Winter Skin Care: చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతోందా? మెరిసే చర్మం కోసం కొలాజెన్‍ను పెంచే ఈ 6 ఫుడ్స్ తినండి
Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిగా మారి మెరుపు కోల్పోతుంది. కొందరికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య తీరాలంటే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
చలికాలంలో చర్మానికి సవాళ్లు ఎదురవుతాయి. చల్లటి వాతారణం, గాలిలో తేమశాతం తక్కువగా ఉండడం వల్ల ఈ కాలంలో చర్మ సమస్యలు తలెతుత్తాయి. ఇప్పటికే చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కాలంలో చర్మం పొడి బారి, మెరుపు కోల్పోతుంది. కొందరికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మం డల్‍గా మారిపోతుంది. దీంతో ఆందోళన చెందుతుంటారు. శరీరంలో కొలాజెన్ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు.. చర్మం పొడిబాడే సమస్యను తగ్గించగలవు. మెరుపును పెంచగలవు.
శరీరంలోని కొలాజెన్ చర్మం తేమగా ఉండేలా చేయగలదు. ముడతలను, మచ్చలను తగ్గించగలదు. అందుకే చర్మ సమస్యలు ఉన్న వారు కొలాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు తప్పకుండా శీతాకాలంలో తినాలి. ఆ ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
నారింజ పండు
శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని నారింజ పండ్లు పెంచగలవు. ఇందులోని విటమిన్ సీ దీనికి తోడ్పడుతుంది. కొలాజెన్‍ను పెంచి చర్మం పొడిబారడాన్ని నారింజ తగ్గించగలదు. ఈ పండును రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మపు మెరుపు, బిగుతు కూడా పెరుగుతుంది. నిమ్మ, చీని పండ్లు లాంటి సిట్రస్ పండ్లు కూడా కొలాజెన్ స్థాయిని అధికంగా చేయగలవు.
క్యారెట్
క్యారెట్‍లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అందుకే చలికాలంలో మీ డైట్‍లో క్యారెట్ తప్పకుండా ఉండాలి. బాడీలో కొలాజెన్ ఉత్పత్తిని ఇది బాగా పెంచుతుంది. చర్మం మెరుపుతో ఉండేలా సహకరిస్తుంది. క్యారెట్‍లో విటమిన్ ఏ కూడా మెండుగా ఉంటుంది. కణాలు డ్యామేజ్ అవకుండా ఇది చేయగలదు. చర్మంపై ముడతలు కూడా తగ్గేలా సహకరిస్తుంది. శీతాకాలంలో రెగ్యులర్‌గా క్యారెట్ తినడం, దీని జ్యూస్ తాగడం లాంటివి చేస్తుండాలి.
ఆకుకూరలు
పాలకూర, కేల్, బచ్చలి లాంటి ఆకుకూరల్లో విటమిన్ సీ, కే, బీ6 సహా ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి అధికం అవుతుంది. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుంది. స్కిన్ గ్లో అధికం అవుతుంది.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందుకే ఇవి తింటే శరీరంలో కొలాజాన్ లెవెల్ పెరుగుతుంది. చర్మానికి మేలు జరుగుతుంది. పొడిబారడం తగ్గించి చర్మానికి మెరుపు ఇవ్వడమే కాకుండా.. ముడతలు తగ్గేందుకు కూడా బెర్రీలు తోడ్పడతాయి. బెర్రీల్లో మరిన్ని ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీంతో ఓవరాల్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
బీట్‍రూట్
చలికాలంలో బీట్‍రూట్‍ను ఆహారంలో తీసుకోవడం, బీట్‍రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. బీట్‍రూట్‍లోనూ విటమిన్ సీ, యాంటీఆక్సిడెెంట్లు, యాంటీఇన్‍ఫ్లమేటరి గుణాలు మెండుగా ఉంటాయి. కొలాజెన్ ఉత్పత్తిని బీట్‍రూట్ పెంచగలదు. చర్మానికి తేమ అందించి, మెరుపు పెరిగేలా చేయగలదు.
అవిసె గింజలు
అవిసె (ఫ్లాక్స్) గింజల్లో విటమిన్ ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అధికం. చర్మానికి పోషకాలు మెరుగ్గా అందేందుకు అవిసె గింజలు తోడ్పడతాయి. అందుకే మీ డైట్‍లో గింజలను యాడ్ చేసుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది. శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని ఈ గింజలు పెంచగలవు. చర్మంపై మచ్చలు, గీతలు తగ్గేందుకు కూడా ఇవి తోడ్పడతాయి.