NNS 17th June Episode: అమ్ము మిస్సింగ్.. మిస్సమ్మను గెంటేసిన అమర్.. అరుంధతికి తెలిసిన నిజం
NNS 17th June Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (జూన్ 17) ఎపిసోడ్ లో అమ్ము కనిపించకుండా పోతుంది. దీంతో మిస్సమ్మపై చేయి చేసుకుంటాడు అమర్.
NNS 17th June Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సోమవారం (జూన్ 17) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ పిల్లల్ని తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆనంద్, ఆకాష్ కారు ఆపమని ఐస్‌క్రీమ్ తినడానికి పరిగెడతారు. అమ్ము, మిస్సమ్మ ఎంత చెప్పినా వినకుండా పరిగెత్తి ఐస్‌క్రీమ్ తింటారు. మిస్సమ్మ అమ్ముని కూడా తినమని చెప్పడంతో సరే అంటుంది. అమ్ము ఐస్‌క్రీమ్ తింటూ ఉండగా మిస్సమ్మ మిగతా పిల్లలను కార్లో కూర్చోబెట్టేందుకు వెళ్తుంది.
ఇంతలో ఘోరా మారువేషంలో వచ్చి అమ్ముని వశీకరణ మంత్రం ద్వారా లొంగదీసుకుని వెంట తీసుకుని వెళ్తాడు. అమ్ము కనిపించకపోవడంతో మిస్సమ్మ, పిల్లలు కంగారు పడి చుట్టు పక్కల వెతుకుతారు. కానీ ఎక్కడా అమ్ము కనిపించకపోవడంతో వెంటనే ఇంటికి వెళ్లి డాడీకి చెబుదామంటుంది అంజు. చేసేదేం లేక ఏడ్చుకుంటూ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది మిస్సమ్మ.
అమర్‌కి మనోహరి ఫోన్
ఘోరా దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అమ్ము తన ఆధీనంలోనే ఉందని, తన పనులన్నీ పూర్తయ్యేంత వరకి అమ్ము తన దగ్గరే ఉంటుందని ఫోన్ చేసి మనోహరితో చెబుతాడు ఘోర. ఏం చేసినా అమ్ముకి మాత్రం ఏంకాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది మనోహరి. సరేనంటాడు ఘోర. మిస్సమ్మను ఇరికించేందుకు ఇదే మంచి సమయమని వెంటనే అమర్‌కి ఫోన్ చేసి పిల్లల్ని మిస్సమ్మ ఇంకా ఇంటికి తీసుకుని రాలేదని చెబుతుంది.
అదేంటి ఇంతసేపైనా పిల్లలు ఇంటికి రాకపోవడమేంటి ఓసారి మిస్సమ్మకి ఫోన్ చేయమంటాడు అమర్. చేశాను కానీ తను ఫోన్ తీయడం లేదని అబద్ధం చెబుతుంది మనోహరి. సరే.. తాను ఇంటికి వస్తున్నానని చెప్పి రాథోడ్‌ని కారు ఇంటికి పోనిమ్మని చెబుతాడు. కంగారుగా ఇంటికి వచ్చిన అమర్‌ని చూసి అమ్ముకి ఏదో అపాయం జరగబోతోందని, వెంటనే కాపాడమని బతిమాలుతుంది అరుంధతి.
మనోహరి నాటకం
ఇంటికి వచ్చిన అమర్‌తో మిస్సమ్మతో తాను మాట్లాడానని, మరికాసేపట్లో పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారని చెబుతాడు శివరామ్. కానీ మనోహరి మాత్రం అసలు పిల్లల్ని మిస్సమ్మతో పంపించకుండా ఉండాల్సింది అంటుంది. అదేంటి మనోహరి.. ఇందాకే కదా మిస్సమ్మ పిల్లల్ని బాగా చూసుకుంటుందని నువ్వే తనతో పిల్లల్ని పంపించావు అంటాడు శివరామ్.
అసలు మిస్సమ్మ ధ్యాసంతా పిల్లల మీద లేదని, అమర్‌తో కొత్త జీవితం ప్రారంభించడం మీదే ఎక్కువ దృష్టి పెడుతోందని అంటుంది. ఒకసారి కాల్ చేసి చూస్తానంటున్న శివరామ్‌తో లేదంకుల్.. తను ఫోన్ తీస్తే నేను, అమర్ ఇంతగా ఎందుకు కంగారు పడతాం అంటూ దేవుడా.. పిల్లలకి ఏం కాకుండా చూడు అంటూ వేడుకున్నట్లు నటిస్తుంది.
మిస్సమ్మను కొట్టిన అమర్
అప్పుడే మిస్సమ్మ పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుంది. అందరూ బయటకు పరిగెత్తుకుని వస్తారు. ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు తీయడం లేదంటాడు అమర్. భయపడిపోతున్న మిస్సమ్మని చూసి అమర్‌ని ఆగమంటుంది నిర్మల. అమ్ము లేకపోవడం చూసి ఏమైందని అడుగుతాడు అమర్. అమ్ము కనపడలేదని, చుట్టుపక్కల వెతికామని అంటుంది మిస్సమ్మ. వెంటనే కోపంతో మిస్సమ్మ చెంప చెళ్లుమనిపిస్తాడు అమర్. అందరూ ఆశ్చర్యపోతారు. మనోహరి మాత్రం సంబరపడిపోతుంది.
పిల్లల్ని నిన్ను నమ్మి పంపించకుండా ఉండాల్సింది, మోసం చేసే నీకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలుసని నమ్మడం నాదే తప్పు అని కోప్పడతాడు అమర్. ఏడుస్తున్న మిస్సమ్మను చూసి రాథోడ్, నిర్మల, శివరామ్ బాధపడతారు. గుప్త దగ్గరకు పరిగెత్తి అసలు అమ్ముకి ఏం జరిగిందో చెప్పమని బతిమాలుతుంది అరుంధతి. నేను పదేపదే చెబుతున్నా నువ్వు వినడం లేదు, నువ్వు ఒక ఆత్మవి మాత్రమే అనేది గుర్తుంచుకో అంటాడు గుప్త.
నా కూతురిని ఎలాగైనా కాపాడుకుంటాను. తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష నాకే వేయండి ప్లీజ్ అని వేడుకుంటుంది అరుంధతి. అమ్ము ఆ ఘోరా దగ్గర బందీగా ఉందని, నువ్వు ఆ బాలికను కాపాడటం అసంభవం అంటాడు గుప్త. ఒక్కసారిగా షాకవుతుంది అరుంధతి. ఘోరా అమ్ముని ఏం చేస్తాడు? అమ్ముని కాపాడేందుకు అరుంధతి ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జూన్ 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్