మీరు భోజనం ఇలా చేస్తున్నారా? అయితే ఈ వ్యాధుల లక్షణాలు తెలుసుకోండి.. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చెబుతున్నవివే-are you eating in a way that is damaging your health psychologist warns ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీరు భోజనం ఇలా చేస్తున్నారా? అయితే ఈ వ్యాధుల లక్షణాలు తెలుసుకోండి.. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చెబుతున్నవివే

మీరు భోజనం ఇలా చేస్తున్నారా? అయితే ఈ వ్యాధుల లక్షణాలు తెలుసుకోండి.. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చెబుతున్నవివే

HT Telugu Desk HT Telugu
Published Feb 19, 2025 04:28 PM IST

తినే తీరు కూడా కొన్ని వ్యాధుల లక్షణమే. కొందరికి టైం కి తినడం అలవాటు, మరికొందరికి టైం తో పని లేకుండా తినడం అలవాటు. కొంతమంది ఆకలితో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తారు. తినడం దారి తప్పుతోంది. నిజమే కదా. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ కవిత సుమ అందిస్తున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

భోజనం చేసే తీరును బట్టి వ్యాధులను గుర్తించవచ్చంటున్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కవిత సుమ
భోజనం చేసే తీరును బట్టి వ్యాధులను గుర్తించవచ్చంటున్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కవిత సుమ

ఆహారానికి మనసుకి సంబంధం ఉంది మీకు తెలుసా? తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యలతో మనం తినే తీరులో అనేక మార్పులు వస్తాయి. మహిళలు, పురుషులు, ప్రత్యేకంగా కౌమార దశలోకి వచ్చే పిల్లల్లో ఎక్కువగా ఈ భోజన రుగ్మతలపై అవగాహన కోసమే ఈ కథనం.

1. అనో రెగ్జియా నర్వోజా:

దీన్నే ఫ్యాషన్ డిజార్డర్ అని కూడా అంటారు. జీరో సైజ్ అంటూ ఏమాత్రం ఎక్కువ తిన్నా బరువు పెరిగి అందం దెబ్బ తింటుందేమో అన్న సంశయంతో తినడం మానేస్తారు. దాంతో బరువు పూర్తిగా తగ్గి, ఎముకల పోగులా మిగిలిపోతారు. కావాలన్నా ఇక తినలేరు. దీనివల్ల శరీర పోషణ, జీవ క్రియలకు అవసరమైన దానికంటే చాలా తక్కువ మోతాదులో తినడంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తుంది.

2. బులీమియా నర్వోజా:

భోజనం పై అమితాసక్తితో రుచికరమైనవన్నీ తినేస్తారు .ఆ తర్వాత అయ్యో బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళనతో కావాలని వాంతి చేసుకుంటారు. శరీరాకృతిపై అవసరమైన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల జీర్ణ క్రియ బాగా దెబ్బతింటుంది. శరీరం డిహైడ్రేట్ అవుతుంది. ఎక్కువగా తినే బింజ్ ఈటింగ్ తో పాటు బరువు పెరిగిపోతామేమో అనే అనొరెగ్జియా నర్వోజా లక్షణాలు కలగలిసి చివరికి డిప్రెషన్ కి గురవుతారు.

3. బింజ్ఈటింగ్ డిజార్డర్:

ఈ డిజార్డర్ ఉన్నవాళ్లు ఆపకుండా అన్ని తినేస్తుంటారు నాన్ స్టాప్ ఈటింగ్ అని కూడా అంటారు. ఎప్పుడు ఆకలితో ఉన్నట్టుగా తినేడమే పనిగా పెట్టుకుంటారు. దీనివల్ల అమితంగా బరువు పెరిగి, స్థూలకాయం, వ్యాకులత లాంటి సమస్యలతో సతమతమవుతారు. బీపీ పెరిగి, కొలెస్ట్రాల్ పెరిగి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

4. డయా బులిమియా:

ఇది సాధారణంగా టైప్ వన్ మధుమేహంతో కలిసి ఉండే ఆహార సంబంధమైన రుగ్మత. ఇందులో మధుమేహం మరియు బులీమియా రెండు వ్యాధులు కలిసి ఉంటాయి అందుకే దీన్ని డ్యూయల్ డయాగ్నసిస్ డిజార్డర్ అని అంటారు.

