ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడి, రోజువారీ పనుల పరుగు పందెంతో మనసు ప్రశాంతంగా లేక నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, విపరీతమైన పని గంటలతో రోజంతా మెదడు పరుగులు పెడుతుంది. రోజు ముగిసినా, మనసు మాత్రం ఆలోచనల సుడిగుండంలోంచి బయటపడలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచడంలో యోగా పాత్ర గురించి అక్షర్ యోగా కేంద్ర వ్యవస్థాపకుడు, యోగా నిపుణుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.
"యోగా మన శరీరానికి బలాన్ని, క్రమశిక్షణను నేర్పుతుంది. కానీ అది మనసును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఒక మార్గం. సున్నితమైన కదలికలతో పాటు లోతైన శ్వాసలు 10 నుంచి 15 సార్లు తీసుకోవడం వల్ల రోజంతా పేరుకుపోయిన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలికంగా చూస్తే, ఈ సాధన మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించడానికి ఒక అలవాటును పెంచుతుంది. రాత్రిపూట యోగా చేయడానికి కేవలం 10-15 నిమిషాలు పడుతుంది. కానీ దాని ప్రయోజనాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. కాలక్రమేణా, శరీరం సాగదీయడాన్ని, పడుకోవడానికి సిద్ధం కావడాన్ని అనుసంధానిస్తుంది. దాంతో నిద్ర పట్టడం సులభం అవుతుంది" అని వివరించారు.
నిద్రకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచే 5 యోగాసనాలు, వాటిని ఎలా చేయాలో యోగా నిపుణుడు వివరించారు.
మీ మ్యాట్‌పై మోకాళ్ళపై కూర్చోండి. పాదాల బొటనవేళ్లను ఒకదానికొకటి తాకించి, మడమలపై కూర్చోండి. చేతులను ముందుకు చాచి, నుదుటిని మ్యాట్‌పై ఆనించండి. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. 1-2 నిమిషాలు ఈ స్థితిలో ఉండి, శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వండి.
పాదాల అరికాళ్లను ఒకదానికొకటి చేర్చి, మోకాళ్లను పక్కలకు వదిలేయండి. మీ చేతులను కడుపుపై లేదా పక్కన ఉంచుకోండి. ఈ భంగిమ తుంటి భాగాన్ని తెరిచి, శ్వాసను నెమ్మదిగా, స్థిరంగా చేస్తుంది. కొద్దిసేపు ఈ స్థితిలో ఉండి, రోజంతా ఉన్న చింతలను తొలగించుకోండి.
మీ వెనుక భాగం గోడకు ఆనించి, కాళ్ళను గోడపై పైకి ఆనించండి. చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచి, కళ్ళు మూసుకోండి. 5 నుండి 10 నిమిషాలు ఈ స్థితిలో ఉండి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శాంతి మీలో నిండిపోతున్నట్లు భావించండి.
నాలుగు కాళ్ళపైకి (మోకాళ్ళు, చేతులు నేలకు ఆనించి) రండి. శ్వాస తీసుకుంటూ, నడుము పైకి లేపండి (ఆవు భంగిమ). శ్వాస వదులుతూ, వెనుక భాగాన్ని గుండ్రంగా చేసి, గడ్డం రొమ్ముకు ఆనించండి (పిల్లి భంగిమ). 1-2 నిమిషాలు నెమ్మదిగా దీన్ని పునరావృతం చేయండి. ఈ భంగిమ వెన్నెముకలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇది మీ యోగా సాధనకు ముగింపు భంగిమ. మీ వెనుక భాగంపై నేరుగా పడుకోండి. చేతులను శరీరానికి ఇరువైపులా విశ్రాంతిగా ఉంచి, అరచేతులు పైకి చూసేలా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఈ ఆసనంలో మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు ఎటువంటి కదలిక లేకుండా ఉండండి.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.)