భగవద్గీత ప్రకారం ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండడం కష్టం, వాటిని వెంటనే వదిలేయండి-according to the bhagavad gita it is difficult for a person with these 3 characteristics to be happy in life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  భగవద్గీత ప్రకారం ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండడం కష్టం, వాటిని వెంటనే వదిలేయండి

భగవద్గీత ప్రకారం ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండడం కష్టం, వాటిని వెంటనే వదిలేయండి

Haritha Chappa HT Telugu

భారతీయ ఇతిహాసాలలో భగవద్గీత ముఖ్యమైనది. ప్రజలు పవిత్రంగా, గౌరవనీయంగా చూసే పురాణాలలో ఇది కూడా ఒకటి. భగవద్గీత మన జీవితానికి కావలసిన ఎన్నో లక్షణాలను వివరించింది. అలాగే ఉండకూడని గుణాలనూ చెప్పింది.

భగవద్గీత

మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో పుట్టిన ఇతిహాసమే భగవద్గీత. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య సంభాషణ భగవద్గీత అనే పుస్తకంగా మారింది. గీతలో కేవలం యుద్ధ కళా, యుద్ధ సవాళ్లే కాదు జీవితానికి కావలసిన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉండకూడని గుణాలు ఏమిటో కూడా భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పాడు.

భగవద్గీత... వేల ఏళ్ల సంవత్సరాల క్రితం నాటిది కావచ్చు. కానీ నేటి జీవితానికి కావాల్సిన జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాల రూపంలో పంచుతోంది. వాటిలో ఎన్నో ముఖ్యమైన జీవిత పాఠాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అతనిలో ఎలాంటి గుణాలు లేకుండా ఉండాలో ఈరోజు తెలుసుకోండి.

ఈ మూడు లక్షణాలు

భగవద్గీతలో ఒక మనిషి శాశ్వత నరకానికి, వేదనకు దారి తీసే అంశాలను ప్రస్తావించారు. ఒక శ్లోకంలో కృష్ణుడు కోపం, కామం, దురాశ... అనే మూడు లక్షణాలు ఒక వ్యక్తి జీవితాన్ని అధోగతి పాలు చేస్తాయని చెప్పారు. వారికున్న ఈ చెడు గుణాలు జీవితానికి ఆటంకం కలిగించడంతో పాటు వారికి జీవితంలో సుఖం లేకుండా చేస్తాయని చెప్పారు.

కోపం వల్ల

మీకున్న కోపం స్నేహితులను, బంధువులను పూర్తిగా దూరం చేస్తుంది. ఒంటరి జీవితానికి దగ్గర చేస్తుంది. కోపం అనేది ఒక మనిషికి ఎంతో కీడు చేస్తుంది. కోపిష్టికి సాయంగా ఎవరూ రారు. కోపిష్టి ఇంటిపై కాకి కూడా వాలదని అంటారు.

విపరీతమైన కోరికలు

ఇక తర్వాతది కామం. మితిమీరినకోరికలు ఒక మనిషిని అదుపు తప్పేలా చేస్తాయి. గౌరవప్రదమైన జీవితం నుంచి అధోగతికి లాగుతాయి. కామ కోరికలు ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా పేదవాడిగా మారుస్తాయి. కాబట్టి అధికంగా ఉన్న కామ వాంఛలను తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం.

దురాశ వల్ల

ఒక మనిషికి దురాశ ఉంటే ఎంత సంపాదించినా ఆత్మసంతృప్తి ఉండదు. అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్ర పోలేడు. దురాశ అనేది వ్యక్తిగత, సామాజిక జీవితం రెండింటికీ హానిచేస్తుంది. దురాశ ఉన్నవారు ఇతరుల పట్ల నిర్లక్ష్యంగా, మోసపూరితంగా ఉంటారు. ఇది వారి వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తుంది. సమాజంలో గొడవలకు కారణం అవుతుంది. ఇతరులకు అన్యాయం చేసే పరిస్థితులకు దిగజారుస్తుంది.

దురాశ ఉన్నవారు తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తారు. మోసం చేయడానికి వెనుకాడరు. దీనివల్ల వ్యక్తిగత అనుబంధాలు దెబ్బతింటాయి. మోసం చేసేవారితో ఎవరూ కలిసి ఉండేందుకు ఇష్టపడరు. దురాశ ఉన్నవారికి డబ్బు, ఆస్తులు, హోదా పట్ల మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటారు. వారికి ఎలాంటి నీతి, న్యాయం ఉండవు. అలాంటి వ్యక్తి జీవించినా.. మరణించినా ఒక్కటేనని భగవద్గీత చెబుతోంది.

శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం కోపం, కామం, దురాశ ఉన్న వ్యక్తి తనకు తానే నరకానికి దారులు వేసుకున్నట్టే. అతడు ప్రశాంతమైన జీవితాన్ని గడపలేడు. తన కుటుంబాన్ని కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంచలేడు. నిత్యం సమస్యలు వారి వెంట పడుతూనే ఉంటాయి. కాబట్టి మీలో కూడా కోపం, దురాశ, కోరికలు ఉంటే వెంటనే తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.