Amla Rasam Recipe: జలుబు, దగ్గును తగ్గించగల టెస్టీ ఉసిరికాయ రసం.. తయారీ ఇలా.. చలికాలంలో ఎంతో మేలు
Amla Rasam Recipe: ఉసిరికాయలతో చేసే రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రుచి కూడా అదుర్స్ అనేలా ఉంటుంది. ఈ రసం ఎలా చేసుకోవాలంటే..
ఉసిరికాయల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అలాంటి ఉసిరికాయలతో టేస్టీగా రసం చేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. చలికాలంలో సమస్యగా ఉండే జలుబు, దగ్గు నుంచి ఈ ఉసిరికాయ రసం ఉపశమాన్ని కలిగిస్తుంది. జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి ఎన్నో విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. మరి, ఈ ఉసిరికాయ రసాన్ని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉసిరికాయ రసం కోసం కావాల్సిన పదార్థాలు
- 4 ఉసిరికాయలు (4 ముక్కలుగా తరిగి విత్తనాలు తీయాలి)
- ఓ టేబుల్ స్పూన్ మిరియాలు
- రెండు టేబుల్ స్పూన్‍ల జీలకర్ర
- 2 టమోటాలు (తరిగినవి)
- ఓ టేబుల్ స్పూన్ నూనె
- ఓ పచ్చిమిర్చి తరుగు
- ఓ ఎండుమిర్చి
- కాస్త ఇంగువ, రెండు రెబ్బల కరివేపాకు, ఓ టేబుల్ స్పూన్ అల్లం తురుము, అర టేబుల్ స్పూన్ పసుపు, కాస్త కొత్తిమీర, ఆవాలు
- తగినంత ఉప్పు
- అరకప్పు కందిపప్పు (ఉడికించుకొని మెత్తగా చేసుకోవాలి) (ఆప్షనల్)
ఉసిరికాయ రసం తయారు చేసే విధానం
- ముందుగా ముక్కలుగా తరుక్కొని విత్తనాలు తీసేసిన ఉసిరికాయలను, మిరియాలను, ఓ టేబుల్ స్పూన్ జీలకర్రను, తరిగిన టమోటాల ముక్కలను ఓ మిక్సీ జార్‌లో వేయాలి.
- వీటిలో పావు కప్పు నీరు కూడా పోసి.. మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి.
- స్టవ్‍పై ఓ కళాయి పెట్టి ఓ టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. దాంట్లో ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఇంగువ వేయాలి. అవాలను చిట్లనివ్వాలి.
- ఆ తర్వాత కరివేపాకు, చిన్న ముక్కలుగా చేసిన ఓ ఎండుమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయాలి. అల్లం తరుగు, నిలువునా చీరిన పచ్చిమిర్చి వేసి కాసేపు వేపాలి.
- అవి వేగాక దాంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ, టమోటో పేస్ట్ వేయాలి. మొత్తాన్ని బాగా కలపాలి. సరిపడినంత ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేయాలి.
- దాంట్లో ఓ లీటర్ వరకు నీరు పోసి బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడే ఉడికించుకొని మెత్తగా చేసుకున్న కందిపప్పు పేస్ట్ వేయాలి. మళ్లీ బాగా కలపాలి. మీడియం మంటపై కాసేపు మరిగించాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేయాలి. అంతే ఉసిరికాయ రసం తయారవుతుంది.
ఉసిరికాయ రసాన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇడ్లీ, వడల్లోనూ సాంబారుకు బదులుగా ఇది వేసుకున్నా సూటవుతుంది. పుల్లపుల్లగా నీటి బాగా రుచిస్తుంది.
ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలు
ఉసిరికాయల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల రిస్క్ తగ్గిస్తుంది. చలికాలంలో జలుబు, దగ్గు నుంచి ఉసిరి ఉపశమనం కలిగించగలదు. గుండె ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు కూడా ఉసిరి మేలు చేస్తుంది. ఉసిరి ఉండే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ ఓవరాల్ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా ఉసిరికాయ తోడ్పడుతుంది.