Amla Murabba Recipe: తీపి, పులుపుతో వావ్ అనిపించే ఉసిరి మురబ్బా.. చేసుకోండిలా.. రుచితో పాటు ఆరోగ్యం
Amla Murabba Recipe: ఉసిరికాయలతో చేసే మురబ్బా తియ్యగా, కాస్త పులుపుతో మంచి రుచికరంగా ఉంటుంది. చేసుకోవడం కూడా సులువే. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఈ స్వీట్ మేలు చేస్తుంది. ఈ ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉసిరికాయల్లో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం సహా మరిన్ని విటమిన్లు, మినరల్‍లను ఉసిరి కలిగి ఉంటుంది. పాపులర్ స్వీట్ మురబ్బాను ఉసిరి కాయలతోనూ చేసుకోవచ్చు. మామిడి, యాపిల్ సహా వివిధ పండ్లతో సాధారణంగా మురబ్బా చేస్తారు. అయితే, ఉసిరితో చేసే ఈ మురబ్బా రుచి విభిన్నంగా నచ్చేలా ఉంటుంది. ‘ఉసిరి మురబ్బా’ (ఆమ్లా మురబ్బా) రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఉసిరి మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉసిరి మురబ్బా చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు
- ఉసిరికాయలు - 12 పెద్దవి
- చక్కెర - 300 గ్రాములు
- నీరు
- కుంకుమ పువ్వు - 1 ఓ టీస్పూన్ (ఆప్షనల్)
- యాలకుల పొడి - ఓ టీస్పూన్
- మిరియాల పొడి - ఓ టీస్పూన్
- బ్లాక్ సాల్ట్ - ఓ టీస్పూన్
ఉసిరి మురబ్బా తయారు చేసుకునే విధానం
- ముందుగా ఉసిరికాయలను నీటితో కడిగి.. పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఓ పాత్రలో ఉసిరికాయలను వేసి మునిగే వరకు నీరు పోయాలి. పొయ్యిపై ఉసిరికాయలను ఉడికించుకోవాలి. ఉడికాక 15 నిమిషాల పాటు మంటను సిమ్‍లో ఉంచుకోవాలి.
- ఆ తర్వాత నీటిని పారబోయాలి. ఉసిరికాయలను చల్లగా కానివ్వాలి. ఆ తర్వాత అతుక్కున్న ఉసిరికాయలను వేర్వేరుగా చేయాలి. పక్కన ఉంచుకోవాలి.
- చక్కెర పాకం చేసుకోవాలి. ఇందుకోసం మందంగా ఉండే ఓ పాత్రలో చక్కెర, నీరు పోసి పోయ్యిపై ఉడికించాలి. పూర్తిగా కరిగే వరకు చేయాలి.
- చక్కెర, నీరు కలిసి సుమారు 10 నుంచి 15 నిమిషాలకు పాకంలా తయారవుతుంది. స్పూన్‍తో పాకాన్ని పైకి లేపినప్పుడు చివరి చుక్క తీగలా కిందికి పడాలి. అంటే తీగపాకంలా చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ చక్కెర పాకంలో ఉడికించిన ఉసిరికాయలు వేసుకొని, బాగా కలుపుకోవాలి.
- ఉసిరికాయలు, చక్కెర పాకం మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది కాస్త చిక్కగా ఉండాలి.
- ఉసిరి, చక్కెర పాకం మిశ్రమంలో కుంకుమ పువ్వు, యాలకులు, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి వేయాలి. బాగా కలపాలి. ఎక్కువ పులుపు కావాలంటే కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ఆ తర్వాత రాత్రంతా దాన్ని పక్కన పెట్టాలి.
- మరుసటి రోజు దీనికి మంచి రంగు వస్తుంది. మరింత చిక్కగా అవుతుంది. దీంతో ఉసిరి మురబ్బా తయారీ పూర్తవుతుంది. తియ్యగా, కాస్త పులుపుతో మంచి టేస్టీగా ఇది ఉంటుంది.
ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఈ ఉసిరి మురబ్బా నెలలపాటు నిల్వ ఉంటుంది.
ఉసిరిలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉసిరి వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. కుంకుమ పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే ఉసిరి మురబ్బా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. కావాలంటే కుంకుమ పువ్వు లేకుండా కూడా ఈ ఉసిరి మురబ్బా చేసుకోవచ్చు. ఉసిరిని తినేందుకు పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. అయితే, ఇలా మురబ్బాలా చేసి పెడితే ఎంచక్కా తినేస్తారు.