మనిషి జీవన వికాసం అంతర్గత, బాహ్య శరీర నిర్మాణం మరియు జీవ మానసిక ప్రక్రియ అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. డెవలప్మెంట్ సైకాలజీలోని "అభివృద్ధి మరియు వికాసము" అనే సిద్ధాంతం ఈ అంశాన్ని సవివరంగా తెలియజేస్తుంది. ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే పరికరం కంప్యూటర్. మానవ శరీర నిర్మాణంలోని ప్రధాన భాగమైన మెదడు నిర్మాణం మరియు పనితీరు కంప్యూటర్‌తో సారూప్యతను కలిగి ఉంటాయి. మానవ మెదడుకు మరియు ఆధునిక కంప్యూటర్‌కు నిర్మాణంలో, పనితీరులో పోలిక ఉంది. దాని గురించే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కంప్యూటర్లో రాండమ్ యాక్సెస్ మెమరీ (RAM) యొక్క శక్తిసామర్థ్యంపై కంప్యూటర్ పనితీరు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఆ సామర్థ్యం కేవలం మెగాబైట్లలో (MB) ఉండేది. దానితోపాటు మరో ముఖ్యమైన నిక్షిప్త సామర్థ్యం హార్డ్ డ్రైవ్ డిస్క్ (HDD) ఉంటుంది. దీనిని మానవ మెదడుతో పోలుస్తుంటాం. HDD కేవలం మెదడులోని జ్ఞాపకశక్తి సామర్థ్యం లాంటిది. కానీ RAM మనస్సు లాంటిది. పూర్తి ప్రక్రియను నడిపించేది RAM యొక్క శక్తిసామర్థ్యం మాత్రమే. ఆఫ్ జీబీ వాడుకలో ఉన్నప్పుడే మొబైల్ లేదా కంప్యూటర్ సామర్థ్యం ఎంతో అభివృద్ధి చెందిందని భావించేవాళ్లం. కానీ ఆ సామర్థ్యం నేడు అవుట్‌డేటెడ్, అంటే కాలం చెల్లిపోయింది. అదే సామర్థ్యం నేడు 8 జీబీ నుండి 32 జీబీ మధ్య నడుస్తుంది.
నేటి సమాజంలో మానసిక వికాసము, పనితీరు, సామర్థ్యము, స్పందన మరియు ప్రతిస్పందనలను ఆధారంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను ఈ పదబంధం ద్వారా వర్గీకరించవచ్చు. వ్యక్తిగత, ఉద్యోగపరమైన సామర్థ్యంలో ఎటువంటి లోపాలు లేనప్పటికీ, సగటు మనిషిగా గౌరవప్రదమైన సామాజిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ప్రభావిత మానసిక శక్తి సామర్థ్యాల లోపంతో జీవిస్తుంటారు.
మానసిక శాస్త్రం, తత్వశాస్త్రం లేదా సామాజిక శాస్త్రం ప్రకారం, మనిషి తన మొదటి సంవత్సరంలో పొందిన అనుభవాన్ని దశాబ్దాల పాటు కొనసాగిస్తూ అనుభవజ్ఞుడిగా భావిస్తూ ఉంటాడు. చివరికి పది లేదా ముప్పై ఏళ్ల అనుభవం తనదని ప్రకటిస్తూ ఉంటారు. ఆ పాతిక లేదా ముప్పై ఏళ్లు ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మానసిక ఉన్నతి పొందిన నాడు మనిషి మెదడుకు ఏ కంప్యూటర్లు సాటి రావు. లేదంటే, మనిషి జీవితం ఆఫ్ జీబీకే పరిమితం అవుతుంది.