జీవితంలో మానవ సంబంధాలు విలువైనవి. ఆ బంధాలలో వైవాహిక బంధం చాలా ముఖ్యమైనది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆలు మగల బంధం అహంభావాలకు అతీతంగా నిబంధనలు లేకుండా, నిస్వార్థంగా ఉండాలి. అలాంటి ప్రేమ అవగాహన, ఐక్యత, లోతైన అనుభూతిని పెంపొందించడం ద్వారా బంధాన్ని మరింత అందంగా మలుస్తుంది. ఇద్దరి బంధం దృఢంగా ఉండాలంటే ఈ 7 పసిడి సూత్రాలు పాటించాలి.
ప్రతి వ్యక్తి ఎదగడానికి వ్యక్తిగత స్పేస్ అవసరం. కానీ ఆ స్పేస్ ఎంతవరకు అనే అవగాహన ఉండాలి. అరవింద సమేత సినిమా లో హీరోయిన్ స్పేస్ కావాలి అని అంటూ ఉంటుంది.. అలా అనడం అవతలి వారిని దూరం పెట్టడం కాదు, ఎదుటి వారిని గౌరవిస్తూనే తన గౌరవాన్ని నిలుపుకోవడం. ఆ స్పేస్ అనేది లేకపోతే దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
వివాహం బంధం ఇద్దరు వ్యక్తుల శరీరాలు, మనస్సుల కలయిక. బంధంలో మిమ్మల్ని మీరు గుర్తించలేకపోతే అది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. ప్రతి జంటలో ఇద్దరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలను, అభిరుచులను ఒకరిని ఒకరు సమర్థించుకున్నపుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలు పెళ్లయ్యాక భాగస్వాములతో జీవితాలను సర్దుబాటు చేయడానికి వారి ఆసక్తులు, అభిరుచులు స్నేహాలను విడిచిపెట్టేస్తుంటారు.
భర్త వాటిని గుర్తించి ప్రోత్సాహించగలిగితే అద్భుతాలు చేయగలరు. భర్తలు కూడా కుటంబ బాధ్యతలతో తమ ఆసక్తులను తొక్కి పెట్టేస్తారు. భార్య వాటిని గుర్తించి, అవి నెరవేర్చుకోవడంలో సహకరిస్తే ఆ దాంపత్యం నందన వనమే. ఆలుమగలు ఇద్దరూ "నేను"కు మొదటి స్థానం కాకుండా "నువ్వు" కు మొదటి స్థానం ఇవ్వగలిగితే "మనం" అనే భావన వెల్లివిరుస్తుంది.
సంతోషకర వైవాహిక జీవితానికి జీవిత భాగస్వామిని వారు ఎలా ఉన్నారో అంగీకరించడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి భిన్నమైన నమ్మకాలు, ఆలోచనా విధానాలు, అభిప్రాయాలు, దృక్కోణాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించకపోవడం సహజం. వివాహమనేది రెండు వేర్వేరు నమ్మకాలు, మనస్తత్వాల కలయిక అని చెప్పొచ్చు. ఈ వ్యత్యాసాలపై అవగాహన లేకుంటే వైవాహిక జీవితం సంఘర్షణకు దారి తీస్తుంది.
సంతోషకరమైన వైవాహిక జీవితానికి విఘాతం కలుగుతుంది. ఇప్పటి యువతలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోయింది. ఇన్‌స్టంట్ నూడుల్స్ లాగా ఎదుటి వారి నిర్ణయాలను త్వరగా జడ్జ్ చేయడం ఎక్కువైంది. అపార్థాలతో వాదనలు పెరిగి ఐక్యత కరువైంది. చిన్న అపార్థంతో ప్రారంభమైన ఆరోపణల ప్రయాణం ఇద్దరి అగాధాన్ని పెంచుతోంది. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది.
ఇతరుల నిర్ణయాలపై వెంటనే ఒక అభిప్రాయం రావడం సులభం, అర్థం చేసుకోవటం చాలా కష్టం. వారి అభిప్రాయంపై మనకు విముఖత వాటిని విశ్వసించే సుముఖత ఇద్దరికీ ముఖ్యం. ఇది ఇద్దరి ఎదుగుదలకి, కుటుంబ ఆహ్లాదానికి దోహదపడుతుంది.
వైవాహిక జీవితంలో ప్రశంసలు ముఖ్యం. భాగస్వామి ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం, ప్రశంసించడం బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ధోరణి ఇద్దరి మధ్య సారూప్యతను మరింతగా పెంచుకోవడానికి, కష్టతరమైన సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడానికి సాయపడుతుంది.
ఆలుమగల మధ్య గిల్లికజ్జాలు సహజం. ప్రతి బంధంలో వాదనలు సహజం. మీ ప్రియమైన వ్యక్తితో కొన్ని వాదనలు కొన్ని సమయాలలో ఉద్వేగభరితంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మాట తూలే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎవరో ఒకరు మౌనంగా ఉండటమే మేలు.
వేడి చల్లారిన తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే తెరలు తొలగిపోతాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ ఉన్నా, కేవలం చిన్న చిన్న అపార్థాలు,అపోహలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు.
భాగస్వామి మనతో పూర్తిగా ఏకీభవించడం, మనల్ని ఇష్టపడడం, మనల్ని విలువైన వారుగా పరిగణించడం, మనల్ని అర్థం చేసుకోవడం, ఎల్లవేళలా మనతో ఉండాలని కోరుకోవడం అంత మంచిది కాదు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, తిరిగి మనల్ని అదే స్థాయిలో ప్రేమించాలనే భావన నుండి బయటపడాలి.
భాగస్వామిని సంతోష పెట్టడానికి, వారి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అది మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. అనవసర ఆగ్రహానికి దారి తీస్తుంది. ప్రేమను ఇవ్వండి.. తిరిగి ఆశించొద్దు.
మీ భాగస్వామి తమ లక్ష్యాలను సాధించినప్పుడు, విజయాలను అందుకున్నప్పుడు వాని నిజంగా సంతోషంగా ఉంచడం ముఖ్యం. వారి ఆనందాన్ని పంచుకోవడం, మీ మద్దతును తెలియజేయడం అవసరం. భార్యభర్తలు పరస్పరం కలలను గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు ప్రోత్సాహించుకోవడం ఇద్దరి ఆనందానికి ఎంతో అవసరం.
- మానస తిరుమల
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
99633 38639