Ajwain Paratha Recipe: వాముతో టేస్టీగా పరాఠా.. కడుపుకు హాయిగా.. ఎలా చేసుకోవాలంటే..
Ajwain Paratha Recipe: వాముతో చేసే పరాఠా టేస్ట్ డిఫరెంట్‍గా ఉంటుంది. మంచి వాసనతో పాటు రుచి కూడా అదిరిపోతుంది. కడుపు కూడా లైట్‍గా ఉంటుంది. జీర్ణానికి మంచి చేస్తుంది. ఈ వాము పరాఠా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
పరాఠాల్లో చాలా వెరైటీలు ఉంటాయి. వివిధ రకాల స్టఫింగ్‍లతో, ఫ్లేవర్లతో పరాఠాలను తయారు చేస్తుంటారు. అలాగే, వాము కలిపి కూడా పరాఠాలు చేయవచ్చు. ఎలాంటి స్టఫింగ్ లేకుండా కడుపుకు ఈ పరాఠా సుఖంగా అనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ‘వాము పరాఠా’ ఎలా తయారు చేసుకోవాలో వివరంగా ఇక్కడ చూడండి.
వాము పరాఠాకు కావాల్సిన పదార్థాలు
- 2 కప్‍ల గోధుమ పిండి
- ఓ టేబుల్‍స్పూన్ వాము
- తగినంత ఉప్పు
- 3 టేబుల్ స్పూన్‍ల నూనె (పిండి కోసం, కాల్చుకునేందుకు వేరుగా)
- తగినంత నీరు
వాము పరాఠా తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి, వాము, తగినంత ఉప్పు, నూనె వేసుకోవాలి. వాటిని బాగా కలపాలి. వేళ్లతో మొత్తం మిక్స్ చేయాలి.
- ఆ తర్వాత ఆ పిండిలో నీటిని ఒకేసారి కాకుండా కాస్తకాస్త వేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు పిండిని మృధువుగా వత్తుతూ కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు ఒత్తిడి చేస్తూ పిండిని కలపాలి.
- కలుపుకున్న పిండి ముద్దపై కాస్త నూనె రాసి.. దానిపై ఓ గిన్నె మూయాలి. 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- 20 నిమిషాల తర్వాత పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఆ ఉండలను చపాతీ కర్రతో కాస్త వత్తుకోవాలి. దానిపై నూనె లేదా నెయ్యి వేయాలి. వత్తుకున్న చపాతీని అన్ని వైపు నుంచి మధ్యలోకి మడిచి.. చిన్న స్క్వేర్‌లా చేయాలి. మళ్లీ దాన్ని పెద్దగా పెద్ద చపాతీ సైజులో వత్తుకోవాలి. కొన్ని పరాఠాలను వత్తుకున్నాక కాల్చుకోవాలి.
- పెనం వేడెక్కకా వత్తుకున్న పరాఠాను దానిపై వేయాలి. 30 సెకన్ల పాటు ఓ సైడ్ కాల్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరోవైపునకు తిప్పి కాస్త నూనె వేయాలి. 30 సెకన్ల తర్వాత మళ్లీ తిపి మరోవైపు కూడా నూనె వేయాలి.
- పరాఠాను రెండు వైపులా కాల్చే టైమ్‍లో కాస్త పొంగుతుంది. రెండు వైపులా గోల్డెన్ కలర్‌లో కాల్చుకున్నాక పరాఠాను ప్లేట్‍లోకి తీసుకోవాలి.
కర్రీలు, రైతా, పచ్చళ్లతో ఈ వాము పరాఠాను తినొచ్చు. పప్పుతోనూ బాగుంటుంది. ఈ పరాఠాలను ఏ పూటైనా తినొచ్చు. వాము వేయడంతో రుచి, వాసన బాగుంటాయి.
జీర్ణానికి మంచిది
వాము వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. గ్యాస్, కడుపులో మంట లాంటి సమస్యలను తగ్గించగలదు. అలాంటి వాముతో తయారు చేసే ఈ పరాఠాలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి తింటే కడుపులో హాయిగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా వాము మేలు చేస్తుంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా తగ్గేందుకు తోడ్పడుతుంది.