Chicken Washing: వండే ముందు చికెన్ కడుగుతున్నారా? ఎంత నష్టమో చూడండి
Chicken Washing: చికెన్ వండుకునే ముందు నీళ్ల కింద పెట్టి కడిగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇది మంచిది కాదట. దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ లాంటి నష్టాలుంటాయి. చికెన్ ఎందుకు కడగకూడదో, ఎలా శుభ్రం చేయాలో తెల్సుకోండి.
మనలో చాలా మంది చికెన్ లవర్సే. ముక్క లేకుండా ముద్ద దిగదని గర్వంగా చెప్పుకొంటూ ఉంటారు. మాంసాహారులయిన చాలా మంది ముఖ్యంగా చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోడి మాంసాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇంటికి తెచ్చుకుని వండుకుంటారు. వండుకునే ముందు కచ్చితంగా నీటితో కడిగేస్తారు. అయితే ఇలా చికెన్‌ని కడగడం ఏ మాత్రమూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇది వరకు చికెన్‌ని తెచ్చుకుంటే కోడి ఈకలు, ఇంకేమైనా దుమ్ము లాంటివి దానికి ఎక్కువగా అంటుకుని కనిపించేవి. అందుకని దాన్ని కడిగి వండుకునే అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు అలా కాదు. చికెన్‌ని శుభ్రం చేయడం, ముక్కలు చేయడంలో మిషనరీలు పని చేస్తున్నాయి. పెద్ద మాంసం దుకాణాల నుంచి తెచ్చుకునే మాంసంలో కోడి ఈకల్లాంటివి అస్సలు కనిపించవు. వాటిని అంతగా శుభ్రం చేసి ఇస్తుంటారు.
చికెన్ ఎందుకు కడగొద్దు?
అలా శుభ్రం చేసి ఇచ్చిన చికెన్‌ని నీరు పోసి కడిగి ఇంకా శుభ్రం చేస్తున్నాం అనుకుంటాం. అయితే కోడి చనిపోయిన తర్వాత వచ్చే మాంసం ముక్కల్లో చాలా రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రమాదకరమైనవీ ఉంటాయి. సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్ లాంటివి అందుకు ఉదాహరణలు. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, కడుపునొప్పి లాంటి వాటికి ఈ బ్యాక్టీరియాలు కారణం అవుతాయి. మనం ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న మాంసాన్ని నీరు పోసి కడిగినప్పుడు ఈ బ్యాక్టీరియాలు మరింత వేగంగా వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. నీటితో పాటుగా అవి మాంసం ముక్కల మీద ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా అవుతాయి. దీంతో అది మరింత కలుషితం అయ్యే అవకాశాలు ఏర్పడతాయి.
అలాగే చికెన్ కడుగుతున్నప్పుడు ఆ నీళ్లు చేతులు, బట్టలకు, కిచెన్ స్లాబ్ మీద అంటుకుంటాయి. నీటి తుంపర్లు దాదాపు 50 సెమీ దాకా పడొచ్చు. ఇవన్నీ కలుషితం పెంచే అంశాలు.
పేపర్ టవెల్:
ఈ సమస్యలు నివారించాలంటే మాంసాన్ని కడగకూడదని నిపుణులు చెబుతున్నారు. కావాలంటే చికెన్ మీద ఉన్న జిగటుదనం పోవాలంటే నీటికి బదులుగా పేపర్ టవల్ వాడటం ఉత్తమం. దాంతో ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది. తర్వాత మీ చేతుల్ని సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వండని చికెన్‌ని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలంటే దానికోసం ఓ ఎయిర్ టైట్ కంటైనర్‌ని పెట్టుకుని అందులో ఉంచాలి. డీప్ ఫ్రిజ్‌లో ఇలాంటి మాంసాలు పెట్టుకోవడానికి అనువుగా ఓ చోటును కేటాయించుకోవాలి. సాధారణ ఆహారాలు అన్నింటితో కలిపి వీటిని ఉంచుకోకూడదు. అలాగే వీటిని శుభ్రం చేసి నిల్వ చేసుకోవడం పూర్తయిపోతే మీ చేతులు, మాంసం ఉంచిన సింకు లాంటి వాటిని సబ్బు నీరుతో కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి.
చికెన్ లో ఉండే బ్యాక్టీరియా చనిపోవాలంటే తప్పకుండా బాగా ఉడికించాలి. కనీసం 165 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాన్ని ఉడికించాలి.
టాపిక్