NNS 15th August Episode: మంగళ గౌరీ వ్రతంలో అరుంధతి.. అమ్మవారి ప్రత్యేక వరం.. షాక్‌లో మనోహరి.. సంబరాల్లో అమర్ కుటుంబం!
NNS 15th August Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్లో అరుంధతే మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. ఆమెకు అమ్మవారి ప్రత్యేక వరం ఉండటం చూసి మనోహరి షాక్ లో ఉండగా.. అమర్ కుటుంబం సంబరాలు చేసుకుంటుంది.
NNS 15th August Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఆగస్ట్ 15) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చిత్రగుప్త, అరుంధతి మాట్లాడుకుంటూ ఉండగా మిస్సమ్మ కుంకుమ తీసుకుని బయటకు వచ్చి అరుంధతిని పూజకు రమ్మని పిలుస్తుంది. ఏంటి మిస్సమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అని అడగ్గానే ఈరోజు మంగళగౌరి వ్రతం చేస్తున్నానని మిస్సమ్మ చెప్పడంతో అవును నేను మర్చిపోయాను అంటుంది అరుంధతి.
ఇంట్లోకి అరుంధతి
అయితే మా ఇంట్లో పూజకు రా అక్కా అంటూ బొట్టు పెట్టి పిలవబోతుంటే ఆరు దూరంగా వెళ్తుంది. ఇంతలో మిస్సమ్మ, ఆరు చెయ్యి పట్టుకుంటుంది. దాంతో ఆరు షాక్ అవుతుంది. మిస్సమ్మ, ఆరు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది. పిల్లలు కూడా అరుంధతి కోసం ఉపవాసం ఉండి పూజ చేస్తానంటారు. ఇంట్లో అందరూ పూజ చేస్తాననడంతో అందరినీ ఉపవాసం ఉండమని వంట చేయదు మిస్సమ్మ.
ఆకలికి తట్టుకోలేక శివరామ్ తినేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే నిర్మల రూమ్‌లోకి వచ్చి అరుంధతి ఫొటో తీస్తుంది. అరుంధతి బతికి ఉండగా ఒక్క సంవత్సరమైనా మంగళ గౌరీ వ్రతం చేయకుండా లేదండీ.. ఈరోజు తను మన మధ్య లేకపోయినా ఈ ఫొటో పెడితే మనతో ఉన్నట్లే ఉంటుంది అని బాధపడుతుంది. ఒక్క యాక్సిడెంట్‌తో నా కోడలితో పాటు కూతురిని కూడా కోల్పోయాను అని ఏడుస్తున్న నిర్మలను ఓదారుస్తాడు శివరామ్.
అమ్మవారికి అరుంధతి పూజ
మిస్సమ్మ తనని ఎలా ముట్టుకోగలిగిందని ఆశ్చర్యపోతుంది అరుంధతి. అదంతా అమ్మవారి కృప. నువ్వు ప్రతీ సంవత్సరం వ్రతం చేసినందున నీకు ఈ వరం ప్రసాదించింది. వెళ్లి పూజ చేసుకో అంటాడు చిత్రగుప్తుడు. సరేనని ఇంట్లోకి వెళ్తుంది అరుంధతి. పిల్లలు పూల మాలలు కడుతూ, వాళ్లని చూసి సంతోషపడుతుంది. తనకు ఇంత గొప్ప వరం ప్రసాదించినందుకు కృతజ్ఞత చెబుతూ అమ్మవారి ముందు కూర్చుని కుంకుమార్చన చేసి పూలతో పూజ చేస్తుంది.
కుంకుమ, పూలు వాటంతట అవే అమ్మవారిపై పడుతున్నాయని గ్రహించిన అంజు మిగతా పిల్లలకు కూడా చెప్పడంతో అక్కడ ఏం జరుగుతుందని చూడటానికి అరుంధతి ఆత్మ దగ్గరగా వస్తారు పిల్లలు. అంజు కావాలనే అబద్ధం చెబుతుందని అందరూ కలిసి ఏడిపిస్తారు. తను చెబుతుంది నిజమని వాదిస్తుంది అంజు. కానీ ఎంతకీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో అరుస్తుంది.
అరుంధతి ఫొటోను మిస్సమ్మ చూస్తుందా?
అప్పుడే శివరామ్ అక్కడకి వచ్చి ఏమైంది పిల్లలు అని అడుగుతాడు. జరిగింది చెప్పడంతో నిర్మల ఆశ్చర్యపోతుంది. పిల్లలు వాదించుకుంటూ ఉండగా శివరామ్, నిర్మల ఆలోచనలో పడతారు. అరుంధతే వచ్చి పూజ చేసినట్లు ఉందంటుంది నిర్మల. అంటే.. అమ్మ వచ్చిందా..! అని ఆశ్చర్యపోతారు పిల్లలు. అరుంధతి ఫొటో తెచ్చి హాల్లో పెడుతుంది నిర్మల.
ఆ ఫొటో మిస్సమ్మ కంటబడితే తను ఆత్మనని తెలిసిపోతుందని, ఎలాగైనా ఆ ఫొటోని అక్కడ పెట్టకుండా చూడాలని అనుకుంటుంది అరుంధతి. మిస్సమ్మ వాయనం తీసుకోడానికి ముత్తైదువులను పిలుచుకుని వస్తుంది. అరుంధతి మళ్లీ ఏ సమస్య తీసుకొస్తుందోనని ఆలోచిస్తూ ఉంటాడు గుప్త. అప్పుడే అరుంధతి పరిగెత్తుకుంటూ వచ్చి లోపల జరిగిదంతా చెబుతుంది.
మళ్లీ నన్ను సమస్యల్లో పడేయడానికి పూనుకున్నావా అని కోప్పడతాడు. అదే కాదు మరో సమస్య కూడా ఉందని తన ఫొటో గురించి చెబుతుంది. అరుంధతి ఫొటోని మిస్సమ్మ చూస్తుందా? అరుంధతి ఆత్మ అని తెలిసిపోతుందా? చిత్రగుప్త మిస్సమ్మ ఆ ఫొటో చూడకుండా ఏం చేస్తాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!