Chocolate: మీ పిల్లలు చాక్లెట్ అధికంగా తింటున్నారా? వారి చేత ఆ అలవాటును ఇలా సులువుగా మానిపించేయండి-are your kids eating too much chocolate make it easy for them to break the habit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate: మీ పిల్లలు చాక్లెట్ అధికంగా తింటున్నారా? వారి చేత ఆ అలవాటును ఇలా సులువుగా మానిపించేయండి

Chocolate: మీ పిల్లలు చాక్లెట్ అధికంగా తింటున్నారా? వారి చేత ఆ అలవాటును ఇలా సులువుగా మానిపించేయండి

Haritha Chappa HT Telugu
Published Feb 11, 2025 05:30 PM IST

పిల్లల్లో అధికంగా తీపి తినడం వల్ల దంతాలు పాడవడం లేదా ఊబకాయం వంటి సమస్యలు వస్తే, ఈ సులభమైన చిట్కాలు వారి తీపి కోరికలను తగ్గించడంలో సహాయపడతాయి.

పిల్లల చేత చాకోలెట్ మానిపించడం ఎలా?
పిల్లల చేత చాకోలెట్ మానిపించడం ఎలా? (shutterstock)

తీపి వంటకాలు కేవలం పిల్లలకే కాదు పెద్దలకూ ఇష్టం. అయితే పిల్లలు మాత్రం లాలిపాప్, చాక్లెట్, కేకులు, పేస్ట్రీలు, జ్యూస్ వంటివి అధికంగా ఇష్టపడతారు. వీటిలో కూడా చాకొలెట్ అంటేనే వారికి ఎక్కువ ఇష్టం. వాటిని చూస్తే తినకుండా ఉండలేరు. అధిక తీపి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది అన్ని వయసుల వారికి హాని కలిగిస్తుంది. పెద్దవారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తీపిని తక్కువగా తింటారు.

కానీ చిన్న పిల్లలు మాత్రం అర్థం చేసుకోలేక చాకోలెట్లు, స్వీట్లు తింటూనే ఉంటారు. అధికంగా తీపి తినడం వల్ల పిల్లల దంతాలు పాడవడంతో పాటు రక్తంలో చక్కెర పెరగడం, ఊబకాయం, అనేక రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, మీరు మీ పిల్లలను ఈ ప్రమాదం నుండి కాపాడాలనుకుంటే, పిల్లల్లో అధిక తీపి తినాలన్న కోరికను తగ్గించాలి. అలా తగ్గించేందుకు కొన్ని చిట్కలు ఉన్నాయి.

పిల్లల్లో తీపి అలవాటును తగ్గించండిలా

పెరుగు ఇవ్వండి

పిల్లలకు ఐస్ క్రీం, కుల్ఫీ, కోల్డ్ డ్రింక్స్ వంటి తీపి వంటకాలకు బదులుగా పెరుగు ఇవ్వండి. ఫ్లేవర్డ్ యోగర్ట్ పిల్లలకు నచ్చుతుంది. వాటిలో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, యోగర్ట్ ప్రోబయోటిక్ ఆహారం, ప్రోటీన్ ధనంగా ఉంటుంది. ఇది పిల్లలకు ఆరోగ్యకరమైనది. వారి అభివృద్ధికి అవసరం.

పాలలో తీపి కలపవద్దు

చాలా మంది తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు వాటిలో ఫ్లేవర్ పౌడర్ లేదా చక్కెరను ఉపయోగిస్తారు. కానీ మీరు పిల్లల తీపి అలవాటును మాన్పించాలనుకుంటే, పంచదారను కలపకండి. మొదట్లో ఇది కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి ఒకేసారి పంచదార వేయడం మానేయకుండా క్రమేపీ తగ్గిస్తూ రండి.

డార్క్ చాక్లెట్ ఉపయోగించండి

పిల్లలకు తీపి చాలా ఇష్టం. వారు దాని రుచిని త్వరగా మరచిపోరు. కాబట్టి, మీరు తెల్ల లేదా పాల చాక్లెట్ బదులుగా డార్క్ చాక్లెట్ ఉపయోగించవచ్చు. డార్క్ చాక్లెట్ రుచిలో తక్కువ తీపిగా ఉంటుంది. మీ పిల్లలకు దాని రుచి అంతగా నచ్చకపోవచ్చు, దీనివల్ల వారు నెమ్మదిగా ఈ అలవాటు నుండి బయటపడతారు.

ఫైబర్, ప్రోటీన్ ఆహారం

శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి ఫైబర్, ప్రోటీన్ ఆహారం సహాయపడుతుంది. ఈ రకమైన ఆహారం పిల్లల పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, దీనివల్ల వారికి తరచుగా ఆకలి వేయదు. పిల్లలు చాక్లెట్ కోసం అడుగుతూ ఉండరు. దీని కోసం పిల్లల ఆహారంలో ఆకుకూరలు, గోధుమలు, సలాడ్ లను చేర్చండి.

చాలా మంది చిన్న పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చేసే పనులను అనుసరిస్తారు. కాబట్టి, మీరు స్వయంగా కోల్డ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిని అధికంగా తీసుకోవడం మానేయండి. మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఎలా నేర్పించాలంటే ముందుగా మీకు ఆ అలవాట్లు ఉండాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం