Apple Kheer: రోజూ ఒక ఆపిల్ తింటే వైద్యుని అవసరం లేదని అంటారు. ప్రతిరోజు ఈ పండును పిల్లలకు తినిపించమని సూచిస్తారు. ఆపిల్ పండును పాయసంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు ఆపిల్ పాయసం చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆపిల్ పండుతో పాటు మరిన్ని పోషకాలు వారి శరీరంలో చేరుతాయి. ఇందులో మనం నట్స్ అధికంగా వాడుతాం కాబట్టి అందులో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. ఆపిల్ ఖీర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆపిల్ పండ్లు - రెండు
పాలు - ఒక లీటరు
పంచదార - 5 స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
కుంకుమ పువ్వు రేకులు - నాలుగు
బాదం పప్పులు - గుప్పెడు
పిస్తా పప్పులు - గుప్పెడు
జీడిపప్పు - గుప్పెడు
కండెన్స్‌డ్ మిల్క్ - అర కప్పు
1. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. చిన్న మంట మీద ఉడికించాలి.
2. పాలు సగం వరకు అయ్యేదాకా మరిగించాలి. పాల పరిమాణం తగ్గాక అది చిక్కగా మారుతుంది.
3. కాస్త చిక్కగా మారిన పాలలో యాలకుల పొడి, కుంకుమపువ్వు రేకులు, బాదం, జీడిపప్పు, పిస్తా తరుగు వేసి కలపాలి.
4. ఆ పాలలో కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపాలి. ఇది కాస్త మందంగా మారుతుంది.
5. ఇప్పుడు తురిమిన ఆపిల్ ముక్కలను వేసి కలుపుకోవాలి.
6. తర్వాత పంచదారను కూడా వేసి నాలుగైదు నిమిషాలు పాటు ఉడికించాలి. అంతే ఆపిల్ ఖీర్ రెడీ అయినట్టే.
7. స్టవ్ కట్టేసి పిల్లలకు సర్వ్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
ఆపిల్ పండు తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిదే. ఆపిల్ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆపిల్ తినే వారిలో ఊబకాయం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఆస్తమా, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు, క్షయా వంటివి వచ్చే అవకాశం తక్కువే. ఆపిల్ ఖీర్‌లో ఆపిల్ అధికంగానే వాడాము కాబట్టి దీనివల్ల పిల్లలకు మేలే జరుగుతుంది. ఒకసారి ఆపిల్ ఖీర్ రెసిపీని ఇంటి దగ్గర ప్రయత్నించండి.
టాపిక్