వయస్సు శరీరానికే మెదడుకు కాదు, ఈ సింపుల్ చిట్కాలతో 50 ఏళ్లు దాటినా కూడా చురుకైన మెదడు మీ సొంతం!-age is for the body but these simple tips keep your brain active even beyond 50 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వయస్సు శరీరానికే మెదడుకు కాదు, ఈ సింపుల్ చిట్కాలతో 50 ఏళ్లు దాటినా కూడా చురుకైన మెదడు మీ సొంతం!

వయస్సు శరీరానికే మెదడుకు కాదు, ఈ సింపుల్ చిట్కాలతో 50 ఏళ్లు దాటినా కూడా చురుకైన మెదడు మీ సొంతం!

Ramya Sri Marka HT Telugu

50 ఏళ్లు దాటాయా? ఆలోచనలతో అలసిపోతున్నారా? ఇన్నేళ్ల అనుభవానికి, జ్ఞానానికి చురుకుదనం జోడిస్తే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. వయస్సు పెరిగే కొద్దీ శరీరం అలసిపోవచ్చు. కానీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ మెదడు మాత్రం ఎప్పటికీ యవ్వనంగా, చురుగ్గా పనిచేస్తుంది.

ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చిత్రం

మీ మెదడు చురుగ్గా ఉంచుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు ఇవే. వయసు పెరిగే కొద్దీ, మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలో మార్పులు రావడం సహజం. అయితే, మెదడు పనితీరు తగ్గడాన్ని అడ్డుకోవచ్చు. కొన్ని అలవాట్లను పాటిస్తే, మీ మెదడును చురుగ్గా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన చిట్కాలు కేవలం మీ మెదడును చురుగ్గా ఉంచడానికే కాదు, ఒక ఆహ్లాదకరమైన ప్రశాంతతను కూడా అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దూరం చేసి, మీ ఆలోచనలను మరింత స్పష్టంగా, వేగంగా ముందుకు నడిపిస్తాయి. మరి 50 ఏళ్ల వయస్సులో కూడా మీ మెదడును ఒక యువకుడిలా చురుగ్గా ఉంచే ఆ సులువైన మార్గాలేంటో తెలుసుకుందామా?

కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి

జీవితాంతం నేర్చుకునే స్వభావం ఉండటం వలన మీ నాడీ మార్గాలు బలపడతాయి. మీరు కొత్త భాష నేర్చుకున్నా, కొత్త వాయిద్యం వాయించడం నేర్చుకున్నా, కొత్త అలవాటు అలవరుచుకున్నా, ఈ కార్యకలాపాలు మీ మెదడుకు సవాలు విసురుతాయి. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

వ్యాయామం

వ్యాయామం రక్త ప్రసరణను పెంచుతుంది. మెదడుకు రక్తప్రసరణ పెరిగినప్పుడు, అది కొత్త మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నడక, యోగా, ఈత లేదా చిన్న వ్యాయామాలు కూడా మీ మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

మెదడుకు మేలు చేసే ఆహారాలు తీసుకోండి

ఆకుకూరలు, బెర్రీలు, వాల్‌నట్స్, ఒమెగా 3 కలిగిన అవిసె గింజలు లేదా చియా గింజలు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి. ఇది మీ జ్ఞాపకశక్తికి సహాయపడుతుంది. మెదడులో వాపును తగ్గిస్తుంది.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి

పూర్తి ప్రశాంతమైన నిద్ర మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మెదడులోని విష పదార్థాలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు గాఢంగా నిద్రపోయేందుకు ప్రయత్నించండి. ఇది మీ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ధ్యానం

మెదడు ఆరోగ్యానికి ధ్యానం చాలా ముఖ్యం. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది కూడా. మీ మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వలన మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి.

చదవడం

మీరు ప్రతిరోజూ చదవడం అనేది అలవాటుగా మార్చుకోండి. ఇది మీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మీకు కొత్త పదాలను నేర్పుతుంది. మీ ఊహాశక్తిని వృద్ధి చేస్తుంది. కాబట్టి, మీరు మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు వాటిని ఉపయోగించండి. మీరు ఏమి చదువుతారో అది మీ సంభాషణను మెరుగుపరుస్తుంది. మీ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

చక్కెరతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడాన్ని మానుకోవాలి. ఇది మీ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. మీ మెదడును రక్షించుకోవడానికి శుద్ధి చేసిన చక్కెర ఆహారాలను తినకుండా ఉండండి.

సామాజికంగా క్రియాశీలంగా ఉండండి

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు సామాజిక సమూహాలతో అర్థవంతమైన సంబంధాలను కలిగి ఉండండి. ఇది మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడు సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. సంభాషణలు, చర్చలు మీ మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

చెవులు, కళ్లు జర భద్రం

దృష్టి, వినికిడి శక్తి మీ మెదడు ఆరోగ్యంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి కళ్ళు, చెవులను జాగ్రత్తగా చూసుకోండి. వీటిని మీరు సరిచేసుకోవడం వలన మీ మెదడు ఆరోగ్యానికి మంచిది.

ఈ సులువైన అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకుంటే, మీ మెదడును కేవలం చురుగ్గా ఉంచుకోవడమే కాకుండా, జీవితాన్ని మరింత ఉత్సాహంగా ఆస్వాదించగలరు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే, మీ మెదడు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.