అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ, దీని రుచి ముందు చికెన్ కర్రీ కూడా పనికిరాదు, ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి-aratikaya kofta curry recipe even chicken curry doesnt taste good before this try this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ, దీని రుచి ముందు చికెన్ కర్రీ కూడా పనికిరాదు, ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి

అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ, దీని రుచి ముందు చికెన్ కర్రీ కూడా పనికిరాదు, ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి

Haritha Chappa HT Telugu

అరటికాయతో చేసే కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీని రెసిపీ చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ మేము అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ (SARA'S MENU/youtube)

అరటికాయలతో చేసే వేపుళ్ళు, కూర మీకు బోర్ కొట్టేసి ఉంటాయి. అందుకే కొత్తగా అరటికాయ కోఫ్తా కర్రీ ప్రయత్నించండి. దీన్ని తిన్నారంటే వదల్లేరు. చికెన్ మటన్ కూడా ఈ కూర ముందు తేలిపోతాయి.

బాగా మసాల దట్టించి చేసే ఈ అరటికాయ కోఫ్తా కర్రీ అద్భుతంగా ఉంటుంది. దీన్ని అన్నంలోనే కాదు, చపాతీ రోటీతో తిన్నా కూడా బాగుంటుంది.ఎప్పుడూ ఒకేలాంటి అరటికాయ కూరలు తినే బదులు ఇలా కొత్తగా అరటికాయ కోఫ్తా కర్రీ ప్రయత్నిస్తే నాలికకు కొత్త రుచులు కూడా తెలుస్తాయి.

అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

అరటికాయలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

శెనగపిండి - పావు కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

టమోటో - ఒకటి

బిర్యానీ ఆకులు - రెండు

ఉల్లిపాయ - రెండు

నూనె - నాలుగు స్పూన్లు

కారం - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

పసుపు - అర స్పూను

నీరు - సరిపడినన్ని

అరటికాయ కోఫ్తా కర్రీ రెసిపీ

1. అరటికాయ కాడలను కట్ చేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్లు వేసి ఉడకబెట్టాలి.

2. రెండు విజిల్స్ వరకు ఉడికిస్తే చాలు తర్వాత కుక్కర్ మూత తీసి అరటికాయలను బయటకు తీసి చల్లార్చాలి.

3. అవి బాగా చల్లారాక పైన ఉన్న తొక్కను సులువుగా తీసేయవచ్చు.

4. ఇప్పుడు మిగతా భాగాన్ని ఒక గిన్నెలో వేసి చేత్తోనే మెత్తగా మెదుపుకోండి. గుజ్జులాగా తయారవుతుంది.

5. ఆ గుజ్జులోనే శెనగపిండిని వేసి బాగా కలపండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి.

6. కూరలో కూడా మనం ఉప్పును వేస్తాం కాబట్టి ఈ గుజ్జులో అర స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది.

7. ఆ తర్వాత రెండు స్పూన్ల కొత్తిమీర తరుగు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. ఈ మిశ్రమాన్ని చేత్తోనే చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి ఈ ఉండాలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

10. ఇప్పుడు అదే కళాయిలో అవసరమైనంత మేరకే నూనెను ఉంచి మిగతాది తీసేయాలి.

11. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.

12. ఉల్లిపాయలు రంగు మారేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.

13. ఈ మొత్తం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటో తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

14. పైన మూత పెడితే టమోటాలు మెత్తగా ఉడుకుతాయి.

15. టమోటాలు గుజ్జులా ఉడికిన తర్వాత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

16. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు కూడా వేయాలి.

17. అప్పుడే ఇది ఇగురు లాగా వస్తుంది. పైన మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

18. తర్వాత మూత తీసి ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ కోఫ్తాలను అందులో వేసి బాగా కలుపుకోవాలి.

19. పైన మూత పెట్టి మళ్ళీ పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

20. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అరటికాయ కోస్తా కర్రీ రెడీ అయినట్టే.

21. దీన్ని అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు చపాతీతో కూడా దీన్ని తినవచ్చు. అలాగే దోశతో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది.

అరటికాయ వేపుడు, బజ్జీలు ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి అరటికాయ కోఫ్తా కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ అరటికాయ కోఫ్తా కర్రీ పక్కన వెజ్ బిర్యానీ కూడా పెట్టుకుంటే కాంబినేషన్ అదిరిపోతుంది. లేదా బగారా రైస్ అరటికాయ కోఫ్తా కర్రీ కాంబినేషన్ కూడా ప్రయత్నించండి. రుచిగా ఉంటుంది. అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు తరచూ అరటికాయలు తినాల్సిన అవసరం ఉంది.

అరటికాయలో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా అరటికాయలు తింటే మంచిది. గుండెపోటు సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి కూడా అరటికాయ ఎంతో ఉపయోగపడుతుంది. అన్నట్టు అరటికాయ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి అరటికాయతో చేసిన ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎన్నయినా తినవచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం