Period Delay Tablets : పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు టాబ్లెట్స్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్-all you need to know about side effects of period delay tablets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Period Delay Tablets : పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు టాబ్లెట్స్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్

Period Delay Tablets : పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు టాబ్లెట్స్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్

HT Telugu Desk HT Telugu

Side Effects Of Period Delay Tablets : చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు టాబ్లెట్స్ వాడుతుంటారు. తాత్కాలికంగా దీని నుంచి ఉపశమనం కోసం చూస్తారు. కానీ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ (unsplash)

ఇంట్లో పూజ ఉంది లేదా ప్రయాణంలో ఉన్నాం.. మరేదైనా కారణాల వల్ల అమ్మాయిలు కొన్నిసార్లు రుతుస్రావం తేదీని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తారు. మనలో చాలా మంది పూజ కార్యక్రమాలు ఉన్నప్పుడు రుతుక్రమాన్ని వాయిదా వేయడం చూస్తుంటాం. ఎందుకంటే పీరియడ్స్ ఉంటే పూజ కార్యక్రమంలో పాల్గొనలేరు. కొందరు రుతుక్రమాన్ని వారాలపాటు కూడా వాయిదా వేస్తారు. ఈ విధంగా పీరియడ్స్ వాయిదా వేయడానికి టాబ్లెట్ తీసుకుంటారు. కానీ ఇలా వేసుకునే మాత్రల వల్ల శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయి.

ఈ మాత్రలు తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లలో మార్పు వస్తుంది. దీని వల్ల మొటిమల సమస్య వస్తుంది. ఇలాంటి ఫలితాలు అనేక ఆరోగ్య సమస్యలకు సూచన కూడా కావచ్చు. పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. ఈ రకమైన మాత్రలు తీసుకున్నప్పుడు చాలా మంది మానసిక కల్లోలం అనుభవిస్తారు. కోపం, విసుగు వంటి భావాలు తలెత్తుతాయి. కొంతమందికి నిరాశ కూడా ఉంటుంది.

పీరియడ్ డిలే పిల్ హార్మోన్లపై ప్రభావం వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుంది. రొమ్ములలో నొప్పి కూడా ఉంటుంది. రొమ్ములు బిగుతుగా అనిపిస్తాయి. చాలా బాధాకరంగా ఉండవచ్చు. పీరియడ్స్ వచ్చినప్పుడు స్తనాల్లో కొద్దిగా నొప్పి రావడం సహజమే కానీ ఒత్తిడి కారణంగా పీరియడ్స్ వాయిదా పడినప్పుడు నొప్పి పెరుగుతుంది.

ఈ రకమైన మాత్రలు వేసుకున్నప్పుడు కొందరికి ఆయాసం, వాంతులు వస్తాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రకమైన మాత్రలు కొన్నిసార్లు రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. ఇది పక్షవాతం కూడా కలిగిస్తుంది.

ఈ దుష్ప్రభావాలను ఎలా తగ్గించాలి?

టాబ్లెట్ మోతాదు సరిగ్గా తీసుకోవాలి. అధిక మోతాదు తీసుకోవద్దు. ఈ రకమైన మాత్రలు మీరే వేసుకోవడం కంటే వైద్యుల సలహా తీసుకోండి. ఈ రకమైన మాత్రలు వేసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఆహారం తర్వాత మాత్ర వేసుకోండి. మద్యం సేవించకూడదు.

చివరగా చెప్పేది ఏంటంటే.. మీ పీరియడ్స్ ఆలస్యం కావడానికి మాత్రలు తీసుకోకపోవడమే మంచిది. ఇది చాలా దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతికి వ్యతిరేకంగా చేసే చర్య. ఇది కచ్చితంగా శరీరానికి మంచిది కాదు. ప్రకృతి ఇచ్చిన విధంగానే నడుచుకోవడం బెటర్. లేదంటే.. మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది.. అదే పనిగా పీరియడ్ రాకుండా టాబ్లెట్స్ వాడుతుంటారు. పిల్లలు కావాలనుకున్నప్పుడు కూడా.. వీటి ప్రభావం ఉంటుంది చెబుతారు. తాత్కాలిక ఉపశమనం కోసం చూసుకుంటే.. ఇలాంటి చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. పీరియడ్స్ సరిగా ఉంటే.. మానసికంగా, శారీరకంగానూ చక్కగా ఉంటారు.