Cancer: పురుషుల కన్నా మహిళలకే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ? ముఖ్యంగా ఈ ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం
మహిళలు ఊబకాయం బారిన పడుతున్నారని వివిధ అధ్యయనాలు పదేపదే చెబుతున్నాయి. ఈ వాస్తవాన్ని మన చుట్టూ కూడా చూడవచ్చు. మహిళలు ఊబకాయానికి ఎందుకు గురవుతున్నారు, ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో శాస్వతి వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాల్లో ఊబకాయం కూడా ఒకటి. అధికబరువుతో బాధపడుతున్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం బారిన పడతారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 38 శాతం మంది ఊబకాయం బారిన పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 12 ఏళ్లలో ఈ సంఖ్య 51 శాతానికి చేరుకుంటుంది. భారతదేశంలో కూడా స్థూలకాయుల సంఖ్య ప్రతి సంవత్సరం 5.2 శాతం చొప్పున పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు వేగంగా వేగంగా ఊబకాయం బారిన పడుతున్నారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
ఊబకాయం వల్ల మహిళల్లో ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం 40 శాతం పెరుగుతుంది. ఊబకాయంతో ఉన్న మహిళలు గర్భం ధరిస్తే వారికి పుట్టే పిల్లలు స్ట్రోక్, డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 16 మంది మహిళల్లో ఒకరు, ప్రతి 25 మంది పురుషుల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మహిళలు ఎందుకు ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు?
మహిళలే ఎందుకు?
మహిళల్లో ఊబకాయం అనేది మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు అనేక సమస్యలతో ముడిపడి ఉంది. ఈ సమస్య పెరగక ముందే ఆపడం ఒక్కటే పరిష్కారం. అంటే మీరు బరువును తగ్గించుకోవడమే ముఖ్యం. హార్మోన్ల మార్పులే మహిళల్లో ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణమని ఫిజీషియన్ డాక్టర్ సునీతా నాగ్ పాల్ తెలిపారు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వ్యాధులు, మెనోపాజ్ వంటివి మహిళలను బరువు పెరిగేలా చేస్తున్నాయి.
ఊబకాయం క్యాన్సర్‌కు ఎలా దారి తీస్తుంది?
అధిక బరువు, ఊబకాయం అనేవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఊబకాయం అనేది ఇన్సులిన్, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ స్థాయిలను పెంచుతుంది. ఇది క్యాన్సర్లకు కారణం అవుతుంది. కొవ్వు కణాజాలాలు ఎక్కువైతే అవి ఈస్ట్రెజెన్ ఉత్పత్తిని పెంచేస్తాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ తో సహా కొన్ని క్యాన్సర్లను వచ్చేలా చేస్తాయి. ఇతరులతో పోలిస్తే ఊబకాయంతో బాధపడేవారే త్వరగా క్యాన్సర్ బారిన పడతారు. ముఖ్యంగా అధికబరువుతో ఉండే మహిళలకు కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి.
ఏ క్యాన్సర్లు?
ఊబకాయం అనేది అన్న వాహిక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ వంటివి వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా ఇవన్నీ మహిళలకే అధికంగా రావచ్చు. కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్