Millets Side Effects: చిరుధాన్యాలు తినడం కొందరికి మంచివి కావా? ఎలాంటి సమస్యలు ఉన్నవారు మిల్లెట్లను దూరం పెట్టాలి?
Millets Side Effects: మిల్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. అయితే చిరుధాన్యాలను అధికంగా తింటే కొంతమంది వ్యక్తుల్లో అవి సైడ్ ఎఫెక్టులను కలిగిస్తాయని అంటారు. ఇవి ఎంత వరకు నిజమో తెలుసుకుందాం.
Millets Side Effects: ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పోషకాహారంగా చిరుధాన్యాలు నిలుస్తున్నాయి. ఇవి ప్రాచీన కాలం నుంచి సాగు చేస్తున్న ధాన్యాలు. కొర్రలు, సజ్జలు,రాగులు, జొన్నలు, సామలు, ఊదలు, ఉలవలు, అరికెలు, ఆండూ కొర్రలు వీటన్నింటినీ కలిపి చిరుధాన్యాలు అని పిలుస్తారు.
డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు అధికంగా చిరుధాన్యాలను తింటున్నారు. మరికొంతమంది ఆరోగ్యం కోసం తెల్ల అన్నాన్ని మాని పూర్తిగా మిల్లెట్ల పైనే ఆధారపడుతున్నారు. ఈ చిరుధాన్యాల్లో బీటా కెరాటిన్ అధికంగా ఉంటుంది. అలాగే నియాసిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు ఇస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా త్వరగా తగ్గుతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, గుండెను రక్షించడానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకోవడానికి చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి.
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం మిల్లెట్లు ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లతో నిండి ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల ఫైటిక్ యాసిడ్ శరీరంలో చేరి ఐరన్, కాల్షియం, జింకు వంటి అవసరమైన ఖనిజాలను బంధించి వేస్తుంది. వాటిని శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. అందుకే మిల్లెట్లు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తింటే కొన్ని రకాల ఖనిజ లోపాలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కొంతమంది చిరుధాన్యాలను అధికంగా తినకూడదు. వారు ఎవరో తెలుసుకోండి.
థైరాయిడ్ బాధితులు
మీకు హైపర్ థైరాయిడిజం ఉంటే చిరుధాన్యాలను మీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తినాలనిపించినా చాలా తక్కువగా తినాలి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం మిల్లెట్లలో ఉండే కొన్ని సమ్మేళనాలు యాంటీ థైరాయిడ్ ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత సమస్యలు రావచ్చు.
జీర్ణ సమస్యలు ఉంటే
జీర్ణశక్తి అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటివారు మిల్లెట్లను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం మంచిది కాదు. మిల్లెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చిరుధాన్యాలు అధికంగా తింటే జీర్ణ సమస్యలు ఉన్న వారిలో ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్, డయేరియా వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఒకవేళ మిల్లెట్లను తింటే నీరు అధికంగా తాగండి. మిల్లెట్లను జీర్ణం చేయడానికి నీరు ఎంతో సహాయపడుతుంది.
పోషకాహార లోపం ఉంటే
చిరుధాన్యాలలో టానిన్లు ఉంటాయి. ఈ టానిన్లు శరీరం క్యాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. అందుకే పోషకాహార లోపం ఉన్నవారు చిరుధాన్యాలను తినాలనుకుంటే వాటిని ముందుగానే నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
మిల్లెట్లను తినేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండకూడదనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మిల్లెట్లను అధికంగా తినడం మానేయండి. మిల్లెట్లు వండడానికి ముందు మంచినీటిలో ఎక్కువసేపు నానబెట్టండి. ముఖ్యంగా ఇలా నానబెట్టిన లేదా మొలకెత్తిన చిరుధాన్యాలు పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. మిల్లెట్లను మిక్స్ చేసి తినడం మానేయాలి. అంటే కొర్రలు, ఊదలు, సామలు లాంటివి కలిపేసి వండడం మానేయాలి.