Rare Cancer: అరుదైన క్యాన్సర్, ఇది వస్తే వేగంగా వ్యాపించేస్తుంది, ముందుగానే ప్రాణాలు తీస్తుంది
Rare Cancer: క్యాన్సర్ ఇప్పుడు ఎవరికి ఎప్పుడు వస్తుందో అన్న భయంతో ఎంతో మంది జీవిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్లలో అరుదైన క్యాన్సర్ ఒకటుంది. అదే సార్కోమా. ఇది త్వరగా శరీరంలో వ్యాపించి ప్రాణాలు తీసేస్తుంది. ఈ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
సార్కోమా… అనేది ఒక అరుదైన క్యాన్సర్. ఈ క్యాన్సర్ సోకిందని నిర్ధారించడం చాలా కష్టం. ఈ క్యాన్సర్ సోకితే మాత్రం చాలా వేగంగా శరీరంలో వ్యాప్తి చెందుతుంది. మీకు ఊపిరితిత్తులు, రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్ గురించి తెలిసి ఉండాలి, కానీ సార్కోమా అంటే ఏమిటో మీకు తెలియకపోయే అవకాశం ఉంది. సార్కోమా క్యాన్సర్ గురించి తెలుసుకుంటే మీరు ఈ మహమ్మారి క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంది.
సార్కోమా అంటే ఏమిటి?
లీలావతి హాస్పిటల్ మెడిషియల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ జోషి చెబుతున్న ప్రకారం… సార్కోమా అనేది అరుదైన క్యాన్సర్. ఇది మీ శరీరంలోని ఇతర రకాల కణజాలాలను కనెక్ట్ చేయడానికి సహాయపడే కణాలలోని బంధన కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ క్యాన్సర్ కొవ్వు, కండరాలు, నరాలు, ఫైబరస్ కణజాలాలు, రక్త నాళాలు, లోతైన చర్మ కణజాలం వంటి మృదు కణజాలాల్లో ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ మరణాలు రేటును పెంచుతుంది.
ఇతర క్యాన్సర్లతో పోలిస్తే ఈ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు నొప్పిలేని గడ్డలు శరీరంలో ఏర్పడడం, ఎముకల్లో నొప్పి రావడం, హఠాత్తుగా బరువు తగ్గడం, శరీరంపై పగుళ్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అనేక రకాల రసాయనాలు, వైరస్‌లు, దీర్ఘకాలిక ఇన్ ఫ్లమ్మేషన్, రేడియేషన్ థెరపీ, వారసత్వ రోగాల వల్ల ఈ సార్కోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఈ క్యాన్సర్ వల్ల మరణాలు ఎక్కువ
డాక్టర్ ఆశిష్ జోషి చెబుతున్న ప్రకారం సార్కోమా క్యాన్సర్ అనేక ఉప రకాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి చికిత్సకు భిన్నంగా స్పందిస్తాయి. ఆస్టియోసార్కోమా లేదా ఈవింగ్ సార్కోమా వంటి కొన్ని సార్కోమాలు పిల్లలు, యువకులలో కూడా వస్తుంది. లియోమియోసార్కోమా లేదా లిపోసార్కోమా వంటి మరికొన్ని వృద్ధులను ప్రభావితం చేస్తాయి. సార్కోమాస్ ఇతర క్యాన్సర్ల కంటే తీవ్రంగా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. అందుకే మరణ అవకాశాలను పెంచుతాయి.
ఈ క్యాన్సర్ అరుదైన స్వభావం కారణంగా, దీని నిర్ధారణ చాలా కష్టంగా మారుతుంది. సార్కోమా చికిత్సకు శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో వంటి విధానాలు అవసరం.భారతదేశం అంతటా సార్కోమా గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది.
సార్కోమా సోకిన రోగులు నిశ్శబ్దంగానే బాధపడుతూ ఉంటారు. వారి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదాన్ని కలిగి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, ప్రత్యేక డయాగ్నస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. దీనివల్ల కూడా మరణాలు పెరుగుతాయి. అందువల్ల, సార్కోమా ఉన్న రోగుల ప్రాణాలను కాపాడటానికి సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చేయడం చాలా అవసరం.