5. ఆర్థో రెగ్జియా:

ఇది సరైన ఆహారం తీసుకోవాలి అనే తపన నుంచి ఆవిర్భవించిన రుగ్మత. ఇది ఉన్న వాళ్ళకి అన్నీ ఆరోగ్య సంబంధమైన సందేహాలే. తాము తిన్నది సరైన సమతుల ఆహారమేనా అనే సందేహం పట్టి పీడిస్తుంది. ఎక్కువగా తింటున్నామా లేదా తక్కువగా తింటున్నామా అనే సంశయాలు వస్తుంటాయి. దీంతో తిండి విషయంలో వారికి వారే చాలా కఠిన నియమాలు పెట్టుకొని ఆచరిస్తుంటారు. ప్రతీదీ తినేటప్పుడు వాటి పోషకాల విలువలు లెక్కలేసుకొని తింటుంటారు. దీని వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది

కారణాలు అనేకం..

ఈ భోజన రుగ్మతలకు కారణాలు అనేకం ఉన్నాయి. ఇందులో ప్రవర్తన పూర్వకమైనవి, జీవసంబంధమైనవి, ఉద్వేగాలకు సంబంధించినవి మానసికమైనవి, వ్యక్తిగత బంధాలకు సంబంధించినవి, సామాజిక అంశాలు ఇలా చాలా రకాల కారణాలు.

ఇవి క్రమంగా శారీరక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వ్యక్తిత్వం పై ప్రభావం చూపుతాయి. ఇటీవల ఆరోగ్య స్పృహ మరీ ఎక్కువగా పెరగడంతో వచ్చిన అనర్ధం ఇది. ఆరోగ్యంగా ఉండాలని కోరికతో మంచి నియమాలను పాటించడంలో తప్పులేదు కానీ అదే పనిగా ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఒక రకమైన నిస్పృహకు, న్యూనతకు గురై ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవడం సరికాదు. కాబట్టి ఆరోగ్య స్పృహను మరి హెచ్చుమీరి పోనివ్వకుండా చూడాలి.

చికిత్స ఇలా..

మొదటగా సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దానితో పాటుగా సైకియాట్రిస్ట్‌ను కలిసి అవసరమైన మందులను వాడాలి. న్యూట్రిషన్ లోపాలు కలుగుతాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విధంగా న్యూట్రీషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఇలా అనేక అంశాలతో కూడిన చికిత్స చేయాలి.

ఈ ఆరోగ్య రుగ్మతలకు ఇచ్చే చికిత్స నిర్దిష్టంగా ఉండక సమస్యను బట్టి మారుతుంది. ఏ ఆహార సంబంధమైన సమస్యలు తలెత్తిన అర్హత ఉన్న సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్ వంటి నిపుణుల దగ్గర సహాయం తీసుకోవాలి.

మైండ్ ఫుల్ ఈటింగ్ తో మేలు..

మైండ్ ఫుల్ ఈటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఆహారం తీసుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి ముద్దని ఆస్వాదించాలి. ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా భుజించాలి. పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ భోజనం చేయకూడదు. అలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆహారం అన్నది మనకు ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతిని కలిగించడానికి అని గుర్తించి దాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. కేవలం క్రమబద్ధమైన జీవితంలోని ఒక అనివార్య అంశంగా భావించకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.. ఆనందంగా జీవించండి.

- సుమ కవిత

కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్

మొబైల్: 7661807201

సుమ కవిత, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్
సుమ కవిత, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్
Whats_app_banner