తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా ఛానెల్ తో పోటీ పడలేకపోతున్న జీ తెలుగు తరచూ తమ సీరియల్స్ టైమ్ మారుస్తూ వస్తోంది. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈసారి ఐదు సీరియల్స్ టైమ్ మార్చేసింది. సోమవారం (మే 19) నుంచే ఈ కొత్త టెలికాస్ట్ వేళలు అమల్లోకి వచ్చాయి.
జీ తెలుగు తమ ఛానెల్లో వచ్చే ఐదు సీరియల్స్ టైమ్ ను మరోసారి మార్చింది. ఈ ఏడాది మార్చి చివర్లో ఒకసారి చాలా సీరియల్స్ టైమ్ మార్చడంతోపాటు శని, ఆదివారాల్లో పలు సీరియల్స్ టెలికాస్ట్ ను నిలిపేసింది. ఇక ఇప్పుడు మరో 50 రోజులు తిరగకముందే మళ్లీ కొన్ని సీరియల్స్ టైమ్ మార్చడం గమనార్హం. తాజాగా వచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఇక నుంచి మా అన్నయ్య సీరియల్ మధ్యాహ్నం 3.30 గంటలకే ప్రసారం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకూ ఈ సీరియల్ వస్తుంది. ఇన్నాళ్లూ ఈ సీరియల్ సాయంత్రం 6 గంటలకు వచ్చేది.
అటు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఇక నుంచి సాయంత్రం 6 గంటలకే రానుంది. ఇన్నాళ్లూ 6.30 గంటలకు టెలికాస్ట్ చేయగా.. అరగంట ముందుకు జరిపారు. ఈ సీరియల్ కూడా సోమవారం నుంచి శనివారం వరకు టెలికాస్ట్ అవుతుంది. ఇక రాత్రి 8 గంటలకు ప్రసారమవుతూ వస్తున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ఇక నుంచి సాయంత్రం 6.30 గంటలకే రానుంది. జీ తెలుగులో వచ్చే టాప్ టీఆర్పీ రేటింగ్స్ లో ఇదీ ఒకటి.
ఇక కొన్నాళ్లుగా జీ తెలుగులో టాప్ లో ఉంటూ వస్తున్న చామంతి సీరియల్ టైమ్ కూడా మార్చేశారు. రాత్రి 8.30 గంటలకు బదులుగా.. 8 గంటలకే ఈ సీరియల్ ను ప్రసారం చేయబోతున్నారు. రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే జగద్ధాత్రి సీరియల్ ను 8.45 గంటలకు మార్చడం విశేషం. ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకే టెలికాస్ట్ అవుతుంది.
స్టార్ మా సీరియల్స్ తో పోలిస్తే జీ తెలుగు సీరియల్స్ వెనుకబడిపోతున్నాయి. క్రమంగా టాప్ 10లో చోటు కోల్పోతున్నాయి. 18వ వారం రేటింగ్స్ లో ఒక్క చామంతి సీరియల్ మాత్రమే 6.10తో పదో స్థానంలో ఉంది. మిగిలిన 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కావడం విశేషం.
దీంతో జీ తెలుగు పోటీలో ఉండటానికి ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. టైమింగ్స్ మార్చడంతోపాటు జీ5 ఓటీటీలోకి కూడా ఆలస్యంగా వీటిని తీసుకొస్తోంది. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. మరి తాజాగా మార్పులు ఎంతమేర ప్రభావం చూపిస్తాయో చూడాలి.
సంబంధిత కథనం