రక్తంతో తడిసిన ఆ గ్లౌజులను అమ్మితే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, ఆ గ్లౌజులు ఎందుకంత ప్రత్యేకం?-abraham lincolns blood stained gloves were sold for millions of rupees why are those gloves so special ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రక్తంతో తడిసిన ఆ గ్లౌజులను అమ్మితే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, ఆ గ్లౌజులు ఎందుకంత ప్రత్యేకం?

రక్తంతో తడిసిన ఆ గ్లౌజులను అమ్మితే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు, ఆ గ్లౌజులు ఎందుకంత ప్రత్యేకం?

Haritha Chappa HT Telugu

ఎంతోమంది గొప్ప వ్యక్తులు వాడిన వస్తువులు అప్పుడప్పుడు అమ్మకానికి పెడుతూ ఉంటారు. వేలంలో ఎంతో మంది వాటిని కొనుక్కుంటారు. అలా తాజాగా అబ్రహం లింకన్ వాడిన గ్లౌజును అమ్మకానికి పెడితే కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

రక్తంతో తడిసిన గ్లవుజులు

రక్తం అంటేనే ఎంతోమంది భయపడతారు. ఇక రక్తంతో తడిసిన గ్లౌజులు.. అవి కూడా వందేళ్ల క్రితం నాటివి. వాటిని ఎవరు కొనుక్కుంటారు? అయినా సరే వాటిని వేలం వేశారు. ఊహించని రీతిలో అవి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అవి సాదాసీదా చేతి తొడుగులు కావు. ఎంతో ప్రత్యేకమైనవి... అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఉపయోగించిన గ్లౌజులు అవి.

హత్యకు సాక్ష్యాలు

బానిసత్వాన్ని నిర్మూలించేందుకు అబ్రహం లింకన్ ఎంతో కష్టపడ్డాడని చెప్పుకుంటారు. అతడిని గొప్ప నాయకుడుగా వర్ణిస్తారు. అతడిని ఒకరోజు రాత్రి కాల్చి చంపారు దుండగులు. అలా చంపినప్పుడు అతడి పాకెట్లో ఈ గ్లౌజులు ఉన్నాయి. అతని రక్తంతోనే ఆ చేతి తొడుగులు తడిసిపోయాయి. అందుకే ఇవి చారిత్రాత్మక వస్తువుల్లో భాగంగా మారిపోయాయి. ఇన్నాళ్లు వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఇప్పుడు వాటిని వేలం వేస్తే ఏకంగా కోట్ల రూపాయలనిచ్చి అతని అభిమానులు కొనుక్కున్నారు.

ఎంతకి కొనుక్కున్నారు?

అమెరికాలోని చికాగోలో ఈ వేలం జరిగింది. ఆ వేలంలో అబ్రహం లింకన్ వాడిన 144 వస్తువులను ఉంచారు. 1865 ఏప్రిల్ 14న వాషింగ్టన్ లోని ఒక థియేటర్లో అబ్రహాంను కాల్చి చంపారు. ఆ సమయంలో అతని దగ్గర ఉన్న వస్తువులను తీసి భద్రపరిచారు. అలా భద్రపరిచిన వాటిలో గ్లౌజులు కూడా ఒకటి. వీటిని వేలం వేస్తే పన్నెండున్నర కోట్ల రూపాయలకు ఒక వ్యక్తి కొనుక్కున్నారు.

హంతకుల ఫోటోలు కూడా

లింకన్ ను కాల్చి చంపినప్పుడు అతని వద్ద ఒక చేతి రుమాలు కూడా ఉంది. దాన్ని కూడా వేలం వేస్తే హాట్ కేకులా అమ్ముడుపోయింది. లింకన్ చేతిరాతతో ఉన్న ఒక ప్రాచీన పుస్తకం కూడా దొరికింది. దాన్ని కూడా కొన్ని లక్షల రూపాయలకు అభిమానులు కొనుక్కున్నారు. లింకన్ హత్య చేసిన ముగ్గురు వ్యక్తుల చిత్రాలతో ఉన్న వాంటెడ్ పోస్టర్ కూడా ఈ వేలంలో ప్రదర్శించారు. దాన్ని కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు.

అబ్రహాం లింకన్
అబ్రహాం లింకన్

అబ్రహం లింకన్ వంటి చారిత్రాత్మక గొప్ప వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఇలా ఎందుకు అమ్ముతున్నారని ఎంతోమందికి సందేహం రావచ్చు. దీని వెనక అసలు ఉద్దేశం.. అప్పులు తీర్చుకోవడమే. అబ్రహం లింకన్ ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్ 2007లో కాలిఫోర్నియాలో 1540 వస్తువులను కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆ వస్తువులను కొనేందుకు ఎక్కువ మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ అప్పు ఈ ఫౌండేషన్ వారు తీర్చలేక పోయారు. దీంతో అబ్రహం లింకనుకు చెందిన వస్తువులనే అమ్మి ఆ ఫౌండేషన్ పేరు మీద ఉన్న అప్పులను తీరుస్తున్నారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.