Papaya Growing: బొప్పాయి మొక్కను కుండీలో కూడా సులువుగా పెంచవచ్చు, ఇది పండ్లు కూడా కాస్తుంది-a papaya plant can be easily grown in a pot in balcony ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Papaya Growing: బొప్పాయి మొక్కను కుండీలో కూడా సులువుగా పెంచవచ్చు, ఇది పండ్లు కూడా కాస్తుంది

Papaya Growing: బొప్పాయి మొక్కను కుండీలో కూడా సులువుగా పెంచవచ్చు, ఇది పండ్లు కూడా కాస్తుంది

Haritha Chappa HT Telugu
Nov 18, 2024 01:00 PM IST

Papaya Growing: బొప్పాయి మొక్కను పెంచాలంటే కచ్చితంగా పెద్ద పెరడు ఉండాలని అనుకుంటారు. సరైన పద్ధతిలో దాన్ని పెంచితే బాల్కనీలోని కుండీలో కూడా ఇది పెరిగేస్తుంది. పండ్లను కాస్తుంది.

కుండీల్లో బొప్పాయి మొక్క
కుండీల్లో బొప్పాయి మొక్క

అన్ని పండ్ల మొక్కలతో పోలిస్తే బొప్పాయి మొక్కను పెంచడం చాలా సులువు. అయితే ఇది పొడవుగా పెరుగుతుంది. కాబట్టి పెరడు అవసరమేమో అనుకుంటారు. మీరు సరైన పద్ధతిలో పెంచితే మీ ఇంటి బాల్కనీలో ఉన్న కుండీల్లో కూడా ఇది పెరిగేస్తుంది. పండ్లను కూడా కాస్తుంది. అయితే బాల్కనీలో బొప్పాయి చెట్టును పెంచాలనుకుంటే కొంచెం పెద్ద కుండీని కొనుక్కోండి. దానికి తగిన పోషణను అందిస్తే అది మీకు మంచి పండ్లను ఇస్తుంది. బాల్కనీలోనే కుండీలో బొప్పాయిని పెంచడం ఎలాగో తెలుసుకోండి.

బొప్పాయి పండు పెంచండిలా

ఒక బొప్పాయి పండును కొంటే చాలు బోలెడన్ని విత్తనాలు దాని నుండి బయటకు వస్తాయి. ఆ విత్తనాలు నేల మీద పడి మొలకెత్తిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. మీరు ఆ బొప్పాయి విత్తనాలను తీసి గాలి తగిలిచోట ఆరబెట్టండి. సారవంతమైన మట్టిలో ముందుగా ఈ విత్తనాన్ని నాటండి. అది నేల నుండి పోషకాలను తీసుకుని ఎదుగుతుంది. ఆ మొక్క పెరగడం మొదలయ్యాక మీరు ఒక పెద్ద కుండీలో దీన్ని తిరిగి నాటండి. బొప్పాయి మొక్కలకు పూర్తిగా సూర్యరశ్మి అవసరం. కాబట్టి ప్రతిరోజూ సూర్య రశ్మి తగిలేలా ఈ బొప్పాయి మొక్కను ఉంచండి. బాల్కనీలో ఎండ ఎలాగూ తగులుతుంది.. కాబట్టి ఇలాంటి సమస్య ఉండదు.

అబ్బాయి మొక్కలకు చాలా నీరు అవసరం పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఎన్నో కొన్ని నీళ్లు చిలకరించడం మర్చిపోవద్దు. మట్టి ఎప్పుడూ కూడా పొడిగా మారకుండా చూసుకోవాలి. అలానే ఎక్కువ నీరు పోసినా కూడా అది కుళ్లిపోయే అవకాశం ఉంది. బొప్పాయి మొక్కలకు ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఆవు పేడ, వేప ఆకుల పేస్టు వంటివి మట్టిలో కలపడం ద్వారా వాటికి ఎరువును వేసినట్టే. మట్టిలో ఈ వేప ఆకులు లేదా వేప ఆకుల పేస్టును పేడను కలిపి ఎరువుల తయారు చేయండి. దాన్ని ఈ బొప్పాయి మొక్క ఉన్న కుండీలో వేస్తూ ఉండండి.

కుండీలో బొప్పాయి మొక్క

పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కుండీలోనే బొప్పాయి మొక్క వేగంగా పెరుగుతుంది. కుండీలో వేసిన మొక్క మరీ పెద్దగా పెరిగితే పైన ఉన్న పైకప్పుకు తగిలే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పొడవు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండండి. అలాగే ఈ చెట్టు సన్నగా పెరుగుతుంది. కాబట్టి దీనికి సపోర్టుగా పక్కన ఒక కర్రను కూడా పాతండి ఇలా 6 నెలల పాటు ఈ మొక్కను కాపాడుకుంటే అది ఏడాదిలోపు మీకు బొప్పాయి పండ్లను అందిస్తుంది.

బొప్పాయిల్లో బోన్సాయి రకాలు కూడా ఉన్నాయి. అంటే ఇవి పొడవుగా పెరగవు. మరుగుజ్జు ముక్కల్లా ఉండిపోతాయి. వాటిని చాలా సులువుగా మీరు కుండీల్లో పెంచవచ్చు. బొప్పాయి మొక్కను ఒక్కసారి వేస్తే ఐదేళ్లపాటు అది పండ్లను ఇస్తుంది. ఇది ఏడాది పొడవునా పండే మొక్క. కాబట్టి అక్టోబర్, నవంబర్ నెలలో దీన్ని నాటితే అది త్వరగా పెరుగుతుంది. వేసవిలో ఎండకు త్వరగా మొలకెత్తి అవకాశం తక్కువ. ఇలా మీరు ఇంట్లోనే బాల్కనీలో బొప్పాయి మొక్కలను పండించి చూడండి. ఇవి కచ్చితంగా మీకు మంచి పండ్లను అందిస్తాయి.

Whats_app_banner