NNS 18th July Episode: అరుంధతి అస్థికలు ఎక్కడున్నాయో తెలుసుకున్న మనోహరి.. అమర్ ఇంటికి రణ్‌వీర్..!
NNS 18th July Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (జులై 18) ఎపిసోడ్లో అరుంధతి అస్థికలు ఎక్కడున్నాయో మనోహరి తెలుసుకుంటుంది. మరోవైపు అమర్ ఇంటికి రణ్‌వీర్ వస్తాడు.
NNS 18th July Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జులై 18) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. స్నేహితురాలని నమ్మినందుకు తననే చంపి తన కుటుంబాన్ని అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతున్న మనోహరి గురించి తలుచుకుంటూ బాధపడుతుంది అరుంధతి.
అమర్ కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తూ ఉంటారు. మనోహరికి పొలమారుతుంది. ఎవరో తలుచుకుని ఉంటారు అంటాడు అమర్. నన్ను ఎవరు తలుచుకుంటారు నా అరుంధతి తప్ప అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది మనోహరి.
అస్థికలపై ఆరా తీసిన మనోహరి
ఇంట్లోకి రాకుండా చేసినందుకు గేటు బయట కూర్చుని తిట్టుకుంటూ ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఆరు అస్థికల గురించి మాట్లాడ్డానికి ఇదే సరైన సమయం అనుకుంటూ.. అస్థికలను నదుల్లో కలపడం గురించి ఆంటీ, అంకుల్ నీతో మాట్లాడారా అమర్ అని అడుగుతుంది మనోహరి. అదేంటి మనోహరి అంటాడు అమర్. అదే అమర్.. అస్థికలను నదుల్లో కలిపితే ఇంట్లో సమస్యలు తీరిపోయి దోష నివారణ జరుగుతుందని అంటుంది మనోహరి.
అప్పుడే మిస్సమ్మ.. అదేంటి మనోహరి గారు దోష నివారణ కోసం మీరు గుమ్మానికి తాయత్తు కట్టారు కదా అని అడుగుతుంది. తాయత్తు ఏంటి మనోహరి అంటాడు అమర్. కంగారు పడుతుంది మనోహరి. పొద్దున్న గుడికి వెళ్తే పూజారిగారు ఇచ్చి గుమ్మానికి కట్టమన్నారు అమర్.. అందుకే కట్టాను అంటుంది మనోహరి. ఇంతకీ అస్థికలు నదిలో ఎప్పుడు కలుపుదామంటుంది.
తెలిసిపోయిన అస్థికల జాడ
రేపు గుడికి వెళ్లినప్పుడు పంతులుగారిని అడిగి మంచిరోజు ఏదో చెప్పమందామంటాడు శివరామ్. ఇంతకీ అస్థికలు ఎక్కడ ఉన్నాయి అమర్ అంటుంది మనోహరి. అందరూ మనోహరి వైపు చూస్తారు. అంటే భద్రంగా ఉన్నాయా అని అడిగాను అంటుంది. అస్థికలు స్మారక భవనంలో ఉన్నాయని చెబుతాడు అమర్.
భద్రంగానే ఉంటాయి కదా అని ఆరా తీస్తుంది మనోహరి. హా.. లాకర్లో ఉన్నాయి. దాని తాళం నా దగ్గరే ఉంది. నేను తప్ప వాటిని ఎవరూ తీయలేరు అంటాడు అమర్. దొరికావే అరుంధతి. నీ అస్థికల్ని ఆ ఘోరాకి ఇచ్చి నీపీడ విరగడ చేయిస్తాను అని లోలోపలే సంబరపడుతుంది మనోహరి. తాయత్తు వంక చూస్తూ మనోహరి సంబరపడటంతో అనుమానంగా చూస్తుంది మిస్సమ్మ.
అమర్ ఇంటికి రణ్‌వీర్
మనోహరిని వెతుక్కుంటూ రణ్‌వీర్ అమర్ ఇంటికి వస్తాడు. అరుంధతి అతన్ని చూసి పరిగెత్తుకెళ్లి మనోహరి గురించి చెబుతుంది. మనోహరి లాన్లో ఫోన్ మాట్లాడుతుండటం చూసి చంపేయడానికి ప్రయత్నిస్తాడు రణ్‌వీర్. కానీ అతని అనుచరులు బలవంతంగా అతన్ని అక్కడ నుంచి తీసుకెళ్తారు. కుక్కలు మొరగడంతో మనోహరి ఎవరో వచ్చారని గేటు దగ్గరగా వస్తుంది.
ఆయన మంచి పనే చేస్తున్నారు వదిలేయండి అంటుంది అరుంధతి. మనోహరి బయటకు వచ్చి ఎవరూ లేరుగానీ కుక్కలెందుకు మొరుగుతున్నాయని చూసి లోపలకు వెళ్లబోతూ ఇక్కడే ఉన్నావా నా ప్రాణస్నేహితురాలా.. ఇన్నాళ్లు పక్కనే ఉండి అన్నీ చూశావు. లోపల ఏం జరిగిందో నీకు తెలియదు. పోనీ నేను చెప్పనా.. ఇవాళ నేను, అమర్ కలిసి భోజనం చేశాం. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా.. నీ అస్థికలు మరో రెండ్రోజుల్లో నదిలో కలవబోతున్నాయి. అప్పటివరకు ఈ గేటు దగ్గరే పడి కుళ్లికుళ్లి చావు అంటూ లోపలకు వెళ్లిపోతుంది.
భాగీలో మొదలైన అనుమానం
హఠాత్తుగా మనోహరి అరుంధతి అస్థికల గురించి అడగడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిస్సమ్మ. రాథోడ్ వచ్చి పరధ్యానంగా ఉన్న మిస్సమ్మను పిలిచి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. తనకు వచ్చిన అనుమానాన్ని రాథోడ్‌తో చెబుతుంది మిస్సమ్మ. అస్తమానం అస్థికల గురించి ఎందుకు అడుగుతుంది? ఎప్పుడూ లేనిది అస్థికలు కలపమంటుంది? అస్థికలు ఎక్కడ ఉన్నాయని ఎందుకు అడుగుతుంది? అని తన అనుమానం ఏంటో చెబుతుంది.
ఆ ఘోరాతో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుమానపడుతుంది. భాగీ మనోహరి ప్లాన్ కనిపెడుతుందా? రణ్‌వీర్ మనోహరిని ఎలా చేరుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జులై 18న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్