ప్రస్తుత బిజీ లైఫ్‌లో రోజుల్లో సంబంధాలు నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఒకప్పుడు లేని కొత్త కొత్త సమస్యలు ఇప్పుడు జంటల మధ్య వస్తున్నాయి. బిజీ లైఫ్ స్టైల్, చిన్ననాటి అనుభవాలు, ఫోన్‌లు ఇలాంటి చాలా అంశాలు ప్రేమ బంధాలను దెబ్బతీస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి రిలేషన్ షిప్ ను కాపాడుకోవడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. ఇది తెలియక బంధుత్వాలు చెడిపోయి, విడిపోవడం వరకూ వస్తున్నాయి. ఓ సైకాలజిస్ట్ పరిశోధన ఆధారంగా ఆధునిక సంబంధాలను బలహీనపరిచే 5 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి.అవేంటో వాటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం రండి.
ఇప్పుడు ఫోన్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయాయి. ఇవి లేకుండా ఏ పనీ జరగదు వాస్తవమే కానీ భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఫోన్‌కు అతుక్కుపోతే వాళ్లకు మీరు పట్టించుకోవట్లేదనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని రకరకాల పోస్టులు, లైక్‌లు, పాత పరిచయాల వల్ల కూడా ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా భాగస్వామితో ఉన్నప్పుడు ఫోన్ కు దూరంగా ఉండండి. వీలైతే ఫోన్ వాడకానికి ఒక సమయం కేటాయించుకోండి.
రాజకీయాలు, మతం, భక్తి వంటి విషయాలపై మీ ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉంటే అవి సంబంధాలపై ప్రభావం చూపుతాయి. చాలా మందికి తమకు నచ్చిన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారితోనే ఉండాలని అనుకుంటారు.ఇలా కాకుండా మీరిద్దరూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోండి. వాళ్ల ఆలోచనలను మార్చాలని ప్రయత్నించకండి. వీటి గురించి చర్చించుకోండి కానీ గొడవ పడకండి. భేదాభిప్రాయాలు ఉన్న విషయాలపై మాట్లాడుకోండి, కానీ అవి గొడవలుగా మారకుండా చూసుకోండి. వీలైనంత వరకూమీ ఇద్దరికీ నచ్చే విషయాలు, షేర్ చేసుకునే హాబీలపై ఎక్కువ దృష్టి పెట్టండి.
పని లేదా చదువుల వల్ల భాగస్వామి దూరంగా ఉంటే నాణ్యమైన సమయం ఉండదు. భావోద్వేగంగా, శారీరకంగా దగ్గరగా ఉండలేకపోవడం, మళ్లీ ఎప్పుడు కలుస్తారో తెలియకపోవడం వంటివి చాలా కష్టం.
ఇలాంటప్పుడు తరచుగా వీడియో కాల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఎప్పుడూ టచ్‌లో ఉండండి. వీడియో కాల్‌లో కలిసి సినిమాలు చూడండి, ఆన్‌లైన్ గేమ్స్ ఆడండి. వీలైనప్పుడల్లా ఒకరినొకరు కలుసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మళ్లీ ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని ప్లాన్ చేసుకోండి. ఇది మీలో ఆశను నిలుపుతుంది.
ఎక్కువ పని గంటలు, ప్రయాణాలు, పని ఒత్తిడి వల్ల సంబంధాలకు సమయం కేటాయించలేకపోవచ్చు. పని ఒత్తిడి భాగస్వామిపై కోపం తెచ్చుకోవడానికి లేదా మూసుకుపోవడానికి దారితీయొచ్చు. చాలా మంది జంటలు కలిసి సమయం గడపలేకపోతున్నామని చెబుతారు. కాబట్టి వారానికి కనీసం 5 గంటల నాణ్యమైన సమయాన్ని మీ భాగస్వామితో గడపడానికి కేటాయించండి. అది డేట్ నైట్ కావచ్చు, లేదా కేవలం మాట్లాడుకోవడం కావచ్చు.ఇంటికి రాగానే పని గురించి ఆలోచించడం తగ్గించండి. అలాగే భాగస్వామి పని ఒత్తిడిలో ఉన్నప్పుడు అర్థం చేసుకోండి. ఒకరికొకరు సాయం చేసుకోండి. పట్టించుకోవడం లేదని ఇబ్బంది పెట్టకండి.
చిన్నతనంలో తల్లిదండ్రుల నుండి ఎదురైన తిరస్కరణ, నిర్లక్ష్యం వంటివి పెద్దయ్యాక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఇది మిమ్మల్ని భావోద్వేగంగా దూరం చేయవచ్చు లేదా అతిగా అతుక్కుపోయేలా చేయవచ్చు.మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. చిన్ననాటి అనుభవాలు మీ ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోండి. మీ భాగస్వామితో మీ చిన్ననాటి గాయాల గురించి నిజాయితీగా మాట్లాడండి. అవసరమైతే, కౌన్సెలింగ్ తీసుకోండి. ఇది చిన్ననాటి గాయాలను తగ్గించి, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది.