Parenting Tips: పిల్లలను ఏ వయసు నుంచి తల్లిదండ్రులతో కాకుండా విడిగా పడుకోబెట్టాలి? వారికి ఎలా నచ్చజెప్పాలి?-at what age should children be made to sleep separately from their parents ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లలను ఏ వయసు నుంచి తల్లిదండ్రులతో కాకుండా విడిగా పడుకోబెట్టాలి? వారికి ఎలా నచ్చజెప్పాలి?

Parenting Tips: పిల్లలను ఏ వయసు నుంచి తల్లిదండ్రులతో కాకుండా విడిగా పడుకోబెట్టాలి? వారికి ఎలా నచ్చజెప్పాలి?

Haritha Chappa HT Telugu

Parenting Tips: మీ పిల్లలను ఏ వయసు నుంచి విడిగా పడుకోబెట్టాలి?ఈ అలవాటును తల్లిదండ్రులు తమ పిల్లల్లో పెంపొందించాలి.తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ప్రతి సమాచారం ఇక్కడ ఉంది.

పిల్లలను విడిగా ఏ వయసులో పడుకోబెట్టాలి?

పిల్లలు ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యత పెరుగుతుంది. వారికి మంచి చెడులు నేర్పి, వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన పెద్ద బాధ్యత వారిదే. పిల్లలకు తినడం దగ్గర నుంచి నిద్రపోవడం వరకు ఎన్నో పనులు వారికి నేర్పించాలి. పరిశుభ్రత, క్రమశిక్షణను వంటివి వారిలో పెంపొందించేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులతో పడుకోవడం సహజం. అయితే ఒక వయసు వచ్చాక మాత్రం వారిని విడిగానే పడుకోబెట్టాలి.

పిల్లలు ఏ వయసులో విడిగా పడుకోబెట్టాలి?

పిల్లలు పుట్టినప్పట్నించి తల్లిదండ్రుల పక్కన నిద్రపోతారు. అయితే వారికి 8 నుంచి పదేళ్ల వయసు వచ్చేసరికి పిల్లలకు విడిగా పడుకునే అలవాటును నేర్పించాలి. తల్లిదండ్రులు తమతో పాటూ వారిని పడుకోబెట్టుకోకపోవడమే మంచిది.

కొంతమంది పిల్లలు తమ తల్లితో పడుకోవడానికి ఇష్టపడతారు. వారు విడిగా నిద్రపోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా పడుకోమని చెప్పినప్పుడల్లా భయమని చెబుతూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా వారు విడిగా పడుకునేందుకు ఇష్టపడరు. మీరు మీ పిల్లలకు విడిగా నిద్రపోవడం ముఖ్యమని చెప్పాలి. వారికి ఎలా నచ్చజెప్పాలో తెలుసుకోండి.

పిల్లలతో కఠినంగా ఈ విషయం గురించి మాట్లాడకండి. విడిగా పడుకోమని సూటిగా చెప్పడం వల్ల మానసికంగా కుంగిపోతారు. ఎదగడం నేరమని భావిస్తారు. కాబట్టి ముందుగా పిల్లల మనస్సుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించండి.

పిల్లలు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వారు స్వతంత్రంగా చేసే పనులు చెప్పండి. వారికి రోజూ కొన్ని పనులు చెబుతూ ఉండండి. వారు ఆ పనిని పూర్తి చేయగానే అతడిని ప్రశంసించండి. వారు కూడా స్వతంత్రంగా పని చేయగలరనే నమ్మకాన్ని వారిలో కలిగించండి. అప్పుడు పిల్లవాడు ప్రతిదీ తనకు తానుగా స్వతంత్రంగా పనిచేసేందుకు ఇష్టపడతారు. అలా స్వతంత్రంగా పనులు చేసే పిల్లలు విడిగా పడుకునేందుకు సిద్ధమవుతారు.

ముందు నుంచే సిద్ధం చేయండి

మీరు మీ పిల్లవాడిని హఠాత్తుగా విడిగా పడుకోబెట్టకూడదు. కొన్ని నెలల ముందు నుంచే వారికి సిద్ధం చేయాలి. పిల్లవాడికి తాను పెరుగుతున్నానని, తాను పెద్దవారిలా స్వతంత్రంగా ఉండాలని కోరుకునేలా చేయాలి. అన్ని పనులు స్వయంగా చేసుకునేలా ప్రేరేపించాలి. నెలల రోజుల పాటూ పిల్లవాడిలో నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి.

మీ పిల్లవాడు తాను ఒంటరిగా పడుకోగలనని ధైర్యంగా చెప్పిన తరువాతే అతడిని విడిగా పడుకోబెట్టండి. బలవంతంగా మాత్రం ఆ పని చేయకండి. తల్లిదండ్రులకు తానంటే ఇష్టం లేదన భావన అతడిలో పెరిగిపోతుంది. ముందుగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాకే విడిగా పడుకోమని చెప్పండి. ఇలా చెప్పిన తరువాత కొద్ది రోజుల్లోనే మీ బిడ్డ ఎటువంటి ఇబ్బంది లేకుండా విడిగా నిద్రపోవడం ప్రారంభిస్తుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం