Receding hairline: నుదురు దగ్గర జుట్టు ఊడటం మొదలయ్యిందా.. వెంటనే ఈ తప్పులు చేసేయకండి..
Receding hairline: నుదురు దగ్గర నుంచి జుట్టు పలచబడటం, మాడు కనిపించడం లాంటి సమస్య ఉందా. అయితే కొన్ని చేయకూడని తప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.
తలపై జుట్టు పలచబడటం, ముఖ్యంగా ముందు భాగంలో మాడు కనిపించడం. క్రమంగా పక్కలకు ఊడటం కనిపిస్తే దాన్ని రిసీడింగ్ హెయిర్ లైన్ అంటారు. ఈ సమస్య ఎక్కువైతే తగ్గించుకోవడం కాస్త కష్టమే. సమస్య మొదట్లో ఉన్నప్పుడు తెలీకుండా చేసే తప్పుల వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. అలా చేయకూడని తప్పులేంటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.
ఈ తప్పులు చేయకండి:
- సమస్య ఎందుకు మొదలైందో అసలు కారణం తెల్సుకోకుండా రకరకాల ట్రీట్మెంట్లు మొదలు పెట్టడం మంచిది కాదు. కుటుంబ చరిత్ర, జెనటిక్స్, తీవ్రమైన ఒత్తిడి, పోషకలేమి ఉన్న ఆహారం, నిద్ర లేమి, ఊబకాయం, మానసిక ఆందోళనలు.. ఇలా అసలు కారణమేంటో కనుక్కోండి.
- జుట్టు హెయిర్ లైన్ దగ్గర ఊడటం మొదలైనప్పుడే కాస్త మార్పు తెలుస్తుంది. ముందు మాడు కనిపించడం, జుట్టు పలచబడటం, నుదురు ఎక్కువగా కనిపించడం.. ఇలాంటివి కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
- సమస్య తెలుసుకోకుండా ఇంట్లోనే చిట్కాలు పాటించకూడదు. వైద్యుల్ని సంప్రదించడం తప్పనిసరి.
- సమస్య కనిపించగానే భయపడి.. గాఢత, రసాయనాలు ఎక్కువున్న ఉత్పత్తులు, షాంపూలు, కండిషనర్లు వాడకూడదు. అలాగే మరీ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయొద్దు. దానివల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
- వేడితో జుట్టును స్టైలింగ్ చేయడం ఆపేయాలి. కర్లర్లు, బ్లో డ్రయర్ల లాంటివి ఎక్కువగా వాడొద్దు. ఎక్కువగా హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు వాడొద్దు.
- ఎక్కువసార్లు జుట్టు దువ్వుకోకూడదు. ముఖ్యంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు బలహీన పడుతుంది.
- స్మోకింగ్ అలవాటుంటే వెంటనే మానేయాలి.
- కాస్త బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్ లాంటి వాటి జోలికి పోకూడదు. జుట్టు గట్టిగా వెనక్కు లాగి బన్ లాగా కట్టడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.
- ఐరన్, జింక్, విటమిన్ డి, బయోటిన్ లాంటివి ఉన్న ఆహారం తీసుకోవాలి.
- మాడు శుభ్రంగా ఉంచుకోవాలి. చుండ్రు లాంటి సమస్యలుంటే ముందు అవి తగ్గించుకోవాలి.
- కలరింగ్, రిలాక్సింగ్ లాంటి హెయిర్ కెమికల్ ట్రీట్మెంట్లు జుట్టును దెబ్బతీస్తాయి. ఏవైనా ఉత్పత్తులు వాడేముందు డర్మటాలజిస్టును సంప్రదించడం ఉత్తమం.
- ఎప్పుడూ క్యాప్, హెల్మెట్, హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే హెయిర్ లైన్ దగ్గర జుట్టు ఊడుతుంది. జుట్టుకు గాలి తగలనివ్వండి. కాస్త వదులుగా ఉన్న వాటిని ఎంచుకోండి.
ఈ జాగ్రత్తలు పాటించండి:
- పోషకాహారం:
విటమిన్లు, మినరళ్లు, ప్రొటీన్లున్న ఆహారం జుట్టు ఎదుగుదలకు అవసరం. చేపలు, గుడ్లు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోండి. శాకాహారి అయితే ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు తినండి.
2. మాడు శుభ్రత:
తక్కువ గాఢత ఉన్న షాంపూతో మాడును శుభ్ర పరచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయొద్దు. జుట్టును రుద్దద్దు. దానవల్ల జుట్టులో ఉండే సహజ నూనెలు కోల్పోతుంది. గది ఉష్ణోగ్రత దగ్గర ఉండే నీళ్లతోనే స్నానం చేయండి.
3. హెయిర్ కేర్ సప్లిమెంట్లు:
బయోటిన్, విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి అవసరం. మీకివి నప్పితే వాటిని తీసుకోవచ్చు. ఇవి లోపల నుంచి జుట్టును బలంగా ఉంచుతాయి. ముందుగా వైద్యుల్ని సంప్రదించి సలహా తీసుకోండి.
4. ఒత్తిడి:
దీర్ఘకాలంగా ఎదుర్కొనే ఒత్తిడి వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అందుకే ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు, ధ్యానం, మంచి అలవాట్లు చేసుకోవడం మంచిది. ఇవి జుట్టుతో పాటూ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.