Good Son: మీరు మీ తల్లిదండ్రులకు మంచి కొడుకుగా ఉన్నారా? మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి
Good Son: వయసు మీరిన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత బిడ్డలదే. అయితే కొంత మంది పిల్లలు పెళ్లిళ్లు అయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. మంచి కొడుకుగా, మంచి కూతురిగా.. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఉండడం అత్యవసరం.
మంచి కొడుకుగా ఉండడం అంటే తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపించడం. వారికి ప్రతి అడుగులోనూ తోడుగా ఉండడం. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఎలా జాగ్రత్తగా చూసుకున్నారో... వృద్ధాప్యంలో వారిని మీరు అలానే చూసుకోవాలి. మీరు మీ తల్లిదండ్రుల విషయంలో మంచి కొడుకుగా ఉన్నారో లేదో ఒకసారి ప్రశ్నించుకోండి.
ఇప్పుడు ఎంతోమంది కొడుకులు పెళ్లయ్యాక వేరు కుటుంబం పెట్టడానికే ఇష్టపడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ వేరుగా ఉండడానికే ప్రాధాన్యత చూపిస్తున్నారు. దానికి ప్రైవసీ అనే కారణాన్ని చెబుతున్నారు. కానీ వృద్ధ తల్లిదండ్రులు ఎలా ఉంటారనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. ఒక మంచి కొడుకు... వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరంగా పెట్టడు. వారికి ప్రతిక్షణం సాయం చేసేందుకే చూస్తాడు. వారితో సమయాన్ని వెచ్చించడానికే ప్రయత్నిస్తాడు. మీరు మంచి కొడుకు పాత్రను పోషిస్తున్నారో లేదో అనే విషయాన్ని మీరే తెలుసుకోండి. ఇక్కడ మేము ఇచ్చిన లక్షణాలు మీలో ఉంటే మీరు మంచి కొడుకునే చెప్పాలి.
సమయాన్ని కేటాయించండి
మీ తల్లిదండ్రులకు ఇంట్లో సహాయం చేయడం, కుటుంబ కార్యక్రమాలకు హాజరవడం వంటివి కచ్చితంగా ఫాలో అవ్వాలి. మీకు సమయం లేకపోయినా వారి గురించి సమయాన్ని కేటాయించుకొని వచ్చారంటే మీరు వారికి విలువిస్తున్నట్టే లెక్క. వృద్ధాప్యంలో పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని మీ తల్లిదండ్రులు లెక్కించుకుంటారు. మీరు వారి కోసం సమయం కేటాయిస్తూ ఉంటే మీ వృద్ధ తల్లిదండ్రుల్లో ధైర్యం పెరుగుతుంది. మీపై ఆధారపడవచ్చనే నమ్మకం కలుగుతుంది.
సలహాలు తీసుకోండి
జీవితాన్ని చూసిన తల్లిదండ్రులకు ఎంతో అనుభవం ఉంటుంది. ఏదైనా విషయంలో వారి సలహాలను అడగడానికి వినేందుకు ప్రయత్నించండి. మీకు వారిచ్చిన సలహా నచ్చకపోయినా కూడా గౌరవంగానే తిరస్కరించండి. అంతే తప్ప మీకేం తెలియదు అన్నట్టు మాట్లాడకండి. వారు మీ విషయంలో ఏదైనా మాట్లాడే స్వేచ్ఛను వాళ్లకి ఇవ్వండి. ఇది నా సొంత వ్యాపారం, నా సొంత విషయం అని వారి దగ్గర మాట్లాడకండి. వారి నుంచి కొత్త విషయాన్ని ఏదైనా నేర్చుకోవచ్చునేమో ప్రయత్నించండి. వారు మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లోకే చూస్తూ వినండి. ఇది మీ మధ్య బంధాన్ని పెంచుతుంది.
పెళ్లవగానే మీ జీవితాన్ని వేరుగా చూడకండి. మీ జీవితంలోకి మీ తల్లిదండ్రులను కూడా అనుమతించండి. అప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. మీ ప్రైవసీ కోసం వేరే ఇంట్లో ఉన్నా కూడా వారికి తరచూ ఫోన్ చేయడం, వారు ఏం తిన్నారో కనుక్కోవడం, ప్రతిరోజూ వారిని కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం వంటివి చేయండి. వారితో సన్నిహితంగా ఉండేలా ప్రయత్నించండి. మీరు ఎంతగా కనెక్ట్ అయితే మీ తల్లిదండ్రులు కూడా అంత ధైర్యంగా జీవిస్తారు.
మీ తల్లిదండ్రులు మీ కోసం చేసే ప్రతి చిన్న పనికి విలువనివ్వండి. వారిని మెచ్చుకోండి. చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. వారితో గడిపిన ప్రతి క్షణాన్ని ఆనందంగా ఉండేలా చూసుకోండి. ఇది మీ పిల్లలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారో, పెద్దయ్యాక వారు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. మీ పిల్లల్ని కూడా మీ తల్లిదండ్రులకు దగ్గర చేసేందుకు ప్రయత్నించండి.
అందరూ బిజీ ప్రపంచంలోనే ఉన్నారు. ఉద్యోగాల పేరుతో వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువే ఉంది. మీ జీవితానికి ఉద్యోగం అత్యవసరం. అలాగే తల్లిదండ్రులు కూడా ముఖ్యమైన వారే. మీరు ఎంత దూరాన ఉన్నా ప్రతిరోజు వారితో మాట్లాడటం మాత్రం మర్చిపోకండి. టీ తాగుతూ వారితో వీడియో కాల్ మాట్లాడడం, టిఫిన్ తింటూ వారితో చాటింగ్ చేయడం వంటివి చేయండి. వీడియో కాల్ లో తల్లిదండ్రులు మీరు ఒకేసారి బ్రేక్ ఫాస్ట్ తింటూ మాట్లాడుకుంటే కలిసి తిన్న భావన కలుగుతుంది. ఇది తల్లిదండ్రుల్లో కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
పైన చెప్పిన పనులన్నీ మీరు చేస్తూ ఉంటే మీరు మంచి కొడుకని ఒప్పుకోవాల్సిందే. మంచి కొడుకుగా ఉండడం కేవలం పరిపూర్ణత కోసం కాదు, మీ బాధ్యత కోసం. చిన్నప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులకు పెద్దయ్యాక మీరు చూపించాల్సిన ప్రేమ, ఆప్యాయత వారికి అందాలి. ఇది చదివిన అందరూ మంచి కొడుకుగా ఉంటారని కోరుకుంటున్నాం.
టాపిక్