పురుషుల లైంగిక జీవితం గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు!-5 essential facts about male sexual life every woman should understand ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పురుషుల లైంగిక జీవితం గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు!

పురుషుల లైంగిక జీవితం గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు!

Ramya Sri Marka HT Telugu

ఇద్దరు భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధం మాత్రమే సరిపోదు, శారీరక సంబంధం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం పురుషుల లైంగిక జీవితానికి సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి మాట్లాడుకుందాం, ఇవి మీ శారీరక బంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

భార్య తెలుసుకోవాల్సిన విషయాలు (Shutterstock)

ఒక మంచి బంధం నిలబడాలంటే ప్రేమ, అభిమానం మాత్రమే కాదు, శారీరకం సంబంధం కూడా చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుని, కలిసి ఉన్నప్పుడే వారి బంధం మరింత బలంగా ఉంటుంది. కానీ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే.. లైంగిక విషయాల గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మగవాళ్ల లైంగిక ఆరోగ్యం గురించి అయితే చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. నిజానికి భార్యాభర్తలు ఒకరి ఇష్టాలు, అలవాట్లు తెలుసుకోవాలంటే ఒకరి లైంగిక ఆరోగ్యం గురించి మరొకరు స్పష్టంగా, లోతుగా తెలుసుకోవాలి. మీరు కూడా మీ బంధం బలంగా ఉండాలంటే మీ భర్త లైంగిక జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి. ఈ 5 విషయాలు మీ లైంగిక జీవితాన్ని బాగుచేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాయి.

1. మగాళ్లు ఎల్లప్పుడూ మూడ్‌లో ఉంటారని అనుకోకండి

కొంతమంది ఆడవాళ్లు తమ భర్త ఎల్లప్పుడూ శృంగారానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటారు. ఇది చాలా మంది ఆడవాళ్ల ఫీలింగ్ కూడా. ఒకవేళ వారు శృంగారానికి నిరాకరిస్తే వెంటనే రకరకాల అనుమానాలకు తావిస్తారు. వారికి తమపై ఆసక్తి తగ్గిపోయిందని లేదా ప్రేమించడం లేదని అనుకోవడం మొదలు పెడతారు. నిజానికి ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. మీ భర్త శృంగారానికి నిరాకరించడానికి అనేక రకాల కారణాలు ఉండచ్చు. వారి మానసిక స్థితి బాగోలేకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు లేదా మరేదైనా వ్యక్తిగత సమస్య ఉండొచ్చు. కాబట్టి పురుషులు ఎల్లప్పుడూ శృంగారానికి సిద్ధంగా ఉంటారనే అపోహను వదలండి. మీ భర్తను ఇబ్బంది పెట్టకండి.

2. మానసిక ఒత్తిడి కూడా వారి పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలుసుకోండి

మీ భాగస్వామి శృంగారంలో అంతగా ఆసక్తి చూపకపోతే లేదా వారి లైంగిక ప్రవర్తనలో మార్పు కనిపిస్తే దానర్థం వారికి మీరంటే బోర్ కొట్టిందనీ, మీతో విసుగు చెందారని కాదు. నిజానికి మనిషి ఎదుర్కొనే మానసిక ఒత్తిడి వారి లైంగిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ భర్త విషయంలో కూడా అదే అయి ఉండచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా ఏదైనా భావోద్వేగపరమైన బాధ వారిని వేధించవచ్చు. వారి మనసు నిండా ఇలాంటి ఆలోచనలు ఉంటే వారిని తప్పుగా అర్థం చేసుకోకండి. వీలైతే వారి బాధను పంచుకునే ప్రయత్నం చేయండి.

3. పురుషులందరూ తమ మనసులోని మాటను బయటపెట్టలేరు

పురుషులు తమ లైంగిక కోరికల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతారని చాలామంది అనుకుంటారు. స్త్రీలతో పోలిస్తే ఇది నిజమే కావచ్చు. కానీ ప్రతి పురుషుడు తన మనసులోని మాటను అంత సులభంగా బయటపెట్టలేడు. భయాలు, సంకోచాల కారణంగా కొందరు తమ కోరికలను వ్యక్తం చేయలేకపోవచ్చు. మీ భాగస్వామి కూడా అలాంటి స్వభావం కలవారైతే మీరు వారికి ధైర్యం చెప్పడం ద్వారా వారిలోని బిడియాన్ని తొలగించవచ్చు.

4. పురుషులు కూడా తమ శరీరం గురించి అభద్రతా భావంతో ఉంటారు:

లైంగిక సంబంధం సమయంలో అమ్మాయిలు తరచుగా తమ శరీరం, రూపం గురించి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. పురుషులు విషయంలో కూడా ఈ భావన ఉంటుంది. ముఖ్యంగా వారి పరిమాణం, శక్తి, రూపం, శరీరం గురించి పురుషులు కూడా కొన్నిసార్లు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. వయోజన చిత్రాలు వారిలో ఈ అభద్రతా భావాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సందర్భాల్లో మీ మద్దతు, తీర్పు చెప్పని వైఖరి వారికి ధైర్యాన్నిస్తుంది.

5. పురుషులకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి

హార్మోన్ల మార్పుల వల్ల అమ్మాయిలకు తరచుగా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. పురుషుల్లో కూడా ఇది జరుగుతుంది. వారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది వారి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వారు కొన్నిసార్లు చాలా ఉద్వేగానికి లోనవుతారు లేదా శక్తి కోల్పోయినట్లుగా ఉంటారు. మీ భాగస్వామి అలా ఉన్నప్పుడు వారిని నిందించకుండా మీ మద్దతు వారికి ఇవ్వండి. మిమ్మల్ని మునపటిలా ప్రేమించడం లేదని ఆలోచించకండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.