూడదు. అలాగే బాడీ స్క్రబ్బర్‌ను వాడిన ప్రతిసారి శుభ్రంగా కడిడి, బాగా ఆరబెట్టాలి. లేదంటే చర్మంపై ఇన్ఫెక్షన్లు, దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. అలాగే టవల్‌ను కూడా ప్రతి మూడు నాలుగు రోజులకు ఉతకాలి. ఆరిన తర్వాతే దాన్ని మళ్లీ వాడాలి.

3. లోపలి భాగాలను శుభ్రం చేయడానికి కఠినమైన సబ్బులు వాడటం:

కొంతమంది ఆడవాళ్లు తమ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రం చేయడానికి రకరకాల సబ్బులు, వాష్‌లు వాడుతుంటారు. వాటిలో చాలా రసాయనాలు, సువాసనలు ఉంటాయి. ఇవి ఆ ప్రాంతంలోని పిహెచ్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, చికాకు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణులు చెప్పేదేంటంటే ఆ ప్రాంతం తనను తాను శుభ్రం చేసుకోగలదు. కాబట్టి కేవలం నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

4. స్నానం చేసిన వెంటనే బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకోవడం:

చాలామంది ఆడవాళ్లు స్నానం చేసిన వెంటనే శరీరాన్ని సరిగ్గా తుడుచుకోకుండానే బిగుతుగా ఉండే బ్రా, లోదుస్తులు వేసుకుంటారు. ఇది మంచి అలవాటు కాదు. స్నానం చేసినప్పుడు చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు వెంటనే బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటే దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేశాక టవల్‌తో శరీరాన్ని బాగా తుడుచుకోండి. ఆ తర్వాత కాటన్, వదులుగా ఉండే లోదుస్తులు మాత్రమే వేసుకోండి.

5. స్నానం చేశాక మాయిశ్చరైజర్ రాయకపోవడం:

చాలామంది ఆడవాళ్లు స్నానం చేశాక చర్మానికి మాయిశ్చరైజర్ రాయరు. రాసినా చాలా ఆలస్యంగా రాస్తారు. మీకు ఆరోగ్యకరమైన, మెరిసే, మృదువైన చర్మం కావాలంటే ఈ అలవాటు మార్చుకోవాలి. స్నానం చేసిన వెంటనే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు నూనె లేదా లోషన్ రాస్తే చర్మం బాగా పీల్చుకుంటుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే లేదా కనీసం 15-20 నిమిషాల్లోపు తప్పకుండా మాయిశ్చరైజర్ రాయండి. ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటే మీ చర్మం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.