April Fools' Day 2022 | అందుకే ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు?!
క్యాలెండర్‌లో నెల మారింది, మార్చి పోయి ఏప్రిల్ మాసం వచ్చేసింది. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే అన్నమాట. ఒకరిపైకరు చిట్టిపొట్టి చిలిపి జోకులు వేసుకోవడం, ఏప్రిల్ ఫూల్ అంటూ వెక్కిరించడం.. వెర్రిగా పిచ్చిగా ప్రవర్తించడం ఈరోజు ప్రత్యేకత.
ప్రతీఏడాది ఏప్రిల్ 1వ తేదీన మూర్ఖుల చేత మూర్ఖుల కొరకు మూర్ఖులు జరుపుకునే పండుగనే ఏప్రిల్ ఫూల్స్ డే అంటారు. అని ఎవరైనా చెప్తే.. నిజమని నమ్మారో మీరు ఏప్రిల్ ఫూల్ అయినట్లే. కానీ అది కాదు, అసలు వాస్తవం ఏమంటే ఇది వసంతకాలం ప్రారంభమయ్యే రోజు .
ట్రెండింగ్ వార్తలు
ఇటలీలోని రోమ్ చక్రవర్తి భార్య పేరు స్ప్రింగ్ ఏప్రిల్.. ఆమె జన్మదిన వేడుకలను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని చక్రవర్తి ఆజ్ఞాపిస్తాడు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1న ఫూల్స్ డే నిర్వహిస్తున్నారని చరిత్రలో ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఇది నమ్మితే మళ్లీ ఫూల్ అయినట్లే.
ఇదిగో ఇలాగే ఉంటుంది ఏప్రిల్ 1 నాడు పరిస్థితి. ఏదో ఒక కట్టుకథ చెబుతారు, అది నమ్మితే ఏప్రిల్ ఫూల్ అని ప్రాంక్ చేస్తారు. నమ్మలేదు అని చెప్పినా.. ఫూల్స్ ఏది చెప్పినా నమ్మరు అంటూ ఆ రకంగానూ జోక్స్ వేస్తారు. అసలు ఈరోజును ఎలా? ఎందుకు జరుపుకుంటారనే దానిపై ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎవరికీ ఇబ్బందిలేనపుడు ఇదొక సరదా ఆటలాగా ఉంటుంది కాబట్టి దీనిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ ఫూల్స్ డే మూలం
ఏప్రిల్ ఫూల్స్ డే మూలం ఎక్కడ ఉందనే విషయంపై సరైన ఆధారాల్లేవు. అయితే 1582లో ఫ్రాన్స్ దేశ ప్రజలు జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు క్యాలెండర్లో మార్పును గమనించకుండా ఏప్రిల్ 1ని నూతన సంవత్సరంగా జరుపుకున్నారు. అప్పట్నించీ ఫ్రాన్స్ పౌరులను ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచారు. కాబట్టి అది అలా కొనసాగుతూ వచ్చిందనే ఒక వాదనను మాత్రం మెజారిటీ ప్రజలు అంగీకరించారు. అప్పట్నించీ అది అలాగే కొనసాగుతూ వస్తోంది.
ఏప్రిల్ 1 ఫూల్స్ డే రోజున ప్రపంచంలో ఎక్కడ సెలవు పాటించరు. అయితే ఉక్రెయిన్‌లోని ఒడెసాలో మాత్రం ఈరోజును ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు.
ఏదైతేనేం.. నవ్వడానికి.. వినోదానికి ఒక రోజు అంటూ వచ్చింది. హాయిగా జోకులు వేసుకొని నవ్వుల పువ్వులు పంచండి. అందరికీ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు.
సంబంధిత కథనం
అసలే డెలికేట్ మైండా మీది? అయితే ఇలా చేయండి!
March 15 2022