AC side effects: రోజంతా ఏసీలో ఉంటే.. వచ్చే తంటాలివే..
AC side effects: రోజంతా ఏసీలో ఉండటం వల్ల చాలా నష్టాలున్నాయి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విషయాలేంటో తప్పక తెలుసుకోండి.
ఈ మధ్య.. కాలంతో సంబంధం లేకుండా కొంత మంది రోజంతా ఏసీల్లోనే ఉంటున్నారు. ఇంట్లో, కారులో, ఆఫీసులో ఇలా రోజంతా దాదాపుగా ఏసీలోనే గడపడం అలవాటయిపోయింది. నిజానికి ఈ కృత్రిమ చల్లదనానికి అలవాటు పడి సాధారణ వాతావరణంలో ఇమడలేనంతగా మారిపోతున్నారు. ఇది మనిషి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇలా ఎక్కువ సమయం ఏసీలోనే గడిపే వారిలో కింది అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తలనొప్పులు, డీ హైడ్రేషన్ :
ఎక్కువగా ఏసీల్లో గడిపే వారిలో వచ్చే అతి సాధారణమైన సమస్య తలనొప్పి, డీహైఐడ్రేషన్‌లు. ఏసీ గదిలో ఉండే నీటి ఆవిరి అంతటినీ లాక్కుంటుంది. దీంతో అక్కడ హ్యుమిడిటీ అనేదే లేకుండా పోతుంది. దీంతో శరీరం డీ హైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిందో అప్పుడు నరాల నుంచి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అంటే మెదడుకు అందే ఆక్సిజన్ తక్కువైపోతుంది. దీంతో తలనొప్పులు, తలలో నరాలు లాగినట్లుగా అవ్వడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్‌లాంటి వాటికి దారి తీస్తుంది.
బద్ధకం:
చుట్టూ ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల అలా ఉన్న మనుషుల్లో జీవ క్రియ మందగించి వారు కూడా బద్ధకంగా తయారవుతున్నారు. చురుకుదనం తగ్గిపోతోంది. దీంతో వీరు ఎప్పుడూ మందకొడిగా ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
పొడి చర్మం:
ఎక్కువగా ఏసీలోనే ఉండే వారిలో చర్మం పొడిబారిపోతుంది. దీని వల్ల చర్మంపై దురదలు రావడం, చర్మం పొట్లుపోయినట్లుగా ఉండటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇతర చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎక్కువగా నీటిని తాగడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి కొంత వరకు బయటపడవచ్చు.
ఆస్తమా, అలర్జీలు:
ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే గాలి వల్ల మైక్రోబయల్ అలర్జీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వీటి వల్లనే అలర్జీలు, ఆస్తమా, టాన్సిల్స్, సైనసైటిస్ లాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి. గొంతు పొడిబారుతుంది. ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోస వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయిట. బయట సాధారణ వాతావరణంలో ఉండాలని, కిటికీలు, డోర్‌లు తెరిచి పెట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాలని ఆస్ట్రేలియన్ అధ్యయనాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ మించి బయట వాతావరణంలో కొద్దిసేపు కూడా ఉండలేనంతలా అలవాటుపడిపోతాం. ప్రకృతిని కూడా సరిగ్గా ఆస్వాదించలేం. కాబట్టి ఏసీ వాడకాన్ని అవసరానికి పరిమితం చేయడం మంచిది.