Diabetes History: మధుమేహం కేసులు తొలిసారి మనుషుల్లో ఎప్పుడూ కనిపించాయి? డయాబెటిస్ అనే పదం ఏ భాషకు చెందినది?
Diabetes History: ఇప్పుడు డయాబెటిస్ అందరికీ పరిచయమైన వ్యాధి. ఎప్పుడైనా ఆలోచించారా... మొదటిసారి మనుషులకు ఇది ఎప్పుడు వచ్చిందో, అలాగే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోండి.
డయాబెటిస్ ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారిపోయింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న ప్రకారం ప్రపంచంలో 38.1 మిలియన్ల మందికి డయాబెటిస్ ఉన్నట్టు అంచనా. అంతేకాదు ఈ ప్రపంచంలో ఎక్కువ మరణాలకు కారణం అవుతున్న వాటిలో డయాబెటిస్ ఎనిమిదో స్థానంలో ఉంది. డయాబెటిస్ పై అవగాహన పెంచుకునేందుకే ప్రతి ఏటా నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నిర్వహించుకుంటారు. డయాబెటిస్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలా ముందస్తు జాగ్రత్త పడాలో అవగాహన పెంచుకునేందుకే ఈ ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించారు.
తొలిసారి మధుమేహం ఎప్పుడు బయటపడింది?
ఇప్పుడు వంద మందిలో యాభై మందికి మధుమేహం కచ్చితంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మధుమేహం ఆధునిక కాలంలో వచ్చిన వ్యాధి కాదు. పురాతన ఈజిప్షియన్లకు కూడా మధుమేహం వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. చైనా, భారత్ దేశాల్లో కూడా ప్రాచీనకాలంలో డయాబెటిస్ వచ్చినట్టు చరిత్రకారులు చెబుతారు. కాకపోతే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువమంది ఈ మధుమేహం బారిన పడుతున్నారు. 18వ శతాబ్దంలో మధుమేహం సంకేతాలను ఎక్కువగా గుర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడు డయాబెటిస్ అనేది అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది.
డయాబెటిస్ పేరు ఎలా వచ్చింది?
మధుమేహాన్ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని పిలుస్తారు. డయాబెటిస్, మెల్లిటస్... అనే రెండు పదాలకు రెండు వేరువేరు అర్ధాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఒక అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరిచారు. మెల్లిటస్ అంటే తేనెలాగా ఆహ్లాదమైన రుచి అని అర్థం. పురాతన కాలంలో కుక్కలు కొంతమంది మనుషుల మూత్రాన్ని అధికంగా వాసన చూడడం గమనించారు. వారి మూత్రాన్ని అలా అవి అధికంగా వాసన చూడడానికి కారణం ఆ మూత్రం నుంచి వచ్చే తీపి రుచి. ఇలా మూత్రాన్ని తీయగా మార్చేది రక్తంలో అధిక స్థాయిలో కలిసిన గ్లూకోజ్. అలాంటి వ్యక్తులకే డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే డయాబెటిస్ అనే పేరుకు వెనుక మెలిటస్ అనే పదం చేరింది. ఇక డయాబెటిస్ పేరు విషయానికి వస్తే ఇది ఒక పురాతన గ్రీకు పదం. మూత్ర విసర్జన అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని వాడతారు. ఈ రెండూ కలిపి మధుమేహానికి వైద్య పరిభాషలో డయాబెటిస్ అనే పదాన్ని నిర్ణయించారు.
డయాబెటిస్ రకాలు
డయాబెటిస్ ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకుంటారు. అందులో ఒకటి టైప్1 డయాబెటిస్. ఇది జన్యుపరంగా వచ్చేది. ముఖ్యంగా పిల్లల్లోనే ఇది కనిపిస్తుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ అనేది వయసు పెరిగాక వచ్చే వ్యాధి. ముప్ఫై ఏళ్లు నిండిన వారిలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇక గర్భధారణ సమయంలో వచ్చేది జెస్టేషనల్ డయాబెటిస్. డయాబెటిస్ రావడానికి ముందు ప్రీ డయాబెటిస్ అనే దశ ఉంటుంది. అంటే వీరు పూర్తిగా డయాబెటిక్‌గా మారడానికి దగ్గరలో ఉన్నారని అర్థం. అలాంటి వారు తమ జీవనశైలిని ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా తమను కాపాడుకోవచ్చు.
మధుమేహం అంటే రక్తంలో చక్కెర అధికంగా కలిగి ఉండే వ్యాధి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా చేరినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ మధుమేహం చికిత్స వేల ఏళ్లనాడే మొదలైంది అని చెప్పుకుంటారు. సుశ్రుతుడు అని పిలిచే ప్రాచీన వైద్యుడు ఈ మధుమేహం చికిత్సకు ప్రారంభ మార్గదర్శకులుగా చెబుతారు.
పురాతన కాలం, మధ్యయుగాలలో మధుమేహం కారణంగా మరణించే వారి సంఖ్య అధికంగానే ఉండేది. సుశ్రుతుడు భారతీయ వైద్యుడు. ఈయన మధుమేహం అనే పేరును కనిపెట్టాడు. మధు అంటే తేనె అని అర్థం. తీపిగా ఉండే మూత్రం అని చెప్పడానికి మధుమేహంగా చెప్పుకుంటారు. పురాతన భారతదేశంలో ఒక వ్యక్తి మూత్రం పోశాక ఆ మూత్రానికి చీమలు పడితే అతడికి మధుమేహం ఉందో లేదో అని చెప్పేవారు.