Achari chicken: చికెన్ కర్రీని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా ఆచారి చికెన్ కర్రీ ప్రయత్నించండి. హిందీలో అంటే ఊరగాయ పచ్చడిని అచార్ అంటారు. అదే అచారీ అయింది. ఈ చికెన్ కూరను చూస్తే చికెన్ ఊరగాయలా అనిపిస్తుంది. అందుకే దీనికి ఆచారి చికెన్ అని పేరు పెట్టారు. దీన్ని చేయడం చాలా సులువు. చూస్తేనే నోరూరిపోతుంది. దీన్ని అన్నంతో, చపాతీతో తినవచ్చు.
చికెన్ - అరకిలో
టమాటాలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
ఇంగువ - చిటికెడు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఆవనూనె - రెండు స్పూన్లు
పెరుగు - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఎండుమిర్చి - నాలుగు
ఆవాలు - పావు స్పూను
జీలకర్ర - రెండు స్పూన్లు
మెంతులు - పావు స్పూను
సోంపు - ఒక స్పూను
ధనియాలు - రెండు స్పూన్లు
1. ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం మసాలా పొడిని రెడీ చేసుకోవాలి.
2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఎండు మిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు వేసి వేయించాలి.
3. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.
5. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువను కూడా వేయించుకోవాలి.
7. సన్నగా తరిగిన టమోటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇవన్నీ బాగా వేగాక ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి.
9. ఇది ఇగురులాగా అయ్యాక చికెన్ ముక్కలను, గిలకొట్టిన పెరుగును వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
10. ఇది ఎర్రగా ఊరగాయలాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
11. ఇగురులాగా అయ్యాక పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
12. అంతే ఆచారి చికెన్ రెడీ అయిపోయినట్టే. దీన్ని చూస్తుంటేనే నోరూరి పోతుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్టీగా ఉంటుంది.
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ రెసిపీలు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ రెసిపీల కన్నా ఒకసారి కొత్తగా ప్రయత్నించండి. ఆచారి చికెన్ అంటే చికెన్ ఊరగాయ అనుకోవచ్చు. ఈ కూరను నార్త్ ఇండియాలో ఎక్కువగా వండుతూ ఉంటారు. ఒకసారి తిన్నారంటే మీరు కూడా దీనికి అభిమాని అయిపోతారు.