NNS 19th August Episode: అరుంధతికి మిస్సమ్మ వాయనం.. ఆనందంలో అమర్.. ఆత్మను కనిపెట్టేసిన మనోహరి!
NNS 19th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్లో అరుంధతికి మిస్సమ్మ వాయనం ఇస్తుంది. పూజ చాలా బాగా జరిగిందంటూ అమర్ కుటుంబం ఆనందంలో ఉంటుంది. అటు మనోహరి ఎలాగైనా అరుంధతి ఆత్మను కనిపెట్టాలని ప్రయత్నిస్తుంది.
NNS 19th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 19) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్తోపాటు పూజలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ మనోహరి బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం, తన తల్లిదండ్రులను చూడటమే తనకు ఉన్న కోరికలని చిత్రగుప్తతో చెబుతుంది అరుంధతి. నీ కన్నవారు ఎవరో తెలిసి కూడా నీకు సాయం చేయలేకపోతున్నాను బాలిక.. నీ అంత పుణ్యాత్మురాలిని చంపిన ఆ బాలిక తప్పక శిక్ష అనుభవిస్తుంది అని మనసులో అనుకుంటాడు చిత్రగుప్త.
ఆనందంలో అమర్ ఫ్యామిలీ
పూజ బాగా జరిగినందుకు అమర్ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆరు ఉన్నప్పుడు జరిగినట్లే ఈరోజు కూడా చాలా బాగా జరిగిందని, నిన్ను చూస్తుంటే, నీ పూజ చేసే విధానం చూస్తుంటే అచ్చం ఆరుని చూసినట్లే ఉందని ముత్తైదువులు కూడా అన్నారంటుంది నిర్మల. అవును మిస్సమ్మ ఈరోజు నిన్ను చూస్తుంటే.. అచ్చం ఆరుని చూసినట్లే ఉంది అంటాడు శివరామ్.
ఎందుకో ఈరోజు ఆరు లేదనే లోటు కనిపించలేదు. పూజంతా ఆరు మనతోనే ఉన్నట్లు అనిపించింది అంటుంది నిర్మల. రాథోడ్ రావడంతో ప్రసాదం తెస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంది మిస్సమ్మ. తనని ఆగమని థ్యాంక్స్ మిస్సమ్మ అంటాడు అమర్. ఎందుకండీ.. అంటుంది మిస్సమ్మ. ఈరోజు నువ్వు ఆరు లేని లోటు తీర్చావు. పూజలో తను నాతోనే ఉన్నట్లు అనిపించింది అంటాడు అమర్.
అరుంధతికి మిస్సమ్మ వాయనం
అదంతా వింటున్న మనోహరి కోపంతో రగిలిపోతుంది. అమర్ భార్య స్థానం నాది, నువ్వు , మీ అక్క కలిసి నా దగ్గర నుంచి ఆ స్థానాన్ని లాక్కున్నారు అనుకుంటుంది. మనోహరి చిరాగ్గా ఉండటం చూసి ఈరోజు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క మనోహరి గారు తప్ప అంటుంది మిస్సమ్మ. అదేం లేదు అని కంగారు పడుతుంది మనోహరి. నలుగురికి వాయనాలు ఇచ్చావు.. ఇంకొకరికి ఇస్తే పూజ పూర్తవుతుంది లక్ష్మికి ఇచ్చేద్దాం అంటుంది నిర్మల. ఎందుకు అత్తయ్య.. పక్కింటి అక్కకి ఇస్తాను అని బయల్దేరుతుంది మిస్సమ్మ.
పక్కింటి అక్క అంటుందంటే ఇది కచ్చితంగా అరుంధతి గురించే అంటోంది. ఎలాగైనా ఈరోజు దానికి అరుంధతి కనిపిస్తుందో కనిపెట్టాలి అని పైకి వెళ్లి నిల్చుంటుంది మనోహరి. చిత్రగుప్తతో మాట్లాడుతున్న అరుంధతిని చూసి మీరు ఇక్కడే అన్నారా అక్క.. మీ కోసమే వస్తున్నా అంటుంది మిస్సమ్మ. ఆ బాలిక వస్తుంది కన్నీళ్లు తుడుచుకో అంటాడు చిత్రగుప్త.
అరుంధతి ఆత్మను చూసిన మనోహరి
మిస్సమ్మ వచ్చి అక్కా.. ఏంటి అలా ఉన్నారు అంటుంది. నీవల్ల ఈ ఏడాది కూడా పూజ చేసుకోగలిగా మిస్సమ్మ అంటుంది అరుంధతి. అదేంటక్కా.. మీరు పూజ చూశారు కదా.. చేశానంటారేంటి? అంటుంది మిస్సమ్మ. వెంటనే అదే మిస్సమ్మ.. చూశా అంటున్నా.. అని కవర్ చేస్తుంది అరుంధతి. వెనకాల నుంచి మిస్సమ్మ అరుంధతిని మనోహరి గమనించడం చూసి కంగారుపడతాడు గుప్త.
జగన్నాథా.. నువ్వే రక్ష అని వేడుకుంటాడు. సరే అక్కా ఇదిగోండి వాయనం అని భాగీ అరుంధతికి వాయనం ఇస్తుంది మిస్సమ్మ. మనోహరి అరుంధతి ఆత్మను కనిపెడుతుందా? అమర్, మిస్సమ్మను విడదీసేందుకు ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!