Mental Health: ప్రతిరోజూ రెట్టింపు ఉత్సాహం కోసం సింపుల్‌గా ఈ 6 టిప్స్ ఫాలో అయిపోండి!-6 daily habits to boost mental health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mental Health: ప్రతిరోజూ రెట్టింపు ఉత్సాహం కోసం సింపుల్‌గా ఈ 6 టిప్స్ ఫాలో అయిపోండి!

Mental Health: ప్రతిరోజూ రెట్టింపు ఉత్సాహం కోసం సింపుల్‌గా ఈ 6 టిప్స్ ఫాలో అయిపోండి!

Galeti Rajendra HT Telugu
Oct 26, 2024 02:00 PM IST

Good Habits: బిజీ లైఫ్‌లో మన గురించి మనం కొన్ని నిమిషాలు కూడా ఆలోచించే పరిస్థితి చాలా మందికి లేకపోతోంది. దాని వల్ల ఒత్తిడి, నిరుత్సాహం వస్తుంటుంది. అయితే.. ఈ 6 టిప్స్ పాటిస్తే.. మీ రోజు వారి జీవితం ఉత్సాహంగా మారుతుంది.

మీరోజు వారి జీవితాన్ని ప్రభావితం చేసే అలవాట్లు
మీరోజు వారి జీవితాన్ని ప్రభావితం చేసే అలవాట్లు (File Photo)

లైఫ్ ప్రతిరోజూ కొత్తగా ఉంటుంది. కానీ.. మీరు ఉత్సాహంగా రోజుని గడపగలరా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో దానికి రెట్టింపుగా మానసిక ఆరోగ్యం కూడా అవసరం. కాబట్టి.. ప్రతి రోజూ కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లకు సమయం కేటాయించి మీ డైలీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి.

వాస్తవానికి బిజీ జీవితంలో మనం రోజువారీ కొన్ని దినచర్యలని స్కిప్ చేసేస్తుంటాం. కానీ.. ఈ 6 అలవాట్లని మీరు క్రమం తప్పకుండా కొనసాగించగలిగితే మీ మానసిక ఆరోగ్యానికి ఢోకా ఉండదని సైకియాట్రిస్ట్ డాక్టర్ గోరవ్ గుప్తా అభిప్రాయపడ్డారు.

కొన్ని నిమిషాలు ధ్యానం

ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొన్ని నిమిషాలు ధ్యానం లేదా యోగా చేయాలి. ఇది మీపై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అలానే మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఆలోచనల్ని సమీకరించుకోవడానికి కూడా ధ్యానం లేదా యోగా ఉపయోగపడతాయి.

నిశ్శబ్దం గొప్ప ఆయుధం. మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు కాస్త విరామం తీసుకుని ధ్యానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. కొన్ని నిమిషాలు శ్వాసపైనే ధ్యాస పెడితే ఎలాంటి మానసిక ఒత్తిడి నుంచైనా ఉపశమనం లభిస్తుంది.

రెగ్యులర్ వ్యాయామం

ప్రతి రోజూ కాసేపు వ్యాయామం మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాయామం, యోగా, స్విమ్మింగ్, వాకింగ్ ఇలా పేరు ఏదైనా మీ శరీర బరువుని అదుపులో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. మీ శరీరాన్ని కదిలించడం అంటే.. ఒకరకంగా మీ మానసిక స్థితిని కూడా కదిలించడమే. మీరు ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలైనా వాకింగ్ చేయండి. ఆ శ్రమ మీ శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్లు.

డైరీ రాస్తే తప్పులు తెలుస్తాయ్

మీ ఆలోచనలను, భావోద్వేగాలను రెగ్యులర్‌గా డైరీలో రాయండి. ఇది మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవడానికి, తప్పిదాల్ని దిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. కేవలం మీకు నచ్చినవి రాసి.. మీకు నచ్చనివి వదిలేయకండి. అన్నీ రాయండి. ఇది మీ ఆలోచనలను స్పష్టం చేయడానికి, ఒత్తిడి నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడానికి ఈ అలవాటు ఉపయోగపడుతుంది. మీతో మీరు పూర్తిగా నిజాయితీగా ఉండటానికి ఈ డైరీ అలవాటు మీకు సహాయపడుతుంది.

తగినంత నిద్ర

మానసిక ఆరోగ్యం కావాలంటే మీరు నిద్రకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. మీరు తగినంత నిద్రపోవడం మెదడు పనితీరును పునరుద్ధరించడానికి, మీ మానసిక స్థితిని పెంచడానికి, అలానే మీ శరీరాన్ని రిఫ్రెష్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

పాజిటివ్ సెల్ఫ్ టాక్

మీరు మీరోజువారి జీవితంలో సానుకూల ఆలోచనలతోనే ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడటం ద్వారా మీ గురించి వారికి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. నెగటివ్ థాట్స్ మీ దగ్గరికి రానివ్వదు. ఎవరైనా మాట్లాడినా వాటిని పట్టించుకోవద్దు. ఇలా చేస్తే మీరు పాజిటివ్ థింకింగ్‌లోనే ఉండి అన్నింటినీ సానుకూల దృక్పథంతో స్వీకరించగలుగుతారు.

కృతజ్ఞత పూర్వక ఆలోచనలు

మీకు రోజువారీ జీవితంలో ఎంతో మంది తారసపడతారు. వారిలో మీకు మంచి చేసిన వాళ్లు కూడా ఉండవచ్చు లేదా చెడు తలపెట్టిన వారు కూడా మీకు టచ్‌లోకి రావచ్చు. కానీ.. నిద్రపోయే ముందు మీకు మంచి చేసిన వారు లేదా సహాయపడిన వారి గురించి కొన్ని క్షణాలు కృతజ్ఞతపూర్వకంగా గుర్తుచేసుకోండి. ఈ అలవాటు మిమ్మల్ని పాజిటివ్ మైండ్‌సెట్‌లో ఉంచడానికి సహాయపడుతుంది.

ఈ 6 అలవాట్లు మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి.

Whats_app_banner