Happy Fathers Day: తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు, కానీ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది-a mothers love is visible a fathers love is invisible but finds you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Fathers Day: తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు, కానీ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది

Happy Fathers Day: తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు, కానీ మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 04:00 PM IST

Happy Fathers Day: తల్లి ప్రేమ, నాన్న పాలన... ఈ రెండే ప్రతి బిడ్డకు అవసరం. అమ్మ ప్రేమ తీయగా బయటికి కనిపిస్తుంది. కానీ నాన్న పాలనలో కాస్త పరుషత్వమే కనిపిస్తుంది. అయినా నాన్న మనసు లోతుల్లో నిగూఢమైన ప్రేమ పిల్లలపై ఎంతో ఉంటుంది.

హ్యాపీ ఫాదర్స్ డే
హ్యాపీ ఫాదర్స్ డే (Pexel)

Happy Fathers Day: ప్రేమంటే తల్లి గుర్తుకొస్తుంది. ఎవరికైనా తండ్రి గుర్తుకు రావడం చాలా అరుదు. ఎందుకంటే పిల్లలతో ఎక్కువ సమయం గడిపేది తల్లే. గోరుముద్దలు తినిపించేది తల్లి. మొదటి అడుగులు వేయించేది తల్లి .అందుకే ప్రతి బిడ్డకు ప్రేమ అంటే గుర్తొచ్చేది కన్నతల్లే. కానీ వారిని కవచంలా కాపాడే తండ్రి ప్రేమ చాలా తక్కువగా గుర్తొస్తుంది. తండ్రి ఎక్కువ సమయం బిడ్డలతో గడపలేడు. వారి భవిష్యత్తుకు బాట వేసేందుకు, కావాల్సిన అవసరాలను తీర్చేందుకు నిత్యం ఆరుబయట కష్టపడుతూనే ఉంటాడు. పిల్లలకు ఎన్నో ఇవ్వడానికి... నాన్న ఎన్నింటినో కోల్పోతాడు. నాన్న ప్రేమ అర్థం అవ్వాలంటే ప్రతి బిడ్డ తండ్రి అవ్వాలి. నాన్న చేతిని పట్టుకొని నడిస్తే చాలు... భవిష్యత్తులో ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా తీర్చిదిద్దుతాడు.

తల్లి ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదు. కానీ అనునిత్యం బిడ్డలని కనిపెట్టుకునే ఉంటుంది. నాన్న వేసే ప్రతి అడుగులో బిడ్డ భవిష్యత్తుకే బాటలు పడతాయి. బయటి ప్రపంచాన్ని చూపించాలంటే నాన్నే చూపించాలి. మేఘంలా గర్జిస్తూ కరుకుగా కనిపిస్తాడు నాన్న. కానీ అతని గుండెల్లో ఉన్న ప్రేమ తొలకరి జల్లు కన్నా చల్లగా ఉంటుంది. తాను ముళ్లబాటలో నడిచినా పిల్లలకి పూలబాటే వేయాలనుకుంటాడు నాన్న. అందుకోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటాడు. నాన్న అంటే నిస్వార్థం. నాన్న అంటే నిలువెత్తు ధైర్యం. జేబు నిండా డబ్బులు ఉన్నా తనకి ఇష్టమైనవేవీ కొనుక్కోకుండా, తన బిడ్డలకు ఇష్టమైనవి కొంటాడు నాన్న.

ఎలా జీవించాలో నాన్న బిడ్డలకు చెప్పడు, కానీ బిడ్డలు నాన్నను చూసే నేర్చుకుంటారు. మీరు ఓడినప్పుడు ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా... మీ వెనక ఉండి ధైర్యం చెప్పే ఒకే వ్యక్తి నాన్న.

అమ్మ ప్రాణం పోసి మీకు జీవం ఇస్తే... మీ జీవానికి ఒక వ్యక్తిత్వాన్ని, విజయాన్ని, ఓ జీవితాన్ని ఇచ్చే వ్యక్తి నాన్న. అలాంటి మంచి నాన్నలను ఒకసారి తలుచుకొని వారికి రుణపడి ఉండమని చెప్పే దినోత్సవం ‘అంతర్జాతీయ పితృ దినోత్సవం’.

నాన్న అంటే ఒక బంధమే కాదు... బిడ్డల వెనకున్న బలం. నాన్న అంటే భయం కాదు... అతి పెద్ద బాధ్యత. బిడ్డలకు సంతోషాన్ని ఇచ్చేవాడు మాత్రమే నాన్న కాదు, సర్వస్వాన్ని ఇచ్చేవాడే నాన్న. అతని ప్రేమను కొలవాలంటే భూమి, ఆకాశమే సరిపోదు. అమ్మ ప్రేమను కళ్ళతో గుర్తించగలం, కానీ నాన్న ప్రేమ అర్థం కావాలంటే చాలా సమయం పడుతుంది.

అమ్మ ప్రేమ అనంతమైనదైతే, నాన్న ప్రేమ విశాలమైనది. ఈ విశాల ప్రపంచాన్ని మీకు పరిచయం చేసేది తండ్రి. శరీరం మాత్రమే తనతో ఉంచుకుంటాడు. తన ఆలోచనలు ఎప్పుడూ బిడ్డల చుట్టే ఉంచుతాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని, ఐఫోన్ కొనలేదని నాన్నను తిట్టే కొడుకులు ఎంతోమంది.. అలాంటి కొడుకులకు తాము తండ్రి అయితే కానీ ఆ నాన్న బాధ్యత ఏంటో, నాన్న ఎందుకు ఆ రోజు ఐఫోన్ కొనివ్వలేదో అర్థమవుతుంది. ఇంట్లోని ప్రతి ఒక్కరి ఖర్చులను భరిస్తూ తన ఖర్చును తగ్గించుకునే వాడే నాన్న.

పిల్లల పెదవులపై చిరునవ్వు చూడడం కోసం తన కన్నీళ్లను దాచుకుంటాడు తండ్రి. అలాంటి తండ్రికి నువ్వు ఇచ్చే విలువ అనంతంగా ఉండాలి. అంతే తప్ప ఆవేదనను మిగిల్చేలా ఉండకూడదు. మీరు ఇప్పుడు మీ తండ్రిని ప్రేమిస్తేనే, భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు.

నాన్న ప్రేమను బిడ్డలకు తెలియజేయాలని ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడో ఆదివారం నాడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే ను నిర్వహించుకుంటారు. దాదాపు 52 దేశాల్లో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తల్లుల గౌరవార్థం మదర్స్ డే ఉన్నట్టే. తండ్రుల కష్టాన్ని గుర్తించేందుకే ఈ ఫాదర్స్ డే పుట్టుకొచ్చింది. ఈ ఫాదర్స్ డే పెట్టడం వెనక ఉన్నది కూడా ఒక కూతురే. 1910 నుంచి ఈ ఫాదర్స్ డే ను నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది ఎంతోమంది కూతుళ్లు, కొడుకులు తమ తండ్రిని గొప్పతనాన్ని తలుచుకుంటూ ఫాదర్స్ డే ను నిర్వహించుకుంటారు.

WhatsApp channel

టాపిక్