Alcohol | ఆల్కహాల్‌తో వచ్చే మానసిక సమస్యలు ఇవే..-alcohol dependence syndrome and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Alcohol Dependence Syndrome And Treatment

Alcohol | ఆల్కహాల్‌తో వచ్చే మానసిక సమస్యలు ఇవే..

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 03:01 PM IST

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఆయా మత్తుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అవి లేకుండా ఉండలేకపోవడంతో క్రమంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

ప్రతీకాత్మక చిత్రం: మద్యానికి బానిసలైతే జీవితం చిందర వందర
ప్రతీకాత్మక చిత్రం: మద్యానికి బానిసలైతే జీవితం చిందర వందర (unsplash)

Alcohol: వాస్తవానికి ఆల్కహాల్‌కు బానిస కావడానికి మానసిక కారణాలు కూడా ఉంటాయి. హీనమైన స్వభావం కలిగి ఉండడం, ఆత్మ గౌరవం లోపించడం, ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోవడం, ఒంటరితనం, పరిస్థితుల నుంచి తప్పించుకోవాలనుకోవడం, లైంగికపరమైన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యల నుంచి ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలు ఆల్కహాల్, మత్తుపదార్థాలు తీసుకునేందుకు దారితీస్తాయి.

డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్, సోషల్ ఫోబియా, పర్సనాలిటీ డిజార్డర్స్, యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ వంటి మానసిక రుగ్మతలు కూడా డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తాయి.

ఇక సామాజికపరమైన అంశాలు కూడా ఆల్కహాల్, మత్తుపదార్థాల వినియోగానికి దారితీస్తాయి. మతసంబంధమైన, ఆచార సంబంధమైన కారణాలు, స్నేహితుల ప్రోత్సాహం, వారి ఒత్తిడి, నగరాల్లో నివసించడం, జల్సాలు, నిరుద్యోగ సమస్యలు, ప్రచార, ప్రసార సాధనాలు, సొసైటీలో కలవలేకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన కొన్ని వృత్తి జీవితాలు ఆల్కహాల్ వినియోగానికి దారితీస్తాయి.

ఆల్కహాల్‌కు బానిసలైనట్టు ఎలా తెలుసుకోవాలి?

ఆల్కహాల్ తీసుకోవడం క్రమంగా పెరిగిపోతే అవి లేకుండా ఉండలేరు. మతిమరుపు వస్తుంది. ఏకాగ్రత ఉండదు. కష్టాలు, ఒత్తిళ్లు తట్టుకోలేరు. కోపం, ఉద్రేకాలకు లోనవుతారు.

దేనిపైనా శ్రద్ధ లేకపోవడం, కుటుంబంపైనా శ్రద్ధ లేకపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం, నిలకడ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శారీరక సమస్యలు ఏర్పడుతాయి. గ్యాస్ట్రైటిస్, లివర్ సిరోసిస్, పెరిఫెరల్ న్యూరోపతి, హెపటైటిస్, కార్డియోమయోపతి, గైనకోమాస్ట్రియా, నపుంసకత్వం వంటి శారీరక సమస్యలు ఏర్పడుతాయి.

మద్యానికి బానిస అయితే ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్, డ్రగ్ ఎడిక్షన్ అనే రెండు వ్యాధుల బారిన పడతారు.

ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్:

కొద్దిపాటి ఉత్సాహం వచ్చినా, కొద్దిపాటి ఒత్తిడికి లోనైనా వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం మొదలవుతుంది. వణుకు ప్రారంభమవుతుంది. మాటలో, నడకలో తడబాటు ఉంటుంది. శారీరక విశ్రాంతి ఉండదు. నిద్ర లేమి ఏర్పడుతుంది. ఆకలి చచ్చిపోతుంది. మానసిక బ్రాంతులకు లోనవుతారు. 

అంతేకాకుండా మతిమరుపు ఏర్పడుతుంది. మత్తులో ఇతరులను దూషించడం, తప్పుడు మార్గాలను అనుసరించడం, స్పృహ కోల్పోవడం, గుండె దడ పెరగడం, డీహైడ్రేషన్‌కు గురికావడం సంభవిస్తుంది. మద్యానికి బానిసై విచక్షణ కోల్పోతారు. ఈ సమయంలో తమకు తెలియకుండానే అనేక సమస్యలు కొనితెచ్చుకుంటారు.

ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ పేషెంట్లకు ప్రత్యేక థెరపీలో భాగంగా మందులు ఇవ్వడం ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చు. ఇక మానసిక చికిత్సా విధానం, బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా కూడా మాన్పించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్