Sankranti Food: సంక్రాంతికి లడ్డూలు రెడీయేనా? శెనగపిండి, బెల్లంతో తయారుచేసే రుచికరమైన లడ్డూల రెసిపీ ఇదిగో!-are the laddus ready for sankranti heres a delicious recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranti Food: సంక్రాంతికి లడ్డూలు రెడీయేనా? శెనగపిండి, బెల్లంతో తయారుచేసే రుచికరమైన లడ్డూల రెసిపీ ఇదిగో!

Sankranti Food: సంక్రాంతికి లడ్డూలు రెడీయేనా? శెనగపిండి, బెల్లంతో తయారుచేసే రుచికరమైన లడ్డూల రెసిపీ ఇదిగో!

Ramya Sri Marka HT Telugu
Jan 12, 2025 05:00 PM IST

Sankranti Food: సంక్రాంతికి పిండి వంటలు రెడీ చేస్తున్నారా.. మరి తీపి వంటకాల్లో ఎన్ని రకాలు రెడీ అయ్యాయి. ఇదిగోండి.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ స్పెషల్ లడ్డును మీ ముందుకుతీసుకొస్తున్నాం. ఈ రెసిపీతో ఈసారి కొత్తగా ప్రయత్నించండి.

శెనగపిండి, బెల్లంతో తయారుచేసే రుచికరమైన లడ్డూల రెసిపీ
శెనగపిండి, బెల్లంతో తయారుచేసే రుచికరమైన లడ్డూల రెసిపీ (shutterstock)

మకర సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే అన్ని రకాల పిండి వంటలు సిద్ధం అయిపోయి ఉంటాయి. అనేక రకాల లడ్డూలను ట్రై చేసి ఉండొచ్చు. మరి శెనగపిండితో బెల్లం కలిపి చేసే లడ్డూల గురించి మీకు తెలుసా..? ఇందులో నువ్వులు వేసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయి. ఈ సంక్రాంతికి నువ్వుల లడ్డూలతో పాటు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే, ఇది మీకు బెస్ట్ ఆప్షన్. సింపుల్ రెసిపీతో టేస్టీగా లడ్డూలను చేసుకోవాలంటే ఇది చదివేయండి.

yearly horoscope entry point

తయారీకి కావలసినవి పదార్థాలు

  • 250 గ్రాముల శెనగపిండి
  • 100 గ్రాముల బెల్లం
  • పావు టీస్పూన్ బేకింగ్ సోడా
  • 3 టీస్పూన్ల నూనె
  • ఫ్రై చేసుకోవడానికి సరిపడ నూనె

శెనగపిండితో లడ్డూలు తయారీచేసే విధానం

  • ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి తీసుకోండి. దానిలో పావు టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. మీకు నచ్చితే ఒక టీస్పూన్ సోంపును కూడా వేయవచ్చు.
  • శెనగపిండిని బాగా కలిపి, అందులో రెండు నుండి మూడు టీస్పూన్ల నూనె వేయండి. ఇలా వేయడం ద్వారా పిండి మరింత బాగా కలుస్తుంది.
  • ఇప్పుడు నీళ్లు పోసి పిండిని మెత్తగా పిసకండి.
  • చేతులకు నూనె రాసుకుని ఈ పిండిని తీసుకుని పొడువాటి ముక్కలుగా చేసే మెషిన్‌లో వేయండి.
  • మెషిన్ లేకపోతే రంధ్రాలు ఉన్న గరిటెతో పిండిని పొడవాటి ముక్కలుగా చేసుకోవచ్చు.
  • ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత మెషిన్ నుండి తీసిన ముక్కలను లేదా మీరు తయారుచేసుకున్న ముక్కలను కడాయిలో వేసేయండి.
  • అలా వేసిన ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి బయటకు తీసి ఓ గిన్నెలో వేసి చల్లారనివ్వండి.
  • ఇప్పుడు మరో కడాయిలో బెల్లం ముక్కలను వేయండి. అవి కరిగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. సులభంగా కరిగిపోతాయి.
  • దానితో పాటుగా రెండు నుండి మూడు టీస్పూన్ల నీళ్లు వేయండి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేయండి. దీనివల్ల బెల్లం గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది.
  • బెల్లంతో ముదురు పాకం వచ్చే వరకూ వేడిచేయండి. ఇప్పుడు పాకాన్ని తీసుకుని నీటిలో వేసి లడ్డూ చేసేందుకు కుదురుతుందేమోనని ఓసారి పరీక్షించండి.
  • ఇప్పుడు అందులోకి శెనగపిండితో జంతికల మాదిరిగా చేసిన చిన్న చిన్న ముక్కలను కలపండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేయడం వల్ల అన్ని ముక్కలకు బెల్లం పాకం పడుతుంది.
  • ఇక మంట ఆపేసి, కిందకు దించుకున్న వెంటనే చేతులకు నీళ్లు రాసుకుని త్వరగా లడ్డూలు చుట్టేయండి.
  • మీకు లడ్డూల్లా వద్దని అనుకుంటే, ఒక పళ్ళెంలో పరుచుకుని బర్ఫీలు లేదా చిక్కీలుగా కూడా చేసుకోవచ్చు.

అంతే, మీరు చేయాలనుకుంటున్న శెనగపిండి లడ్డూలు రెడీ!!

శెనగపిండి - బెల్లం కాంబినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు:

శెనగపిండి, బెల్లం కాంబినేషన్ వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. శెనగపిండిలోని ప్రోటీన్లు, బెల్లంలోని ప్రకృతిక చక్కెర శరీరానికి ఇంధనంగా పనిచేస్తాయి. బెల్లం అనేది శరీరంలోని డిటాక్స్ ఫంక్షన్లను మెరుగుపరచటంతో పాటు, శెనగపిండి కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అందించే ఆహార పదార్థం. ఈ రెండు కలిసి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం