కళాయి నల్లగా మాడిపోయిందా? ఈ చిన్న చిట్కాలతో ఆ మాడును తొలగించండి
ఇంట్లో వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు కళాయి గిన్నెలు మాడిపోవడం సహజమే. అయితే వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం అనుకుంటారు. చిన్న చిట్కాల ద్వారా కళాయిలను మెరిపించేయచ్చు.
ప్రతి ఇంట్లో ప్రతిరోజూ గిన్నెలు తోమాల్సిందే. అయితే కొన్ని కొన్నిసార్లు ఆహారం మాడిపోయి అడుగున నల్లగా అయిపోతుంది. దాన్ని శుభ్రం చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేపుళ్లు చేసినప్పుడు ఇలా మాడిపోయే అవకాశం ఎక్కువ. కళాయి కింద గ్రీజు పెరిగిపోయినప్పుడు, దాన్ని తోమలేక మహిళలు రెండు మూడు రోజులు అలా నీళ్ళల్లో వేసి వదిలేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు చిన్న చిట్కాలు ద్వారా ఆ మాడిపోయిన పాత్రను నిమిషాల్లో శుభ్రం చేసుకోవచ్చు.
వెనిగర్‌తో
కళాయి మాడిపోయినప్పుడు మీరు బేకింగ్ సోడా, వెనిగర్ తో ఆ మాడును తొలగించవచ్చు. చిన్న గ్లాసు నీరు తీసుకొని అందులో వెనిగర్ ను కలపండి. ఇప్పుడు మాడిపోయిన కళాయిని స్టవ్ మీద పెట్టి వెనిగర్ కలిపిన నీటిని అందులో వేయండి. చిన్న మంట మీద వేడి చేయండి. ఆ కళాయిలోనే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కూడా వేసి కలుపుతూ ఉండండి. కింద నుంచి మంట తగులుతూ ఉంటే నీళ్ళల్లో ఉండే వెనిగర్, బేకింగ్ సోడా కలిసి ఆ మాడును త్వరగా తొలగించడానికి సహాయపడుతుంది. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆ కళాయిని చల్లారనివ్వాలి. కళాయి చల్లారాక ఆ మాడును గట్టిగా తోమితే శుభ్రపడిపోతుంది.
బేకింగ్ సోడా పేస్టు
పాత్ర మరీ ఎక్కువగా కాలిపోతే బేకింగ్ సోడా పేస్ట్ ఉపయోగించి శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాను నీటిని సమాన పరిమాణంలో తీసుకొని పేస్టులా చేసుకోవాలి. దాన్ని కళాయి అడుగున రాసేయాలి. కాసేపు అలా ఉంచాలి. ఆ తర్వాత స్టీల్ పీచుతో గట్టిగా రుద్దితే ఆ మాడు మొత్తం ఊడిపోతుంది. మళ్లీ కళాయి మిలమిలా మెరవడం మొదలవుతుంది.
నిమ్మకాయ
నిమ్మకాయలో కూడా సహజంగానే మురికిని వదిలించే లక్షణాలు ఉంటాయి. మీ కళాయి మాడిపోయినప్పుడు నిమ్మకాయను ఉపయోగించి దాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయతో పాటు డిష్ వాషింగ్ సబ్బు కూడా అవసరం పడుతుంది. మాడిపోయిన కళాయిలో నిమ్మకాయలను రసాన్ని పిండి వేయండి. అలాగే ఆ నిమ్మకాయ ముక్కలను అందులోనే వేసి కాస్త నీళ్లు పోయండి. ఆ కళాయిని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద వేరు చేయండి. అది గోరువెచ్చగా అయ్యాక స్పాంజితో రుద్దండి. తర్వాత మళ్లీ అందులో డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా వేసి మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అది కళాయి వేడి తగ్గాక మళ్ళీ స్పాంజితో గట్టిగా రుద్దితే ఆ మాడు తొలగిపోతుంది.
సంబంధిత కథనం