Foods for Hair Growth । నల్లని కురుల కోసం ఇవే ఆహారాలు.. రోజూ తినండి!
Foods for Hair Growth: జుట్టు పెరుగుదలను కోరుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ మీ డైట్ లో సరైన పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోండి, ఎలాంటివి తినాలో ఇక్కడ చూడండి.
Foods for Hair Growth: ఈరోజుల్లో ఎక్కువ మందిలో కామన్ గా కనిపించే సమస్య జుట్టు రాలడం (Hair Fall). ఇంతకుముందు అమ్మాయిలు మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొనేవారు. ఇప్పుడు కాలం మారింది, అబ్బాయిలు కూడా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణాలు కూడా తెలిసినవే. కలుషిత వాతావరణం, కఠినమైన జలం, మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు, అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారలోపం ప్రధాన కారణాలు. అయితే వీటన్నింటిలో మీరు సరిచేయ గల కారణాలలో పోషకాహార లోపం ముందుంటుంది. జుట్టుకు అవసరమైన పోషకాలను (Nutrition) తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా, నల్లని ఆరోగ్యకరమైన కురులను (Black Hair) సొంతం చేసుకోవచ్చు.
మీ రోజూవారీ ఆహారంలో భాగంగా కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోండి. ఇవి మీ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
చేపలు
చేపల్లో వెంట్రుకల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలకు సహజమైన నూనెలను అందిస్తాయి. తద్వారా వెంట్రుకలు కుదుళ్ల నుండి బలంగా తయారవుతాయి.
రొయ్యలు
రొయ్యల తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగేందుకు తరచుగా రొయ్యలు తింటూ ఉండాలి. వీటిలో నాణ్యమైన ప్రొటీన్లు ఉంటాయి, ఇవి మీ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
గుడ్లు
గుడ్లలో విటమిన్లు మాత్రమే కాకుండా జింక్, సల్ఫర్, ఐరన్, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. కోడిగుడ్లలో బయోటిన్ లేదా విటమిన్ బి7 పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే సప్లిమెంట్.
పెరుగు
అనేక జుట్టు సమస్యలకు పెరుగు మంచి మందు. ఇందులో విటమిన్ బి12, ప్రొటీన్, అయోడిన్ , కాల్షియం ఉంటాయి. దీనితో పాటు, స్కిమ్డ్ మిల్క్, కాటేజ్ చీజ్, యోగర్ట్ వంటి పాల ఉత్పత్తులు జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆకుకూరలు
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. అన్ని ఆకుపచ్చ కూరగాయలు జుట్టు ఆరోగ్యానికి మంచివి. పాలకూర, పార్ల్సీ వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడం, చిట్లడం రాకుండా చేస్తుంది.
కారెట్
క్యారెట్ తీసుకోవడం కంటి ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది 'విటమిన్ ఎ' గా మారుతుంది. విటమిన్ ఎ లేకుండా మీ శరీరంలోని కణాలేవీ పనిచేయవని గమనించడం ముఖ్యం, కాబట్టి ఆహారంలో తగినంత విటమిన్ ఎ తీసుకోవడం మంచిది. ఆహారంలో విటమిన్ ఎ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, పలుచబడటం, బట్టతల వచ్చే అవకాశం ఉంది. బత్తాయి, గుమ్మడి, మామిడి, నేరేడు పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
బీన్స్, నట్స్, డ్రైఫ్రూట్స్
పప్పుధాన్యాలు, గింజలు, డ్రైఫ్రూట్స్ వంటివి మీ జుట్టుకు మంచి పోషకాహారం. ఇవి మీరు ఊహించని విధంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తాయి.
ఈ ఆహారాలు తినడంతో పాటు హైడ్రేటెడ్ గా ఉండటానికి తగినంత నీరు తాగండి. వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, పోషకాల రవాణా జరుగుతుంది.
సంబంధిత కథనం