Sleeping Tips: రాత్రుళ్లు దిండునో, బొమ్మనో హత్తుకుని పడుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!
రాత్రుళ్లు నిద్రపోయే సమయంలో దిండునో లేదా మెత్తటి బొమ్మనో హత్తుకుని పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీక్కూడా ఈ అలవాటు ఉందా? ఇది ఆరోగ్యానికి మంచిదేనా? తెలుసుకుందాం.. రండి!
రోజంతా అలసిపోయిన తర్వాత, ఎవరైనా ఎదురుచూసేది ప్రశాంతమైన నిద్రకోసమే కదా. అందులోనూ గాఢనిద్ర పట్టిందంటే అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదు. ఉదయాన్నే రిఫ్రెష్ గా అనిపించేది కంటినిండా నిద్రపోయిన తర్వాతే. మరి అలాంటి నిద్ర పట్టే అవకాశాన్ని మనకి మనమే చేజాతులారా నాశనం చేసుకుంటున్నామని మీరెప్పుడైనా గమనించారా.. మనలో చాలా మంది ఆ పొరబాటు చేసి ఉండొచ్చు. చేస్తూనే ఉండొచ్చు. ఆరోగ్య నిపుణులు చేయకూడదని చెప్తున్న ఆ పొరబాటేంటో ఒకసారి చూద్దామా..

కొన్ని వస్తువులను నిద్రపోయే సమయంలో కచ్చితంగా దూరంగా ఉంచాలట. నిద్రను చెడగొట్టే ఈ వస్తువులను వీలైనంత దూరంగా ఉంచడమే మంచిది. అవేంటంటే..
మృదువైన బొమ్మలతో పడుకోవద్దు
పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా కొన్నిసార్లు పడుకునేటప్పుడు పెద్ద టెడ్డీ బేర్ లేదా మృదువైన బొమ్మను హత్తుకుని పడుకుంటారు. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మృదువైన బొమ్మలలో దుమ్ము, ధూళి, తేమ అనేవి కాలక్రమేణా పెరిగిపోతాయి. వీటి కారణంగా బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు కూడా పేరుకుపోతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అయితే, కొందరు మాత్రం ఈ బొమ్మ లేకుండా నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ మీకు కూడా ఇటువంటి ఇష్టమైన బొమ్మ లేకుండా నిద్ర రాకపోతే, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి.
దిండు లేదా తలవైపున ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచుకోకండి
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. వాటిని కొద్ది నిమిషాలు వాడకపోయినా భరించలేరు. మీరు కూడా వారిలో ఒకరైతే, కనీసం పడుకునేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను మీ బెడ్‌కు దూరంగా ఉంచండి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల బ్లూ లైట్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మీ నిద్రను మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా హానికరమని తెలుసుకోండి.
మంచం దగ్గర పనికి సంబంధించిన వస్తువులను ఉంచుకోకండి
రోజంతా పనిలో బిజీగా మునిగిపోయి రాత్రి సమయానికి నిద్రపోవడానికి మంచం మీదకు వచ్చినప్పుడు పని ఒత్తిడి మొత్తం మర్చిపోవాలి. కాబట్టి పడుకునే ముందు మీ మంచం మీదకు ఆఫీస్ లేదా ఇతర పనికి సంబంధించిన వస్తువులు లేకుండా చూసుకోండి. మీకు తెలియకుండా ఇది మీ మనసులో ఆందోళనను సృష్టిస్తుంది. మీ చుట్టూ పనికి సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు, మీ దృష్టి పని వైపు మళ్లుతుంది. ఇది ఒత్తిడిని కలిగించి, మంచి నిద్రను కూడా రాకుండా చేస్తుంది.
చుట్టూ అనవసరమైన వస్తువులను తీసిపారేయండి
మంచి గాఢమైన నిద్ర కోసం, చుట్టుపక్కల వాతావరణం కూడా అలాగే ఉండాలి. కాబట్టి పడుకునే ముందు, మంచాన్ని సిద్ధం చేసుకోవడానికి కొద్ది నిమిషాల సమయం కేటాయించండి. ముందుగా మంచం మీద చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సర్దుకోండి. అనవసరమైన వస్తువులను మంచం నుండి తీసి దూరంగా పెట్టుకోండి. బెడ్ పరిసరాల్లో ఉపయోగించిన పాత్రలు, మురికి బట్టలు, మందులు, కాగితాలు లేదా ఆహార పదార్థాలు చెల్లాచెదురుగా ఉంటే, వాటిని సర్దుకున్న తర్వాతే పడుకోండి. ఇది మీకు పడుకునేటప్పుడు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రశాంతమైన మంచి నిద్రను కూడా ఇస్తుంది.
సంబంధిత కథనం