Thursday Motivation: కష్టాలు అనుభవిస్తేనే మనిషి రాటుదేలేది, వాటిని చూసి భయపడకండి, వాటిని దాటేందుకు ప్రయత్నించండి-a man is only a stone if he experiences hardships dont be afraid of them try to overcome them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: కష్టాలు అనుభవిస్తేనే మనిషి రాటుదేలేది, వాటిని చూసి భయపడకండి, వాటిని దాటేందుకు ప్రయత్నించండి

Thursday Motivation: కష్టాలు అనుభవిస్తేనే మనిషి రాటుదేలేది, వాటిని చూసి భయపడకండి, వాటిని దాటేందుకు ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu
Jun 06, 2024 05:00 AM IST

Thursday Motivation: సమస్యలు వస్తాయని భయపడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. కష్టాలకు, కన్నీళ్ళకు వెనకడుగు వేస్తే జీవితంలో ముందుకు వెళ్లడమే అతి కష్టంగా మారుతుంది.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Thursday Motivation: పూర్వం ఒక రైతు ఉండేవాడు. అతడు పంటను ప్రాణంగా ప్రేమించేవాడు. కానీ వాతావరణము ఎప్పుడూ తన అదుపులో ఉండాలని కోరుకునే వాడు. ఒకరోజు దేవుడిని పిలిచి ‘ఈ వాతావరణం మార్పులు వల్ల నాకు చాలా విసుగ్గా ఉంది. రైతుని నేను. కాబట్టి వాతావరణం నేను చెప్పినట్టు వినాలి. వ్యవసాయం చేయడం నీకు రాదు. నాకు తెలుసు... కాబట్టి ఎప్పుడు ఎండ రావాలో, ఎప్పుడు వర్షం పడాలో నేనే నిర్ణయిస్తాను’ అని అంటాడు. దానికి దేవుడు కూడా సరే అని ఒప్పుకుంటాడు.

yearly horoscope entry point

అప్పటి నుంచి రైతు వాతావరణాన్ని తన అదుపులో ఉంచుకుంటాడు. పంటకు కావలసిన ప్రణాళికను వేసుకుంటాడు. అతనికి వర్షం కావాల్సి వచ్చినప్పుడు వర్షాన్ని ఆహ్వానిస్తాడు. ఎండ కావాల్సి వచ్చినప్పుడు ఎండను ఆహ్వానించేవాడు. కానీ ఈదురు గాలులకు భయపడేవాడు. ఈదురు గాలులను రాకుండా ఆపేవాడు. గాలి వేయకుండా చూసుకునేవాడు. గాలి వేస్తే పంట పాడవుతుందని భావించేవాడు. వర్షం, ఎండ సరైన సమయానికి వచ్చేలా చూసుకున్నాడు. జొన్న చేను చక్కగా పండింది. ఆ చేను చూస్తే రైతు సంతోషానికి అవధులు లేవు. కానీ ఎన్ని రోజులైనా కూడా జొన్న కంకులు మాత్రం రావడం లేదు.

ఎన్నో రోజులపాటు ఓపిగ్గా చూశాడు రైతు. పంట ఏపుగా పెరగడమే కానీ జొన్న కంకులు లేవు. అలా ఎందుకు జరిగిందో ఆయనకి అర్థం కాలేదు. వెంటనే దేవుడిని పిలిచి ‘నేను సరైన సమయానికి వర్షం పడేలా చేశాను. ఎండ కాసేలా చేశాను. కానీ జొన్న కంకులు రాలేదు. ఒక్క గింజ కూడా నా చేతిలో లేదు, కానీ పంట మాత్రం పచ్చగా కనిపిస్తోంది’ అని అన్నాడు. దానికి దేవుడు ‘నువ్వు రైతువి కదా, నీకు అంతా తెలుసు.. అందుకే నువ్వే చూసుకుంటావని వదిలేసాను. ఎండ కాసింది, వర్షం పడింది కానీ గాలులను ఎందుకు ఆపేసావు? గాలి కూడా వస్తేనే మొక్కలు బలంగా మట్టిలోకి నాటుకుంటాయి. గాలి వీయకపోతే మొక్కలకు భయం ఉండదు. తాము పడిపోతాం అనే బాధ ఉండదు. కాబట్టి మొక్కల వేళ్ళు నేలలోకి చొచ్చుకొని వెళ్లలేదు. దానివల్లే మొక్కకి బలం రాలేదు. కంకులు వేయలేదు. ఎప్పుడైతే ఈదురు గాలులు, బలమైన గాలులు వస్తాయో మొక్క తనను తాను కాపాడడం కోసం నేలలోకి బలంగా చొచ్చుకుని వెళుతుంది. అప్పుడే మొక్కకి పోషకాలు భూమి నుంచి అంది కంకులు వేస్తాయి. నువ్వు సమస్యలు రాకూడదని గాలినే ఆపేసావు. అందుకే నీకు పంట చేతికి రాలేదు’ అని చెప్పాడు. అప్పుడు రైతుకు తత్వం బోధపడింది. కష్టాలు, సమస్యలు లేని జీవితాన్ని కోరుకోకూడదని... అవే మనిషిని మనసును రాటు దేలుస్తాయని అర్థమైంది.

జొన్న చేనులాగే ఈదురుగాలుల్లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైతే నే మనం మరింత కఠినంగా దృఢంగా తయారవుతాము. పంటకు బలమైన గాలే పెద్ద సమస్య. దాని నుంచి తనను కాపాడుకోవాల్సిన కోసం చేను బలంగా భూమి లోకి నాటుకుంటుంది. అలాగే మీరు మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కన్నీళ్లను తట్టుకోవడానికి బలంగా మారాలి. అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు. కూర్చుని ఏడవకూడదు.

Whats_app_banner