Tuesday Motivation: ఆనందంగా జీవించడం ఎలా? అని అందరూ ఆలోచిస్తారు. దానికి పరిష్కారం మీ అందరికీ తెలిసిందే... ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అసంతృప్తిని వదిలేయాలి. సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అత్యాశను విడిచి పెట్టాలి. భగవద్గీత కూడా ఇదే చెబుతోంది. శాంతి, సంతోషమనేది మన అంతరంగంలో ఉంటుంది. మన ఆలోచన తీరులో ఉంటుంది. మన ఆలోచన తీరు అత్యాశవైపు అడుగులేస్తూ ఉంటే జీవితంలో ఆనందం దొరకడం కష్టం.
జీవితంలో ఏది దొరికితే దానితో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అప్పుడే మీకు నిజమైన ఆనందం కనిపిస్తుంది. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతున్న వారి సంఖ్య తక్కువే. వారు తమ కన్నా పైనున్న వారిని చూసి ఈర్ష్యా, అసూయ పడుతున్నారు. కానీ తమ కన్నా తక్కువ స్థితిలో ఉన్న వారితో పోల్చుకోవడం లేదు. అందుకే ఎంతోమంది అసంతృప్తిగా జీవిస్తున్నారు. వారి జీవితంలో ఆనందం తక్కువైపోతోంది.
మీరు సంతోషంగా ఉండాలో బాధగా ఉండాలో నిర్ణయించేవారు ఎదుటివారు కాదు మీలోని అంతరంగమే. మీ చుట్టూ ఉన్న మానవ జీవితం ఎప్పటికీ నూటికి నూరు శాతం మీకు నచ్చినట్టుగా ఉండదు. కొన్నిసార్లు మీరే దాన్ని నచ్చేలా చేసుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా జీవించగలరు.
ఆనందమనేది మీ ఆలోచనల్లో ఉండాలి. ఆలోచనలే మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. మీ ఆనందం నీ చుట్టూ జరిగే విషయాలపై ఆధారపడి ఉంటే మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా జీవించడానికి మీరే కారణం అవుతారు. మీరు ఆనందంగా జీవించలేక పోవడానికి కూడా మీరే కారణం. దానికి ఇతరులను బాధ్యులను చేయకండి.
చేతిలో వంద రూపాయలు ఉన్నవాడికి... వెయ్యి రూపాయలు కావాలన్న ఆశ పుడుతుంది. అదే వెయ్యి రూపాయలు కావాలనుకున్న వాడికి లక్షపై ఆశ పుడుతుంది. ఇలా ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఇలా ఆశ అత్యాశగా మారుతున్న కొద్దీ ఆనందం మీ జీవితంలో నుంచి ఆవిరైపోతూ ఉంటుంది. కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా జీవించడం ఎలా అని ఆలోచించండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న జీవితం, మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. దుఃఖం స్థానంలో ఆనందం వస్తుంది. బాధలు ఒకేసారి మటుమాయమైనట్టు అనిపిస్తాయి. మీలో ఉన్న ప్రతికూలతను మీరే తీసి పడేయాలి. వాటిని తీసేయడం ఇతరుల వల్ల కాదు.
వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. భవిష్యత్తు కోసం కలల కంటూ వర్తమానాన్ని నాశనం చేసుకోకండి. భవిష్యత్తు కోసం కూడబెడుతూ వర్తమానంలో కష్టపడుతున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. వర్తమానంలో సంతోషంగా జీవించడం నేర్చుకుంటే భవిష్యత్తు కూడా అంతే సంతోషంగా తయారవుతుంది.
ప్రతిక్షణం లేనిదాని గురించి తలుచుకుంటూ చింతించడం మానేయాలి. మీ దగ్గర ఉన్న దాన్ని చూసి మురిసిపోవడం ముఖ్యం. అదే మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. బాధను తొలగిస్తుంది. అందరూ అంబానీల్లా మారలేరు. ఉన్నదాంట్లోనే ఆనందంగా జీవించడం నేర్చుకుంటే... మీ ముందు అంబానీలు కూడా దిగదుడుపే.