Saturday Motivation: ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి.. లేదంటే ఒంటరిగా మిగిలిపోతారు, ఓటమినే చూస్తారు!
Bad Behaviour: మనుషులకు ఉండే అలవాట్లే వారి చుట్టూ ఉండే సమాజాన్ని నిర్ణయిస్తుంది. కొందరు తరచూ ఒంటరిగా ఉండాలని భావిస్తుంటారు. దానికి తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటారు. అలా ఉండే వారు ఒక్కరే మిగిలిపోయి, ఆపదలో సహాయం చేసే వారు కరువై ఓటమికి గురి అవుతుంటారట.
"గెలుపుకు అందరూ చుట్టాలే. కానీ, ఓటమికి మనం మాత్రమే బంధువులం" అంటే మన జీవితంలో విజయం పొందాలంటే అన్ని విధాలా కలిసి రావాలి. ఏ ఒక్క అంశంలోనైనా నిర్లక్ష్యం లేదా వ్యతిరేకత కనిపిస్తే ఓటమి తప్పదు. అలాంటిది అసలు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా గడిపేయాలనుకునే వారికి విజయం వరిస్తుందా.. ? ఇది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.
జీవిత ప్రయాణంలో తన ప్రియమైన వారిని వెంట తీసుకెళ్లే వ్యక్తి మాత్రమే నిజమైన విజయానికి అర్హుడని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి జీవనశైలి కారణంగా ఇతరులతో గడపడానికి, వారి బాగోగులు చూసుకోవడానికి ప్రజలకు సమయం దొరకడం లేదు. ఈ కారణంగా, ప్రజలు కొంతకాలానికి ఒంటరిగానూ, ఫెయిల్ అయినట్లుగానూ మిగిలిపోతారు. ఆ విధంగా ప్రవర్తించే వారిలో మీకు తెలిసిన వారెవరైనా ఉన్నారని ఫీలవుతున్నారా.. రండి అటువంటి 5 అలవాట్ల గురించి తెలుసుకుని చెక్ చేసుకోండి.
చాలాసార్లు తమ భావాలను మాత్రమే విలువనిస్తారు. ఇతరుల భావాలను ఎప్పుడూ పట్టించుకోరు. ఈ కారణంగా, వారి చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ తమకు తాము ఒంటరిగానే ఫీలవుతుంటారు. ఇతరులు కూడా అలాంటి వారికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ అలవాటు వల్ల వారి జీవితంలో ఎప్పుడూ నిరాశ, అపజయం మాత్రమే మిగిలి ఉంటాయి.
అబద్ధం చెప్పే అలవాటు
ప్రతి చిన్న, పెద్ద విషయానికి ఎదుటివారికి అబద్ధాలు చెబుతుంటారు. తమని తాము గొప్పగా చెప్పుకోవడానికో, లేదా స్వార్థపూరిత బుద్ధితోనో అబద్ధాలతో వ్యవహరిస్తుంటారు. అటువంటి వ్యక్తుల్ని ఎవరూ అంత తేలిగ్గా నమ్మరు. ఇలాంటి వారు ఈ అలవాటు కారణంగా ఏ రిలేషన్‌షిప్ లోనూ ఎక్కువ కాలం ఉండలేక జీవితంలో ఒంటరిగా ఉండిపోతారు.
తమ ఇష్టాన్ని అందరూ ఒప్పుకోవాలనుకోవడం
కొందరి స్వభావం ఎలా ఉంటుందంటే.. తమ ప్రతి తప్పొప్పులను ఇతరుల మెచ్చుకోవాలని ఫీలవుతుంటారు. వారు చేసే పనిని విశ్లేషించుకొని తప్పు చేస్తున్నామా.. కరెక్ట్ గానే వ్యవహరిస్తున్నామా అని ఆలోచించరు. కేవలం తమదే పై చేయి ఉండాలని భావిస్తుంటారు. మొదట్లో ఇలాంటి వారి మాటలను పరిచయస్తులు, దగ్గరి వారు వింటుంటారు. కానీ, క్రమంగా వారిని పట్టించుకోవడం మానేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇతరులు స్వార్థపరుడిగా, అహంకారిగా భావించి దూరంగా ఉంచడం మొదలుపెడతారు. కొన్నాళ్ల తర్వాత ఆ అలవాటుతో ఒంటరిగానే మిగిలిపోతారు.
నెగెటివ్ థింకింగ్‌తో ముప్పు
ఒక వ్యక్తి జీవితంలో ముందుకు సాగడానికి సానుకూల స్వభావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. నెగెటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి జీవితంలో ముందుకు కదలలేరు. తనతో ఉన్న వ్యక్తిని ముందుకు సాగనివ్వడు. దాని కారణంగా జీవితంలో గెలవాలనుకునే వారు అటువంటి వారి నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. అలా కాకుండా ఓడిపోయినా కూడా మళ్లీ గెలవాలనే కసితోనూ, అవమానాలను పాఠాలుగా మార్చుకోగల పాజిటివ్ థింకింగ్ ఉన్నవారికే విజేతలు కావడం సాధ్యమవుతుంది.
కోపంతో శాపం
ఇంకొక కారణమేమిటంటే, చాలా మందికి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కోపం వస్తుంది. అలాంటి వారు కోపంతో ఎవరితోనూ ఏమీ మాట్లాడరు. దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి మనోభావాలు దెబ్బతిని అతన్ని ఒంటరిగా వదిలేయవచ్చు.