పిల్లలకు లైంగిక విద్య గురించి ఏ వయసులో చెప్పడం మంచిది?-at what age is it good to tell children about sex education ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పిల్లలకు లైంగిక విద్య గురించి ఏ వయసులో చెప్పడం మంచిది?

పిల్లలకు లైంగిక విద్య గురించి ఏ వయసులో చెప్పడం మంచిది?

Haritha Chappa HT Telugu
Published Jul 30, 2024 11:30 AM IST

సెక్స్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంటి నుంచే ప్రారంభమైతే పిల్లలు తప్పుదోవ పట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

పిల్లల కోసం సెక్స్ ఎడ్యుకేషన్
పిల్లల కోసం సెక్స్ ఎడ్యుకేషన్ (shutterstock)

నేటి పిల్లలు తమ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఫోన్‌లో గూగుల్ అన్ని విషయాలు చెప్పేస్తుంది. సామాజిక మాధ్యమాలతో స్నేహం చేయడం ద్వారా నేటి పిల్లలు సమాధానం దొరుకుతుంది. కానీ సోషల్ మీడియాలోని కొన్ని రకాల సమాచారం పిల్లలకు అన్ని విధాలా సురక్షితం కాదు. కొన్ని రకాల సమాచారం వారిని తప్పుదోవ పట్టించవచ్చు. పిల్లలు సరైన సమయంలో, సరైన మార్గంలో సరైన సమాచారాన్ని పొందకపోతే, వారు తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంటి నుంచే ప్రారంభమైతే పిల్లలు తప్పుదోవ పట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డకు సెక్స్ ఎడ్యుకేషన్ ఏ వయసులో ఎలా ఇవ్వాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.

ఏ వయసులో సెక్స్ గురించి చెప్పాలి?

తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్ గురించి మాట్లాడేందుకు సందేహిస్తారు. సంభాషణను ఎలా ప్రారంభించాలో కూడా వారికి అర్థం కాదు. అయితే ఇది వారి అభివృద్ధిలో సున్నితమైన, ముఖ్యమైన అంశం అని మాత్రం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది, దీని వల్ల వారిని వారు రక్షించుకోవచ్చు కూడా. తల్లిదండ్రులు ఈ అంశంపై వారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉండటం, ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.

నాలుగేళ్ల వయసులోనే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ను పరిచయం చేయాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి వారు అర్థం చేసుకునేలా చెప్పాలి. ఈ వయస్సులోని ఆడపిల్లలు కూడా లైంగిక దాడుల బారిన పడుతున్నారు. ప్రైవేట్ భాగాల భద్రత, అక్కడ ఎవరూ తాకకూడదనే విషయాన్ని వారికి చెప్పాలి.

ఎనిమిదేళ్లు

ఈ వయసు పిల్లలు తెలివైనవారుగా మారుతారు. కాబట్టి వారికి నిజమైన వాస్తవాలు చెప్పండి. వారి పుట్టుకకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు నిజాలు చెప్పండి. ఒక బిడ్డ పుట్టడానికి స్పెర్మ్, అండాలు రెండూ అవసరమని పిల్లలకు వివరించండి. అలాగే ఎవరూ తమను తాకకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలో కూడా వారికి చెప్పండి.

పదేళ్ల వయసు

పదేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు తమ పిల్లలకు మరింత విశదంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వివరించాలి . ఈ రోజుల్లో అత్యాచారం, శారీరక వేధింపులు వంటి వార్తలు ప్రతిరోజూ టీవీల్లో, వార్తాపత్రికల్లో రావడం సర్వసాధారణంగా మారింది. అటువంటి పరిస్థితిలో, పిల్లవాడు ఈ విషయాలకు సంబంధించిన ఏదైనా ప్రశ్నను మిమ్మల్ని అడిగితే, దానికి మీరు సరైన సమాధానం ఇవ్వాలి.

15 సంవత్సరాల వయస్సు:

ఈ వయస్సులోని పిల్లలకు తెలిసిన అరకొర లైంగిక విద్య అతన్ని తప్పుడు దిశలో నడిపిస్తుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి, పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి, తద్వారా పిల్లల మనస్సులో ఉన్న సందేహాలను తెలుసుకోండి.

సెక్స్ గురించి మాట్లాడటానికి పిల్లలకు అనువైన వాతావరణాన్ని ఇవ్వండి. ఇక్కడ మీ బిడ్డ ప్రశ్నలు అడగడం, సున్నితమైన విషయాలను చర్చించడం వంటివి చేయగలిగేలా చూడండి.

Whats_app_banner