ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది. జీవితంలోని ఎన్నో అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుపరుస్తోంది. ఇప్పుడు రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు డయాబెటిస్ రోగుల కోసం ఒక కొత్త పరిశోధన చేశారు. వారికి ఏఐ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను కనిపెట్టే యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ విజయవంతంగా పనిచేస్తోంది. త్వరలో మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది.haritha
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడే నీడ లాంటిది. ఇది మందుల ద్వారా, జీవనశైలి ద్వారా అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నయం చేయడం కుదరదు. జీవనశైలిని ఆహారపు అలవాట్లను మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో డయాబెటిస్ రోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం డయాబెటిస్ ఉన్నవారే కాదు... లేనివారు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీనివల్ల ప్రారంభంలోనే డయాబెటిస్ ను గుర్తించవచ్చు. లేకుంటే వ్యాధి ముదిరిపోయాక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఒడిశాలోని ఎన్ఐటి రూర్కెలాలో బయోటెక్నాలజీ మెడికల్, ఇంజనీరింగ్ భాగంలో పనిచేస్తున్న బృందం ఈ కొత్త యాప్‌ను సిద్ధం చేసింది. ఈ పరిశోధన డయాబెటిస్ రోగుల పాత డేటా ఆధారంగా వారి భవిష్యత్తులో చక్కెర స్థాయిలను కచ్చితంగా అంచనా వేస్తుందని చెబుతున్నారు. వైద్యులు, ఇంజనీర్లు కలిసి ఇటువంటి సాంకేతికతను రోగులకు అందిస్తున్నారు.
ప్రస్తుతం వీరు తయారు చేసిన ఈ యాప్ ఇంకా విడుదల కాలేదు. ఇది గూగుల్ ప్లే స్టోర్లో విడుదలైన తర్వాత అందరూ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను కనుక్కోవచ్చు. అధికంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవచ్చు. త్వరలోనే ఈ యాప్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోవడాన్ని సూచిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా అంటారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కూడా. అలాగే వంశంలో ఎవరికీ లేకపోయినా కూడా ఇప్పుడు ఎంతోమందికి వచ్చేస్తుంది. డయాబెటిస్ రావడానికి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ముఖ్య కారణం. హార్మోన్లలో అసమతుల్యతను, ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోవడం, జన్యుపరమైన ముటేషన్లు, కొన్ని రకాల మందులు వాడడం వంటివి కూడా డయాబెటిస్ కు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి.
డయాబెటిస్ ఉన్న వారిలో దాహం అధికంగా వేస్తుంది. తరచూ మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు. ఏ పని చేసినా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కంటిచూపు కూడా మసకగా మారుతుంది. బరువు తగ్గిపోతారు. చేతులు, పాదాలలో మంట పెడుతూ ఉంటుంది. చిన్న చిన్న గాయాలు కూడా తగ్గడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం